Jul 2 2021 @ 21:06PM

పారితోషికం ఇస్తేనే ఫంక్షన్‌కి వస్తానన్నాను: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 23)

ఆ సమయంలోనే నిర్మాత హరికృష్ణగారు మళ్లీ లైనులోకి వచ్చారు. ఆయన నాతో అంతకుముందు తీసిన మూడు చిత్రాలకు ఇచ్చిన పారితోషికం అంతంత మాత్రమే. నాలుగో సినిమా ‘మమతల కోవెల’. రాజశేఖర్‌, సుహాసిని ముఖ్యజంట. నాకున్న మొహమాటం కొద్దీ ఈసారి కూడా హరికృష్ణగారిని పారితోషికం గురించి అడగలేకపోయాను. అయితే నా మిత్రుడు చిన్నబ్బాయ్‌తో ఓ మాట అన్నాను. ‘‘ఏంటిది గురువా, మూడు సినిమాలు చేశాను. సరైన పారితోషికం ఇవ్వలేదు. నేను హరికృష్ణగారిని అడగలేను. సినిమాకు ఇంత అని ఆయనే పారితోషికం ఫిక్స్‌ చేయవచ్చుకదా’’ అన్నాను. ‘‘లేదన్నా, ఈ సినిమాకు ఓ అమౌంట్‌ అనుకున్నారు. రెండున్నరలక్షలు ఇద్దామన్నారు’’ అన్నాడు చిన్నబ్బాయ్‌. సర్లే అనుకున్నాను. ‘మమతల కోవెల’ షూటింగ్‌ మొదలైంది, పూర్తయింది కూడా. సినిమా హిట్‌ అయింది. వందరోజుల ఫంక్షన్‌కి ప్లాన్‌ చేశారు. అప్పటికీ నాకు డబ్బు ఇవ్వలేదు. ఫంక్షన్‌కు రమ్మని నాకు కబురు చేశారు. నాకు కడుపు రగిలిపోయింది. వెంటనే చిన్నబ్బాయ్‌కు ఫోన్‌ చేశాను.


‘‘గురువా, మనసులో ఒకటిపెట్టుకొని పైకి మరోరకంగా మాట్లాడటం నాకు చేతకాదు. ఫంక్షన్‌లో నేను స్టేజ్‌ ఎక్కి సినిమా హిట్‌ అయిందనీ, నిర్మాతలు అద్భుతంగా సినిమా తీశారనీ మాట్లాడలేను. నా మనసు ఒప్పుకోదు కూడా. ఈ నిర్మాత నాకు పారితోషికం ఇవ్వలేదని వేదికమీద చెప్పడం కూడా భావ్యం కాదు. అలాగని ఆయన్ని పొగడలేను. హరికృష్ణగారు నాకు కొత్త జీవితం ప్రసాదించారు. ఆయన అంటే నాకు ఎప్పుడూ గౌరవభావమే. కానీ పారితోషికం ఇవ్వకపోతే ఎలా గురువా, అందుకే నేను ఫంక్షనకు రాను’’ అని నిర్మొహమాటంగా చెప్పేశా. ‘‘అన్నా అలా అనొద్దు, నీకెందుకు నేను డబ్బు ఇప్పిస్తాను, రా’’ అని నన్ను బలవంతంగా లాక్కెళ్లాడు చిన్నబ్బాయ్‌. ఫంక్షన్ బాగా జరిగింది కానీ నాకు పారితోషికం మాత్రం అందలేదు. నేను చాలా బాధపడ్డాను. ‘ఇంత కష్టపడుతున్నాను, డబ్బు ఇవ్వకపోతే ఎలా?’ అనుకున్నాను.

