Jun 20 2021 @ 20:49PM

స్టార్‌ హీరోతో నా తొలి సినిమా అదే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 18)

1987 ఫిబ్రవరి 15న మంగళగిరిలో ప్రారంభమైన ‘ఇదా ప్రపంచం’ చిత్రం షూటింగ్‌ 35 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షూటింగ్‌తో పూర్తయింది. హరికృష్ణగారి దగ్గర పెద్దబ్బాయ్‌, చిన్నబ్బాయ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వీళ్లిద్దరూ ప్రొడక్షన్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ హరికృష్ణగారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. చిన్నబ్బాయ్‌ నాకు సన్నిహిత మిత్రుడు. ‘కల్యాణతాంబూలం’ షూటింగ్‌ కోసం ఆయన ఊటీలో ఉండేవారు. ‘ఇదా ప్రపంచం’ ప్రస్థావన వచ్చినప్పుడల్లా ఆయన ‘ఏమిటయ్యా మీ సినిమా గురించి గొప్పగా చెబుతావు, మా చిత్రంలో గుర్రం బడ్జెట్‌ అంత లేదు’ అని జోక్‌ చేస్తుండేవారు. ‘కల్యాణతాంబూలం’లో ఓ తెల్ల గుర్రం ఉండేది. దానికయ్యే ఖర్చు ‘ఇదా ప్రపంచం’ బడ్జెట్‌తో సమానమన్నమాట. నిజం చెప్పాలంటే హరికృష్ణగారి దృష్టంతా ‘కల్యాణతాంబూలం’ మీదే ఉండేది.


తన అభిమాన దర్శకుడు బాపుతో సినిమా తీస్తుండటంతో నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఆ సినిమా కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ‘ఇదా ప్రపంచం’ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. పబ్లిసిటీ విషయంలో కూడా కేర్‌ తీసుకోకపోవడంతో మంచి సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లలేకపోయిందనే బాధ నాలో ఇప్పటికీ ఉండిపోయింది. హరికృష్ణగారు వరుసగా నాకు రెండో సినిమా కూడా ఇవ్వడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సర్దుకుపోవడం తప్ప పోట్లాడే మనస్తత్వం కాదు నాది. సర్దుకుపోవడమేగానీ, మరేమీ చేసేవాడిని కాదు.

బాలకృష్ణతో తొలి సినిమా

హరికృష్ణగారి బ్యానర్‌లోనే నాకు మూడో సినిమా చేసే అవకాశం వచ్చింది. నందమూరి బాలకృష్ణగారు నటించిన ఆ సినిమా పేరు ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’. ఆ సమయంలో బాలకృష్ణగారు చాలా బిజీగా ఉన్నారు. రెండేళ్ల వరకూ ఏ కొత్త చిత్రం ఒప్పుకోలేని పరిస్థితి. అయితే హరికృష్ణగారి కుటుంబంతో చక్కని అనుబంధం ఉంది. ఆర్ధికంగా దెబ్బతిన్న హరికృష్ణగారిని ఆదుకోవడం కోసం తనంతట తాను ముందుకు వచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం రావడంతో చాలా ఆనందించాను. 1987 అక్టోబర్‌ 2న విజయదశమిరోజున ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’ చిత్రం షూటింగ్‌ మొదలైంది. బాలీవుడ్‌ జంట జితేంద్ర, శ్రీదేవి మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ రోజున బాలకృష్ణగారు అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ‘స్వర్గీయ టి.కృష్ణగారి దర్శకత్వంలో మా బ్యానర్‌లో ఓ సినిమా చేద్దామనుకొన్నాం. కుదరలేదు. అయితే ఆయన ఆదర్శాలు, లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు.


బాలకృష్ణగారితో పనిచేయడం చాలా హ్యాపీ. మనిషి చాలా సరదాగా ఉంటారు. రామారావుగారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు. శ్రీశైలంలో షూటింగ్‌ చేశాం. గెస్ట్‌హౌస్‌లు బుక్‌ చేశారు. మా షూటింగ్‌ జరిగినన్నీ రోజులూ ఏ గెస్ట్‌ హౌస్‌ బయటవాళ్లకు ఇవ్వలేదు. దీనివల్ల భక్తులు కొంత ఇబ్బందిపడినా తప్పలేదు. ఒకరోజు షూటింగ్‌లో జరిగిన సంగతి చెప్పాలి. ఆర్టిస్టులందరూ ఉన్నారు. గొల్లపూడిగారు, శ్రీవిద్యగారు జంటగా నటించారు. ఆ రోజుతో ఆవిడ వర్క్‌ పూర్తి చెయ్యాలి. ఇంకో రోజు అదనంగా కేటాయిస్తానని ఆవిడ చెప్పారుగానీ ఇవ్వలేదు. దాంతో ఆమెకు సంబంధించిన సీన్లన్నీ పూర్తిచెయ్యాలి. జగ్గయ్యగారు, సత్యనారాయణగారు సహా సినిమాలోని ముఖ్య తారాగణమంతా ఉంది. మూడో సినిమా అయినా ఓ స్టార్‌ హీరోతో చేసే తొలి సినిమా కావడంతో నాకు కొంత కంగారుగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఆవిడ నోట ‘నేను వెళ్లిపోవాలి. మొదట నా సీన్లు తీయండి’ అనడంతప్ప మరొక మాట రాలేదు.


అనుకున్న విధంగా కాంబినేషన్‌ సీన్లు తీయకపోతే పడిన కష్టమంతా వృదా అవుతుంది. దాంతో నాలో బీపీ పెరిగిపోతోంది. ఇక మొండిధైర్యం వచ్చేసి ‘‘అమ్మా.. మీరు ఎన్నింటికి వెళ్లాలి’’ అని అడిగాను. ‘నా ఫ్లయిట్‌ ఎనిమిది గంటలకి. అది మిస్‌ అయితే నాకు ఇబ్బంది’ అన్నారామె. ‘‘సరేనమ్మా, మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను’’ అని మిగిలిన ఆర్టిస్టుల్ని రిక్వెస్ట్‌ చేశాను. ‘‘మీరంతా సహకరిస్తే ఆమె వర్క్‌ పూర్తిచేసి పంపించేస్తాను’’ అని. సరే అన్నారు అందరూ. టోటల్‌ సీన్‌లో ఆవిడ పార్ట్‌ మాత్రమే తీయాలి. మిగతాది తర్వాత తీసుకోవాలి. అంటే సీన్‌లో కొంచెం ముందుకు వెళ్లి, మళ్లీ వెనక్కి వచ్చి తియ్యాలన్న మాట. ఎంతో ప్లాన్డ్‌గా శ్రీవిద్య ఉన్న షాట్స్‌ అన్నీ తీసేసి అనుకున్న సమయానికి ఆమెను పంపించేశాను. కో–డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం నాకు అక్కడ కలసి వచ్చింది. ఆ సినిమాకు కెమెరామన్‌ మోహనకృష్ణ. నాతో ఎలాంటి ఆర్గుమెంట్‌ లేకుండా నేను ఎలా చెబితే అలా చేశారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...