Jun 11 2021 @ 22:23PM

నేను నిలదొక్కుకోవడానికి కారణం ఆయనే: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 12)

‘ఇది పెళ్ళంటారా’ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ పి.సి.రెడ్డిగారి దగ్గర చేరాను ఆ సమయంలో ఆయన చాలా సినిమాలు చేస్తుండటంతో ఆయన కాదనలేదు. నాతో పాటు బి.గోపాల్‌, పోలవరపు బ్రహ్మానందం, రాధాకృష్ణ తదితరులు పి.సి.రెడ్డిగారి దగ్గర పనిచేసేవారు. చేతినిండా పని ఉండటంతో డబ్బుకు లోటు లేకుండా రోజులు గడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా కెరీర్‌ను చిన్నగా కదిపే సంఘటన జరిగింది. ఎలాగంటే ఒంగోలు నుంచి టి.కృష్ణ, పోకూరి బాబూరావు, నాగేశ్వరరావు తదితర స్నేహబృందం మద్రాసుకు వచ్చారు. మాదాల రంగారావు హీరోగా టి.కృష్ణ ‘విప్లవశంఖం’ చిత్రం తీశారు. ఆ సినిమా తర్వాత మాదాల రంగారావుగారికి, టి.కృష్ణగారికి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో బయటకు వచ్చేశారు.


సొంతంగా సినిమా తీయాలని, టి.కృష్ణని దర్శకునిగా పరిచయం చేయాలని పోకూరి బాబూరావుగారికి బలమైన కోరిక ఉండేది. కృష్ణను అందుకు ఒప్పించారు. టి.కృష్ణగారు, పి.సి.రెడ్డిగారు సన్నిహిత మిత్రులు. పోకూరి బాబూరావుగారు అప్పటికి ఫ్యామిలీ పెట్టలేదు. ఆయన, ఆయన సోదరులు ఆఫీసులోనే ఉండేవారు. ఒకరోజు టి.కృష్ణ, పి.సి.రెడ్డిగారి దగ్గరకు వచ్చి ‘నేను ఎక్కడా పనిచేయలేదు. టెక్నికల్‌గా నాకు హెల్ప్‌ చేయడానికి అనుభవం ఉన్న కో–డైరెక్టర్‌ కావాలి. ముఖ్యంగా ఆ వ్యక్తికి ఎలాంటి ఈగోలు ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉన్న వ్యక్తి అయితే మంచిది’ అని తన మనసులో మాట వెల్లడించారు. ‘‘కృష్ణా నువ్వు కోరుకొన్న లక్షణాలు కలిగిన వ్యక్తి నా దగ్గర ఉన్నాడు. అతనిపేరు ముత్యాల సుబ్బయ్య. ఓ సినిమాకు డైరెక్షన్‌ కూడా చేశారు. సినిమా బాగానే తీశాడు కానీ పెద్దగా ఆడలేదు. తను మళ్లీ కో–డైరెక్టర్‌గా నా దగ్గరే చేస్తున్నాడు. నీకు అతనైతే కరెక్ట్‌’’ అని చెప్పారు పి.సి.రెడ్డిగారు.


ఆ విషయం నాకు చెప్పి ‘‘కృష్ణ కొత్త దర్శకుడు. అతని దగ్గర పనిచేయడానికి నీకేమైనా అభ్యంతరమా?’’ అని పి.సి.రెడ్డిగారు అడిగారు. ‘‘నా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తికే అసిస్టెంట్‌గా పనిచేశా. నాకేమీ అభ్యంతరం లేదు’’ అని చెప్పి ఈతరం పిక్చర్స్‌ ఆఫీసుకు వెళ్లి కృష్ణగారిని కలిశా. ‘‘నేను ఎవరిదగ్గరా పని చేయలేదు సుబ్బయ్యా.. నువ్వు టెక్నికల్‌గా నాకు హెల్ప్ చేయాలి. ఈ ప్రాజెక్ట్‌ నీదనుకుని భావించి వర్క్‌ చేయాలి’’ అని చెప్పారు. ‘‘అలాగే సార్‌’’ అన్నాను. అలా నా డైరీలో కొత్త పేజీ మొదలైంది.

టి. కృష్ణ అన్ని చిత్రాలకు వర్క్‌ చేశా

టి.కృష్ణగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నేటి భారతం’ (1983) సినిమాకు మోదుకూరి జాన్సన్‌ రచయిత. ఆయనతో నాకు బాగా పరిచయం ఉండటంతో ఇబ్బంది పడలేదు. స్ర్కిప్ట్‌ విషయంలో టి. కృష్ణగారు చాలా ఖచ్చితంగా ఉండేవారు. జాన్సన్‌గారు డైలాగులు రాసినా, పి.ఎల్‌.నారాయణగారితో, హరనాథరావుగారితో కూడా కొన్ని సీన్లు రాయించేవారు. ముగ్గురి వెర్షన్స్‌ పక్కన పెట్టుకుని వాటిల్లో మంచి డైలాగులు ఎంపిక చేసుకుని స్ర్కిప్ట్‌ ఫైనలైజ్‌ చేసేవారు. అలా సుమన్‌, విజయశాంతి కాంబినేషన్‌లో ‘నేటి భారతం’ చిత్రం షూటింగ్‌ మొదలైంది. అనుకున్న ప్రకారం చిత్రం పూర్తయింది. అన్నట్లు తను అనుకున్న ఆర్టిస్ట్‌ దొరకక పోవడంతో ఆ సినిమాలో కాంపౌండర్‌ వేషం నాతో వేయించారు కృష్ణగారు. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. కృష్ణగారి దర్శకత్వంలో నేను పనిచేసిన రెండో సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఆ సినిమా అనే కాదు ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ నేను వర్క్‌ చేశాను. ఒకరకంగా చెప్పాలంటే నా జీవితం మళ్లీ బాగుపడటానికీ, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికీ కారణం టి.కృష్ణగారే.


ఒకేసారి రెండు సినిమాలు

టి.కృష్ణగారు దర్శకత్వం వహించే చిత్రాలకు వై.హరికృష్ణగారు పంపిణీదారు. ఆయన చాలా మంచి మనిషి. అభ్యుదయవాది. ఆయన నిర్మాతగా మారి కృష్ణగారి దర్శకత్వంలో ఒకేసారి ఏకంగా రెండు సినిమాల నిర్మాణం ప్రారంభించారు. శోభన్‌బాబు, విజయశాంతి జంటగా ‘దేవాలయం’ ఒకటైతే.. రాజశేఖర్‌, విజయశాంతి హీరోహీరోయిన్లుగా ‘వందేమాతరం’ మరొకటి. అమరావతిలో ‘దేవాలయం’ షూటింగ్‌ జరిగేది. గుంటూరు సమీపంలోని అమీనాబాద్‌లో ‘వందేమాతరం’ షూటింగ్‌ జరిగేది. ఇక్కడ పదిహేను రోజులు, అక్కడ పదిహేను రోజులు. ఇలా గ్యాప్‌ లేకుండా ఒకేసారి రెండు సినిమాలు చేసేవారు టి.కృష్ణ.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...