Jun 26 2021 @ 20:17PM

ఆ కారు వచ్చాక కలిసొచ్చింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 21)

గతంలో కంటే ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నా సొంత ఇల్లు కొనే సాహసం చేయలేదు నేను. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ల చదువులు, ఇతర ఖర్చులకే నా ఆదాయం సరిపోయేది. అందుకే సొంత ఇల్లు అనేది ఓ కలగానే ఉండేది. కాకపోతే వలసరవాక్కంలో చవకగా వస్తోందంటే స్థలం మాత్రం కొన్నాను. టి.కృష్ణగారు, కృష్ణగారు, బాబూరావు, నర్రా, సాయికుమార్‌, వేలు స్థలాలు కొనుక్కొంటూ నన్ను కూడా తీసుకోమన్నారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అది. ‘ధర్మయుద్ధం’ చిత్రానికి రత్నం ఇచ్చిన పారితోషికంతో ఆ స్థలం కొనుగోలు చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పడం మరచిపోయాను. ‘ఇదా ప్రపంచం’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే నిర్మాత శివలింగేశ్వరరావుగారు నాతో సినిమా చేయాలని అడ్వాన్స్‌ ఇచ్చారు. నా మేలు కోరే వ్యక్తి ఆయన. నాకు మంచి స్నేహితుడు. ‘మన సుబ్బయ్య అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతనికి ఓ మంచి ఇల్లు చూడాలి’ అనే సదుద్దేశంతో నాకు తెలియకుండానే నా కోసం ఇల్లు వెతుకుతూ ఉండేవారు ఆయన.


రంగరాజపురంలో రైల్వే ట్రాక్‌ దగ్గర్లో దర్శకుడు బీరం మస్తానరావు ఉండేవారు. ఆయన ఫ్లాట్‌ అమ్ముతున్నారని తెలిసి బేరం అడి నా పేరు మీద కొనేశారు. ఆ విషయం నాకు తెలీదు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘సుబ్బయ్యా.. నీకు ఓ ఇల్లు చూశాను. చూద్దువుగానీ రా’ అని నన్ను తీసుకెళ్లారు. సెకండ్‌ ప్లోర్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌. నాకూ బాగా నచ్చింది. ‘బాగుందికానీ, మరి డబ్బు..’ అన్నాను. ‘ఆ విషయం నాకు వదిలెయ్యి. నేను చూసుకుంటాను’ అని భరోసా ఇచ్చారు శివలింగేశ్వరరావు. సినిమాకి పారితోషికం డబ్బురూపంలో ఇవ్వకుండా ఫ్లాట్‌ రూపంలో ఇవ్వడమే కాకుండా, ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేసి ఆ ఫ్లాట్‌ నాకు ఆప్పగించారు. డబ్బు ఇస్తే ఖర్చైపోతుందని ఆయన అలా చేశారు. నా గురించి అంతలా ఆలోచించే మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం.

అదంతా కారు మహిమే!

అంతే కాదు. గృహప్రవేశం జరిగినరోజే కారు తాళాలు తెచ్చి నా చేతికిచ్చి నన్ను మరింత సర్‌ప్రైజ్‌ చేశారు శివలింగేశ్వరరావు. అప్పటికే నా కొలీగ్స్‌ చాలామంది కార్లలో తిరుగుతున్నారు. నాకూ కారు కొనాలనే ఆలోచన ఉందిగానీ ఇంత త్వరగా ఆ కోరిక తీరుతుందనుకోలేదు. ‘కిందకు రా.. కారు చూపిస్తా’ అని శివలింగేశ్వరరావు అనగానే సరేనని కిందకు వెళ్లా. పాత కాలపు వైట్‌ కలర్‌ ఫియెట్‌ కారు. 6787 అనే నంబర్‌ ఎండకు మిలమిలా మెరిసిపోతోంది. చూసీచూడగానే ఆ కారు నాకు బాగా నచ్చేసింది. సెకండ్‌ హాండ్‌ కారే అయినా చాలా బాగుంది. నాకు డ్రైవింగ్‌ రాదు కనుక శివలింగేశ్వరరావే ఓ డ్రైవర్‌ను పెట్టారు. ఇంతకీ ఆ కారు ఎవరిదంటే, దర్శకుడు తాతినేని రామారావుగారిది. కెరీర్‌ బిగినింగ్‌లో ఆయన కొన్న తొలి కారు అది. తర్వాత ఆయన చాలా కార్లు మార్చినా సెంటిమెంట్‌ కారణంగా, ఈ కారును అలాగే తన దగ్గర ఉంచేసుకున్నారు. శివలింగేశ్వరరావుగారికి, రామారావుగారికి మంచి స్నేహం. ‘ఇన్ని కార్లు కొన్నారు కదా. ఇంకా ఆ పాత ఫియెట్‌ ఎందుకు’ అని ఓ రోజు అడిగారట. ‘నాకు బాగా కలిసొచ్చిన కారయ్యా అది. అందుకే మార్చడం లేదు.. అయితే కొత్త కార్లు పెట్టుకోవడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం, మంచి వాళ్లు ఎవరైనా అడిగితే ఇద్దాం’ అన్నారట. ‘మంచో చెడో నువ్వు అమ్ముతావు కదా, ముత్యాల సుబ్బయ్య అని మనవాడే ఉన్నాడు. మంచివాడు. అతనికి ఇచ్చేసెయ్‌’ అని చెప్పి నా కోసం ఆ కారు కొన్నారు శివలింగేశ్వరరావు.


మనిషికి ఆశలు ఉండటం సహజమే. సొంత ఇల్లు ఉండాలని, సొంత కార్లో తిరిగాలనీ ఆశ నాకూ ఉండేది. కానీ అంత త్వరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు. అవి రెండూ నాకు సమకూర్చిన శివలింగేశ్వరరావును మాత్రం ఎప్పుడూ మరచిపోలేను. వలసరవాకంలో స్థలమైతే కొన్నానుగానీ చేతిలో డబ్బు లేకపోవడంతో అంతవరకూ ఇల్లు కట్టుకోలేకపోయాను. కానీ ఫియెట్‌ కారు మా ఇంటికి వచ్చిన వేళా విశేషం బాగుంది. వెంటవెంటనే డబ్బులు సమకూరడంతో, ఇల్లు కట్టడం మొదలుపెట్టాను. వచ్చిన సంపాదనలో కొంత భాగం ఇంటికి కేటాయించడంతో చూస్తుండగానే ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. ఇదంతా కారు మహిమే! 

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...