Jul 1 2021 @ 21:30PM

ఇప్పుడా సినిమా ప్రింట్‌ ఎక్కడుందో ఎవరికీ తెలీదు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 22)

‘ఇదా ప్రపంచం’ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే శివలింగేశ్వరరావుగారు వచ్చి అడ్వాన్స్‌ ఇచ్చారని చెప్పాను కదా. తమిళంలో హిట్‌ అయిన ‘పరవైగళ్‌ పలువిధమ్‌’ సినిమా రైట్స్‌ ఆయన కొన్నారు. ఆ చిత్రం ఆధారంగా ‘చిన్నారి స్నేహం’ సినిమా తీశాం. యువతకు ప్రతీకలుగా నిలిచిన మూడు జంటల ఉద్వేగ పయనం ఈ చిత్రం. అలాగే ఆరు జీవితాల అంతరంగ మథనం కూడా. చంద్రమోహన్‌, రెహమాన్‌, దగ్గుబాటి రాజా హీరోలు. సీత, శ్రీదుర్గ (ఆ తర్వాత ఆమె ‘మాలాశ్రీ’గా పేరు మార్చుకుంది), పూజ హీరోయిన్లు. ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి తిరిగిన ఈ ఆరుగురూ, కాలేజీ చదువు పూర్తి కావడంతో ఒకరికొకరు వీడ్కొలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డిసెంబర్‌ 31న మళ్లీ తామంతా ఓ చోట కలసి ముచ్చటించుకోవాలని నిర్ణయించుకుని బాధగా విడిపోతారు. అనుకున్న ప్రకారం డిసెంబర్‌ 31న ఆ ఆరుగురూ కలుస్తారు. కానీ వాళ్ల ముఖాల్లో మునపటి ఉత్సాహం కనిపించదు. దానికి కారణం ఆ సంవత్సరకాలంలో విధి వాళ్లతో ఆడుకున్న చదరంగమే. గౌరవంగా జీవించే బతుకుతెరువు కోసం వాళ్లు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమై ఒక్కొక్కరు ఒక్కోతీరులో తమకు తామే సిగ్గుపడే రీతిలో ఉంటారు. కానీ ఆ నిజం చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఎవరికివారు అందమైన అబద్ధాలు చెప్పుకుంటారు. ఆ రోజంతా సరదాగా గడిపి మళ్లీ విడిపోతారు. చివరకు వాళ్లలో నలుగురు తమ స్నేహబంధాన్ని కల్యాణబంధంతో ముడివేసుకుంటారు. మిగిలిన ఓ జంటకు మాత్రం నూరేళ్లు నిండి వారికి శాశ్వతంగా దూరమవుతారు. ‘చిన్నారి స్నేహం’ షూటింగ్‌ నెల్లూరు, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగింది. చాలా మంచి సబ్జెక్ట్‌. సినిమా కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రింట్‌ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. రైట్స్‌ ఎవరికి అమ్మారో కూడా తెలీదు.

విజయశాంతి వందో సినిమా!

‘చిన్నారి స్నేహం’ షూటింగ్‌ జరుగుతుండగానే ‘భారతనారి’ స్ర్కిప్ట్‌ వర్క్‌ మొదలుపెట్టాం. స్టోరీ లైన్‌ హరనాథరావుదే అయినా, రచయిత, నటుడు సంజీవి కూడా స్ర్కిప్ట్‌ మీద బాగా వర్క్‌ చేశారు. తండ్రిచాటు బిడ్డగా, అన్నయ్యచాటు చెల్లిగా, భర్తచాటు భార్యగా గుట్టుగా కాపురం చేసుకునే ఓ మహిళ ఈ అస్తవ్యస్త వ్యవస్థలో అంచెలంచెలుగా తనకు జరిగిన దురాగతాలవల్ల, ఎలా శక్తి స్వరూపిణిలా మారిందన్నది సినిమా ఇతివృత్తం. డిఫరెంట్‌ లేడీ సబ్జెక్ట్‌. అందులోనూ విజయశాంతికి నూరవ చిత్రం కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్ర్కిప్ట్‌ ఫైనలైజ్‌ చేశాం. ఈతరం సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘నేటి భారతం’ జూన్‌ 15న ప్రారంభం కావడంతో సెంటిమెంట్‌గా ఆ రోజున కొత్త చిత్రం షూటింగ్‌ మొదలుపెట్టడం నిర్మాత పోకూరి బాబూరావుకు అలవాటు. అలాగే 1989 జూన్‌ 15న ఒంగోలులో ‘భారతనారి’ షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం దాదాపు పదిహేను రోజులు నైట్‌ షూటింగ్‌ చేశాం. ఇంటర్వెల్‌, పతాక సన్నివేశం నైట్‌ ఎఫెక్ట్‌లోనే ఉంటాయి. టీచర్‌ భారతి పాత్రలో విజయశాంతి నటించారు. ఆగస్ట్‌ 15న జెండా వందన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా దారిలో ఎస్‌.ఐ జగన్‌ (దేవరాజ్‌) అడ్డుకుని టీచర్‌ భారతిపై అత్యాచారం చేస్తాడు. ప్రతిఘటించిన ఆమె భర్త (వినోద్‌కుమార్‌) హత్యకు గురువుతాడు. గాంధీ, నెహ్రు వేషధారులైన పిల్లలముందే ఈ అకృత్యం జరుగుతుంది. ఇటువంటి సంఘటన జరిగినాగానీ, విలన్‌ అంటే ఉన్న భయంవల్ల, న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. సి.ఐ.గా ప్రమోషన్‌ పొందిన ఆ ఎస్‌.ఐ.ను చివరకు జనం సమక్షంలోనే టీచర్‌ భారతి వధించడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో వేలు విలన్‌గా నటించడం ఓ విశేషం. ‘భారతనారి’ బాగా ఆడింది. నాకు, విజయశాంతికి మంచి పేరు తెచ్చిన సినిమా ఇది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...