Jun 14 2021 @ 20:53PM

అందులో నా మీసం పక్కకుపోయి కనిపిస్తుంది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 13)

‘వందేమాతరం’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నర్రా వేంకటేశ్వరరావు ఓ పాత్ర వేశారు. ఆయనకు సమవుజ్జీగా ఓ విలన్‌ కావాలి. ఆ పాత్రకు ఎవరిని పెడదామని అనుకుంటున్నాం. కొత్త వాళ్లని ప్రోత్సహించాలనే తపన ఉండేది కృష్ణగారికి. ‘‘ఎవరిని పెడదాం సుబ్బయ్యా’’ అని నన్ను అడిగారు. వెంటనే నాకు స్టేజ్‌ ఆర్టిస్ట్‌ కోట శ్రీనివాసరావు గుర్తుకు వచ్చారు. ఆయన గురించి చెప్పాను. పి.ఎల్‌.నారాయణ కూడా రంగస్థల కళాకారుడే కనుక ‘‘మావా.. మన సుబ్బయ్య చెబుతున్నాడు, ఎవరో కోట శ్రీనివాసరావు అట, స్టేజ్‌ ఆర్టిస్ట్‌. నీకు తెలుసా’’ అని ఆయన్ని అడిగారు కృష్ణ.‘‘కరెక్టే రా.. వాడు మంచి ఆర్టిస్ట్‌. బాగా చేస్తాడు. పిలిపించు’’ అని సర్టిఫై చేశారు పి.ఎల్‌. నారాయణ. అప్పుడు కోట శ్రీనివాసరావును పిలిపించాం. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత విలన్‌ వేషానికి ఓకే చేశారు కృష్ణ.


నువ్వు వేసెయ్‌

కోట శ్రీనివాసరావుకు సహాయకుడి పాత్రలో స్టేజ్‌ ఆర్టిస్ట్‌ రమణారెడ్డిని ఎంపిక చేశాం. నర్రాకు కూడా ఒక సహాయకుడి పాత్ర ఉంటుంది. అయితే చివరిక్షణం వరకూ ఆ పాత్రకు ఎవరినీ ఎంపిక చేయలేదు. ఎవరిని పెడదాం అంటే ‘‘చూద్దాం.. చూద్దాం’’ అంటారే తప్ప ఎవరో చెప్పరు కృష్ణ. ఆయన మనసులో ఎవరున్నారో నాకేం తెలుస్తుంది? ఇక షూటింగ్‌ డేట్‌ దగ్గర పడింది. ‘‘ఆ అసిస్టెంట్‌ వేషం ఎవరో మీరు ఇంకా ఫైనలైజ్‌ చేయకపోతే ఎలా సార్‌’’ అన్నాను. ‘‘నువ్వు వేసెయ్‌ సుబ్బయ్య’’ అని కూల్‌గా చెప్పారు. ఆయన అలా అనేసరికి నేను బిత్తరపోయాను. ఏదో చిన్న వేషం అంటే పరవాలేదు కానీ సినిమా అంతా కనిపించే వేషం. ఒక పక్క కో–డైరెక్టర్‌గా బిజీగా పనిచేస్తూ అంత పెద్ద వేషం వేయడం నా వల్ల అవుతుందా? అదే కృష్ణగారికి చెప్పాను. కానీ ఆయన వదిలిపెట్టలేదు. ‘‘వద్దు సార్‌.. వేరెవరితోనన్నా వేయిద్దాం’’ అని బతిమాలాను కూడా. కానీ ఆయన మొండిపట్టు పట్టి ‘నువ్వు వేయాల్సిందే’ అన్నారు. దాంతో ఇక తప్పలేదు నాకు. మీరు ఆ సినిమాలో నా వేషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడప్పుడు మీసం పక్కకుపోయి కనిపిస్తుంది. ఆర్టిస్టులకు సీన్‌ వివరించి, షాట్‌ కోసం ఏర్పాట్లు చేసి, ‘రెడీ’ అనగానే భుజాన టవల్‌ వేసుకుని కెమెరా ముందు నిలబడేవాణ్ణి. అంత హడావిడి పడుతూ చేసిన ఆ పాత్ర బాగానే క్లిక్‌ అయింది. నా మీద కృష్ణగారికి ఉండే అభిమానం అనండీ, నమ్మకం అనండీ అప్పుడప్పుడు అలా నాతో వేషాలు వేయిస్తుండేవారు.

రాజశేఖర్‌ తొలి తెలుగు సినిమా

మాతో రెండు సినిమాలు చేసిన హీరో సుమన్‌ బిజీ కావడంతో మరో హీరోని వెదుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తవాళ్లని పరిచయం చేయడమంటే కృష్ణగారికి ఇష్టం కనుక ఎవరెవరని అన్వేషణ ప్రారంభించాం. తమిళంలో భారతీరాజాగారి ‘పుదుమై పెణ్‌’ (1984) చిత్రంలో నటించిన డాక్టర్‌ రాజశేఖర్‌ బాగా చేశాడని ఎవరో చెప్పడంతో ఆ సినిమా చూసి ఆయన్ని బుక్‌ చేశారు కృష్ణగారు. రాజశేఖర్‌కు అప్పట్లో తెలుగు అంతగా రాదు. అయినా పాత్రను అర్థం చేసుకుని బాగానే నటించాడు. కృష్ణగారు అతని ప్రతిభకు పదును పెట్టారనే చెప్పాలి.


శోభనబాబు సమర్పణ

లక్ష్మీచిత్ర అధినేత వై.హరికృష్ణగారు ఒకే సమయంలో, ‘దేవాలయం’, ‘వందేమాతరం’ చిత్రాలు ప్రారంభించారని ముందే చెప్పాను కదా. హీరో శోభనబాబుగారు పెట్టుబడి పెట్టారో లేదో తెలీదు కానీ ‘దేవాలయం’ చిత్రానికి సమర్పకుడు ఆయనే. ఒక పక్క గ్లామర్‌ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటిస్తున్న ఆయన, టి.కృష్ణగారంటే ఉన్న అభిమానంతో ఇందులో డీ గ్లామరైజ్డ్‌ పాత్ర పోషించారు. ఇక మా పర్మనెంట్‌ హీరోయిన్‌ విజయశాంతి గురించి చెప్పనక్కర్లేదు. ఆమె కూడా చాలా బాగా చేసింది. రంగస్థల నటుడు యర్రంనేని చంద్రమౌళి హీరోయిన్‌ తండ్రి వేషం పోషించారు. ‘దేహమేరా దేవాలయం..’ అంటూ తొమ్మిది నిముషాల సేపు సాగే పాట ఈ సినిమాకే హైలైట్‌. మనిషే దేవుడు అని ఈ పాటలో చెప్పడానికి కృష్ణగారు ప్రయత్నించారు. చాలా కృష్టపడి తీశాం. ట్రిక్‌ షాట్స్‌ తీయడంలో ఎక్స్‌పర్ట్‌ రవికాంత నగాయిచ్‌. ఆయన ఫొటోగ్రఫీ అద్భుతం. రకరకాల గెటప్స్‌ వేసుకుని ఈ పాటలో నటించారు శోభనబాబుగారు. 1985 మే 15న ‘దేవాలయం’ చిత్రం విడుదలైంది. పెద్దగా ఆడలేదు. ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణగారిని ఆ రిజల్ట్‌ నిరాశ పరిచింది. అయితే మరికొన్ని రోజులకు విడుదలైన ‘వందేమాతరం’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయనకు కొంత ఊరట లభించినట్లయింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...