Jul 5 2021 @ 20:41PM

ఆ చిత్రాన్ని జయసుధే నిర్మిస్తానని ముందుకొచ్చారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 26)

‘మామగారు’ చిత్రం పూర్తయిన తర్వాత మళ్లీ ‘కలికాలం’ కథపై దృష్టి పెట్టాను. ఆ సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మా స్నేహితుడు శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాను. వాస్తవానికి నేను దర్శకుడిగా నిలదొక్కుకున్న తర్వాత శ్రీనివాసరెడ్డి నాతో సినిమా తీస్తానంటూ వచ్చాడు. అయితే నేనే అప్పుడు అతడిని నిరుత్సాహపరిచాను. ‘‘బాగా డబ్బు సంపాదించు. సినిమా తీసి డబ్బు పోగొట్టుకున్నాగానీ, ఆర్ఠిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదనిపించినప్పుడు రా. అప్పుడు సినిమా తీద్దాం’’ అని చెప్పి పంపించేశాను. నన్ను అర్థం చేసుకుని వాడు వెళ్లిపోయాడు. ‘కలికాలం’ సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మా శీనయ్య గుర్తుకొచ్చాడు. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌. కానీ ఎవరూ తీయడానికి ముందుకు రావడం లేదు. అందుకే మొండిధైర్యం చేసి మా శీనయ్యకు కబురు చేశా.


‘‘చిన్న సినిమారా.. కథ బాగుంది. నువ్వు చేస్తే బాగుంటుంది’’ అని ఫోన్‌లోనే మా శీనయ్యకు విషయం చెప్పా. వాడు నా దర్శకత్వంలో సినిమా తీయడానికి ఎప్పటినుంచో రెడీగా ఉన్నాడు కనుక, ‘‘దాందేముందీ, అలాగే చేద్దాం’’ అన్నాడు. ‘‘అయితే ఓ ఆరు లక్షలు పంపించు. రేపు జయసుధ దగ్గరకు వెళుతున్నాం. ఆమెకు కథ నచ్చితే అడ్వాన్స్‌ ఇచ్చేద్దాం’’ అని చెప్పగానే సరేనన్నాడు. నేను, రచయిత తోటపల్లి మధు కలసి జయసుథ ఇంటికి వెళ్లాం. ఆవిడతో పరిచయం ఉందిగానీ అంతవరకూ కలసి పనిచేసే అవకాశం రాలేదు. కారణాలు తెలియవు కానీ ఆర్టిస్ట్‌గా జయసుధకు చాలా గ్యాప్‌ వచ్చింది. ఆమె నటించిన సినిమా విడుదలై రెండున్నరేళ్ళైంది. అయినా ఈ కథకు జయసుధే కరెక్ట్‌ అని మొదటినుంచీ నా అభిప్రాయం. ఆమె ఒప్పుకుంటే సినిమా సగం సక్సెస్‌ అయినట్లే అనుకున్నాను. మమ్మల్ని ఆమె బాగానే రిసీవ్‌ చేసుకున్నారు. తోటపల్లి మధు స్టోరీ నేరేట్‌ చేశాడు. పూర్తి ఏకాగ్రతతో విందామె. అంతా పూర్తయిన తర్వాత ఆమె ఆలోచనలో పడ్డారు. ఏం చెబుతుందా అని నేను ఎదురుచూస్తున్నాను. ‘‘సుబ్బయ్యగారూ..నాకు కొంచెం టైమ్‌ కావాలి. రేపు వదిలేయండి. ఎల్లుండి మనం కలుద్దాం. అప్పుడే ఫైనల్‌ చేద్దాం’’ అన్నారు. కథ ఆమెకు నచ్చిందని అర్థమైంది. ‘సరే ఇన్ని నెలలు వెయిట్‌ చేశాం. రెండు రోజులు ఆగమంది కదా, ఆగుదాం’ అని మనసులోనే అనుకుని ‘‘సరే, వస్తానమ్మా’’ అని చెప్పి వచ్చేశాం.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా శీనయ్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. ‘‘జయసుధ ఓ.కే. అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నువ్వు డబ్బు ఎప్పుడు పంపిస్తావు?’’ అని అడిగాను. ఇప్పట్లోలా ఆ రోజుల్లో క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాలు ఉండేవి కావు. డీడీ తియ్యాలి, మరీ అర్జెంట్‌ అయితే మనిషికి డబ్బు ఇచ్చి పంపించాల్సిందే. ‘‘ఒక రోజు ముందుచెప్పు చాలు.. నీకు డబ్బు అందే ఏర్పాటు చేస్తా’’ అని అభయం ఇచ్చాడు మా శీనయ్య. రెండు రోజులు ఆగి నేనే జయసుధకు ఫోన్‌ చేశాను. ఇంటికి రమ్మన్నారామె. వెళ్లాను. ‘‘సుబ్బయ్యగారూ, ఈ సినిమాకు నిర్మాత ఎవరు?’’ అని ప్రశ్నించారు.