ఆ సినిమా చేయనన్నాను

‘మమతల కోవెల’ తర్వాత నేను చేసిన సినిమా ‘జయసింహ’. చెన్నైలోని సవేరా హోటల్స్‌ అధినేత ఎ.వి.కె. రెడ్డిగారు ఆ చిత్రానికి నిర్మాత. వాళ్లు అంతకుముందు విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో ‘శ్రుతిలయలు’ సినిమా తీశారు. చాలా మంచి సినిమా అది. అయినా కమర్షియల్‌గా హిట్‌ కాకపోవడంతో ఈసారి యాక్షన్‌ సినిమా తీయాలని వారి ప్లాన్‌. ఆ తరహా చిత్రాలకు హీరో సుమన్‌ కరెక్ట్‌ పర్సన్‌ కావడంతో ఆయన డేట్స్‌ తీసుకున్నారు. హీరోయిన్‌గా భానుప్రియను అనుకున్నారు. ఆ సినిమాను డైరెక్ట్‌ చేయమని నా దగ్గరకు వచ్చారు. వారి ప్రపోజల్‌ వినగానే నేను ఇబ్బందిగా మొహం పెట్టాను. ఎందుకంటే అంతవరకూ నేను కంప్లీట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ చేయలేదు. ఆ తరహా చిత్రాలకు నేను సూట్‌ కానని నా అభిప్రాయం. ఆ విషయమే నిర్మాతలకు చెప్పాను. ‘‘ఏదైనా ఫ్యామిలీ డ్రామా చేద్దాం. లేదూ మీకు యాక్షన్ ఫిల్మ్‌ కావాలంటే మరో దర్శకుడి దగ్గరకు వెళితే మంచిదేమో’’ అన్నాను. కానీ వాళ్లు నన్ను వదిలిపెట్టలేదు. ‘‘సార్‌, యాక్షన్ ఫిల్మ్‌ తీయాలన్నది మా కోరిక. సుమన్‌ డేట్స్‌ బ్లాక్‌ చేశాం. మీతో సినిమా తీయాలనుకుంటున్నాం. సబ్జెక్ట్‌ ఎంపిక బాధ్యత మీదే’’ అనేయడంతో ఒప్పుకోక తప్పిందికాదు. హరనాథరావు మంచి కథ చెబుతానన్నాడుగానీ చెప్పలేదు. టైమ్‌ దగ్గర పడుతోంది కానీ కథ రెడీ కాలేదు. ఇలా రోజులు గడుస్తున్న తరుణంలో ఓ రోజు నేను ‘కాలధర్మం’ అనే నాటకం చూశాను. శ్రీరాజ్‌ రచయిత. నాకు బాగా నచ్చింది. సినిమాకు పనికొచ్చే పాయింట్‌.


నిర్మాతలకు నచ్చజెప్పి ఆ నాటకం రైట్స్‌ కొనిపించాను. దాన్ని సినిమాగా తీద్దామని చెప్పాను. కానీ నిర్మాతలకు యాక్షన్‌ సినిమా మీదే కోరిక ఉంది. కానీ కథ రెడీ కాలేదు. సుమన్ ఇచ్చిన డేట్స్‌ దగ్గర పడటంతో నిర్మాతలు నా మీద ఒత్తిడి పెంచారు. ఆ సమయంలో నేనూ బిజీగా ఉన్నాను. ఈ సినిమా చేయకపోతే సుమన్‌ డేట్స్‌తో పాటు నా డేట్స్‌ కూడా వేస్ట్‌ అవుతాయి. అందుకే ఆఖరి క్షణంలో గొల్లపూడి మారుతీరావు దగ్గరకు వెళ్లాం. ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’ సబ్జెక్ట్‌ డిస్కషన్స్‌లో ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆయన దగ్గర నాకు చనువు ఉండటంతో వెళ్లి అడిగాను. ‘‘కంగారు పడకు. నా దగ్గర ఓ స్టోరీ లైన్‌ ఉంది. విను’’ అని చెప్పారు. సుమన్‌కి, నిర్మాతలకు కూడా ఆ స్టోరీ లైన్‌ నచ్చింది. కంప్లీట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌. నా స్కూల్‌ కాదు. అయినా సరే గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆ సినిమా చేశాను. ఆ సినిమా పేరు ‘జయసింహ’.


షూటింగ్‌ పూర్తయింది. నాకు పారితోషికంలో ఓ లక్ష రూపాయలు బ్యాలెన్స్‌ ఉండిపోయింది. దాని కోసం ఓ రోజు ఆఫీసుకు వెళ్లాను. మాటల మధ్యలో ‘కాలధర్మం’ నాటకం ప్రస్తావన వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ నాటకాన్ని ఓ ప్రముఖ దర్శకునితో సినిమా తీయాలని నిర్మాతలు భావించారు. డిస్కషన్స్‌ కోసం కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. కానీ ఎందువల్లనో వాళ్లకి అది వర్కవుట్‌ అవలేదు. నాకు మాత్రం ఆ నాటకం మీదే మనసు ఉండిపోయింది. దాని అధారంగా ఓ మంచి సినిమా తీయవచ్చు అనిపించింది. అందుకే ‘‘గురువుగారూ, మీరేమీ అనుకోకపోతే ఒకటి అడుగుతాను. మీరు ‘కాలధర్మం’ రైట్స్‌ కొన్నారు. మీరు ఆ కథతో సినిమా తీయడంలేదని తెలిసింది. ఆ రైట్స్‌ నాకు ఇవ్వగలరా?’’ అని ఎ.వి.కె. రెడ్డిగారిని అడిగాను. ‘‘దాందేముంది.. తీసుకోండి’’ అనేశారు. వాళ్లు అప్పటికిదాకా ఆ స్ర్కిప్ట్‌ గురించి ఓ లక్షరూపాయల దాకా ఖర్చుపెట్టారు. నాకు ఎలాగూ లక్షరూపాయలు వాళ్ళివ్వాలి కనుక, దానికి బదులు రైట్స్‌ నాకు రాసిచ్చేశారు. అలా ‘కాలధర్మం’ సినిమా హక్కులు నా చేతికి వచ్చాయి.

(ఇంకా ఉంది)

- వినాయకరావు

FilmSerialమరిన్ని...