Jun 24 2021 @ 20:40PM

హార్ట్‌లో బ్లాక్స్‌.. సర్జరీ అన్నారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 20)

‘సగటు మనిషి’ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే పోకూరి బాబూరావుగారు కొత్త సినిమా నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. ‘నవభారతం’ ఆ సినిమా పేరు. పల్లెలు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ చెప్పిన మాటను బేస్‌ చేసుకొని తయారు చేసిన కథ ఇది. స్టోరీ లైన్‌ మరుధూరి రాజాది. మాటలు కూడా అతనే రాశాడు. ‘సగటు మనిషి’ చిత్రానికి చాలా మంచి సీన్లు రాసినా టైటిల్స్‌లో అతని పేరు వేయలేదు. అదంతా వాళ్ల అన్న హరనాథరావు అకౌంట్‌లోకి వెళ్లింది. రచయితగా రాజా టైటిల్స్‌లో పడిన తొలి సినిమా ‘నవభారతం’.‘ఇదా ప్రపంచం’ సినిమా నుంచి రచయిత సంజీవి నాతో ట్రావెల్‌ చేసేవారు. ఆయన కూడా ఈ చిత్రకథాచర్చల్లో పాల్గొన్నారు. ‘నవభారతం’ నిరుద్యోగ సమస్యతో విసిగివేసారి పోయిన ముగ్గురు యువకులు రఘుపతి(రాజశేఖర్‌), రాఘవ(నరేశ్‌), రాజారామ్‌(‘శుభలేఖ’ సుధాకర్‌), ఓ లేడీ డాక్టర్‌ (జీవిత) ప్రేరణ పొంది, అభివృద్ధికి నోచుకోని ఓ గ్రామానికి చేరుకుంటారు.


మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మూఢ నమ్మకాలకు నిలయమైన ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. సినిమాలో ముగ్గురు హీరోలతో పాటు ఓ దున్నపోతు కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఒంగోలులో ఆ దున్నపోతుని కొన్నాం. ఈ సినిమాలో విలన్‌గా దేవరాజ్‌ నటించారు. గ్రామంలో తనకు ఎదురు తిరిగిన వారిపైకి దున్నపోతుని వదిలేస్తుంటాడు. అలా ఎంతోమంది గ్రామస్తులు, అధికార్లు అతని చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుని గ్రామంలోకి అడుగుపెట్టిన ముగ్గురు యువకులు డూప్లికేట్స్‌ అని విలన్‌కు తెలిసిపోతుంది. ప్రభుత్వానికి అతను ఫిర్యాదు చేయగానే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్‌ చేస్తారు. అయితే గ్రామమంతా ఎదురు తిరుగుతుంది. తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఈ ముగ్గురినీ శిక్షించడానికి వీల్లేదంటూ కోర్టు ముందు ధర్నా చేస్తారు. ఇదంతా చూసిన జడ్జి, ‘ప్రభుత్వాన్ని మోసం చేసిన మిమ్మల్ని నిజంగా శిక్షించాల్సిందే. అయితే, రాష్ట్రంలో ఏ గ్రామాలు అభివృద్ధి చెందలేదో ఆ గ్రామాలను మీరు అభివృద్ధి చేయాలి. మీకు అదే శిక్ష’ అని తన తీర్పు ప్రకటిస్తారు. చాలా మంచి సబ్జెక్ట్‌. ‘నవభారతం’ బాగా ఆడింది. నాకు మంచి పేరు తెచ్చింది.

తొలి రీమేక్‌

అంతవరకూ నేను రీమేక్‌ చిత్రాలు తీయలేదు. రచయితలతో కూర్చుని వండుకొన్న కథలే. అయితే తొలిసారిగా నిర్మాతగా మారిన రూపశిల్పి ఎ.ఎం.రత్నం కోసం ‘భూమి ఇలే రాజ్‌కన్‌ మార్గ్‌’ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్‌ చేయాల్సి వచ్చింది. విజయశాంతికి మేకప్‌మ్యాన్‌ కనుక నాకు మొదటినుంచీ బాగా తెలుసు. అందుకే ‘సినిమా తీసిపెట్టవా..’ అని అడిగితే కాదనలేకపోయాను. రాజశేఖర్‌, రజని జంటగా నటించిన ఆ సినిమా పేరు ‘ధర్మయుద్ధం’.


ఇక్కడ కొన్ని విషయాల గురించి మీకు నిర్మొహమాటంగా చెప్పాలి. అవేమిటంటే, సినిమా తర్వాత సినిమా చేస్తూ నేను బిజీగా ఉండేవాడిని. వరుస విజయాలు వచ్చినా పారితోషికం మాత్రం పెరిగేది కాదు. ఎందుకంటే నాతో సినిమాలు తీయడానికి వచ్చిన వాళ్లంతా నాకు బాగా కావాల్సినవాళ్లే కావడం ప్రధాన కారణం. బయట నిర్మాతలు వస్తే పారితోషికం డిమాండ్‌ చేసి ఉండేవాడినేమో. కానీ అందరూ తెలిసినవాళ్లే కావడంతో డబ్బు విషయంలో మొహమాట పడ్డాను. వాళ్లు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడిని. డే అండ్‌ నైట్‌ షూటింగ్స్‌ ఉండేవి. ఆ రోజుల్లో బాగా సిగరెట్లు కాల్చేవాడిని. టెన్షన్‌ ఎక్కువైతే రెండేసి ప్యాకెట్లు కూడా కాల్చిన రోజులున్నాయి. పదే పదే టీ తాగడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం.. ఇవన్నీ నా ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి. ‘ధర్మయుద్ధం’ సినిమా కోసం లొకేషన్లు చూడటానికి వెళ్లినప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం కొంచెం కష్టమైంది. ఆయాసం వచ్చేది. అంతకుముందు ఎప్పుడూ అలా లేకపోవడంతో ‘ఏమిటిదీ, ఏదో తేడా వచ్చినట్లుందే’ అనిపించింది. డాక్టర్‌ భార్గవ్‌ అని నాకు ఫ్రెండ్‌. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ప్రస్తుతం యశోదాలో చేస్తున్నాడు. మా యూనిట్‌లో శరత్‌ అనే మేకప్‌మ్యాన్‌.. ఆ డాక్టర్‌ని నాకు గుర్తుచేశాడు. ఆయన్ని పిలిపించాను. ఆయన పరీక్షలు చేసి కార్డియాలజిస్ట్‌ను కలపమన్నాడు. వెళ్లి కలిస్తే ‘హార్ట్‌లో బ్లాక్స్‌ ఉన్నాయి.. స్మోకింగ్‌ వెంటనే మానెయ్యాలి, సర్జరీ చేయించుకోవాలి’ అని బాంబు పేల్చాడు. సర్జరీ చేయించుకోవడానికి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో తర్వాత మళ్లీ మీకు వివరిస్తాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...