‘‘నిర్మాత ఎవరనేది ఇంకా ఫైనల్‌ కాలేదమ్మా. మా స్నేహితుడు శ్రీనివాసరెడ్డి కావచ్చు. నిర్మాత ఎవరైనా మీరు తప్పకుండా ఈ సినిమాలో నటించాలి’’ అన్నాను. ‘‘సుబ్యయ్యగారూ, మా జె.కె. బేనరులో సినిమా తీసి చాలా కాలమైంది. మళ్లీ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. కథల కోసం వెదుకుతున్నాం. అలాగే నేను రెండున్నరేళ్లనుంచీ నటనకు దూరంగా ఉన్న విషయం మీకు తెలుసు. మంచి పాత్రలు దొరక్క గ్యాప్‌ తీసుకున్నాను. మీరు చెప్పిన కథ వినగానే నాకు మళ్లీ నటించాలనే కోరిక కలిగింది. అంతేకాదు, ఈ కథని మా బ్యానర్‌లోనే తీయాలనిపించింది. ఈ సినిమా మాకు ఎందుకు చేయకూడదూ’’ అని అడిగారు. నాకు ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. నా మౌనాన్ని అర్థం చేసుకుని ‘‘నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. కొత్త నిర్మాత అంటున్నారు, మేకింగ్‌ విషయం మీరు చూసుకుంటారు, కానీ ఇతర వ్యవహారాలు, పబ్లిసిటీ ఇదంతా ఆయన చూసుకోగలడా! మీరు అనుకుంటున్న బడ్జెట్‌లోనే మాకు సినిమా తీసివ్వండి, మేమేం జోక్యం చేసుకోం’’ అన్నారు జయసుధ.


35 లక్షల్లో ఆ సినిమా తీయాలని బడ్జెట్‌ వేసుకున్నాను. ఆ విషయమే ఆమెకు చెప్పాను. ‘‘ఆ బడ్జెట్‌లోనే మాకు సినిమా తీసి ఇవ్వండి’’ అని మరోసారి ఆమె అడిగారు. వెంటనే నా నిర్ణయం చెప్పడానికి కొంత సందేహించాను. . ‘ఈ సినిమా తియ్యాలని మా శీనయ్యతో చెప్పానుకదా, ఈ విషయం తెలిస్తే వాడు ఏమనుకుంటాడో!’ అందుకే ‘‘ఒక రోజు టైమ్‌ ఇవ్వండమ్మా, ఆలోచించుకుని చెబుతా’’ అనేసి ఇంటికి వచ్చేశాను. ఇంటికి రాగానే మా శీనయ్యకు ఫోన్‌ చేసి జయసుధ అన్న మాటల్ని చెప్పాను. ‘‘ఈ సినిమాలో స్టార్స్‌ ఉండరు. కేవలం కథాబలం మీదే ఈ సినిమా ఆడాలి. పబ్లిసిటీ దమ్ముతో ఆడించాలని జయసుధ చెప్పిన మాటలు నిజమే. మరేం చేద్దామంటావు?’’ అని అడిగాను. ‘‘నువ్వు ఎలా చెబితే అలా’’ అన్నాడు శీనయ్య. ‘‘అయితే ఒక పని చేద్దాం, ఈ కథ జయసుధకు ఇచ్చేద్దాం. మరో మంచి కథతో మనం సినిమా చేద్దాం’’ అని నేను చెప్పగానే శీనయ్య ఇంకేమీ అనలేదు. ‘‘నీ ఇష్టం’’ అని ఊరుకున్నాడు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...