Jun 10 2021 @ 23:14PM

ఓడలు బళ్లు అవడమంటే ఇదేనేమో!: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 11)

‘మూడుముళ్ల బంధం’ విడుదలైన దగ్గర నుంచి ‘సినిమా బాగా తీశావు’ అని అభినందించేవారి సంఖ్య ఎక్కువైంది. ‘నీ రెండో సినిమా మాతో చేయాలి’ అని అడిగినవాళ్లూ ఉన్నారు. అయితే ఆ చిత్ర నిర్మాణంలో ఉండగానే నాకు అడ్వాన్సులు ఇస్తామని తిరిగిన కొందరు నిర్మాతలు ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ‘మూడుముళ్ళ బంధం’ సినిమాకి నేను తీసుకొన్న పారితోషికం నాలుగువేలు ఎప్పుడో ఖర్చయిపోయాయి. పేరు వచ్చిందిగానీ, అప్పటిదాకా కో డైరెక్టర్‌గా ఎటువంటి దిగులు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న నా జీవితాన్నీ, ఆర్థిక పరిస్థితినీ తల్లకిందలు చేసింది నా తొలి సినిమా. ఆ సినిమా విడుదలయ్యే నాటికి నాకు ముగ్గురు పిల్లలు.


ఆదాయం లేకపోయినా రోజువారీ ఖర్చులు తప్పవుగా! ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇంటి ఖర్చు... ఇవి కాకుండా ఆస్పత్రిలో చూపించుకోవడానికి మా ఊరునుంచి వచ్చిపోయే బంధువులతో సమస్యల నిలయంగా మారింది నా ఇల్లు. తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేయడం, ఆ డబ్బుతో ఇంట్లో అవసరాలు తీర్చుకోవడం.. అంతే. మనసులో మాత్రం ఓ చిన్న ఆశ ఉండేది. ఎవరో వస్తారనీ, నా దర్శకత్వంలో సినిమా తీస్తారనే ఆశతో సంసార సాగరం ఈదుతూ సంవత్సరకాలం గడిపేశాను. రోజులు గడిచేకొద్దీ ఆ ఆశ క్రమంగా సన్నగిల్లసాగింది. ఒక పక్క అప్పులు పెరుగుతున్నాయి, ఆదాయ మార్గం కనపడటం లేదు.


ఒక అడుగు వెనక్కి...

ఒకరోజు తీరికగా కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను. నా మీద ఆధారపడి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎప్పుడో డైరెక్షన్‌ ఛాన్స్‌ వస్తుందని ఎదురుచూస్తూ, ఏ పనీ చేయకుండా ఇంట్లోవాళ్లని ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సబబు? మళ్లీ కో–డైరెక్టర్‌గా ఎక్కడన్నా చేరితే? సాధారణంగా ఒకసారి డైరెక్షన్‌ చేశాక కో–డైరెక్టర్‌గా పని చేయాలంటే చాలామంది నామోషీ ఫీలవుతారు. ఒకవేళ వాళ్లు ఫీల్‌ కాకపోయినా, ఒకసారి డైరెక్షన్‌ చేసిన వాడిని కో–డైరెక్టర్‌గా తీసుకోవడానికి కొంతమంది దర్శకులు ఆసక్తి చూపించరు. నాకు అలాంటి ఈగోలు లేవు కనుక మళ్లీ కో–డైరెక్టర్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకుని రెండు రోజులు గడిచాయో లేదో భగవంతుడు పంపించినట్లు దర్శకుడు విజయభాస్కర్‌ మా ఇంటికి వచ్చారు.


పి.సి.రెడ్డిగారు దర్శకత్వం వహించిన ‘నవ్వుతూ బతకాలి’ చిత్రానికి నేను అసోసియేట్‌ డైరెక్టర్‌ని. విజయభాస్కర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. నిర్మాత క్రాంతికుమార్‌గారు ఆ రోజుల్లో తెలుగుతో పాటు ఒరియాలో కూడా సినిమాలు తీస్తుండేవారు. ఆయన విజయభాస్కర్‌ దర్శకత్వంలో ‘పూరీజగన్నాథ్‌’ చిత్రాన్ని ఒరియాలో తీశారు. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో సినిమా చేసే అవకాశం ఇస్తానని అప్పుడే విజయభాస్కర్‌కు ప్రామిస్‌ చేశారు క్రాంతికుమార్‌. చిరంజీవిగారు, రాధిక కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేసి, దానికి విజయభాస్కర్‌ను దర్శకునిగా నియమించారు క్రాంతికుమార్‌. ఆ విషయమంతా నాకు చెప్పి ‘‘సుబ్బన్నా..నాకు తెలుగులో సినిమా ఛాన్స్‌ వచ్చింది. నువ్వు నాకు సపోర్ట్‌గా ఉండాలి. ఈ సినిమాకు కో–డైరెక్టర్‌గా పనిచేయాలి’’ అని అభ్యర్ధించారు. అతను చెప్పింది వినగానే నేను మనసులోనే నవ్వుకున్నాను.

ఒకప్పుడు విజయభాస్కర్‌ నాకు అసిస్టెంట్‌. ఇప్పుడు నేను అతనికి అసిస్టెంట్‌గా పని చేయాలన్నమాట. ఓడలు బళ్లు అవడమంటే ఇదేనేమో! అయినా ఏమీ అనకుండా ఆలోచించి చెబుతానన్నాను. విజయభాస్కర్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ రోజంతా ఆలోచించాను. రిక్షా లాగైనా, కూలిపని చేసైనా సంసారాన్ని నడిపించాలి. నేను ఏదో పెద్ద పొజిషన్‌కు వెళతానని నా భార్య ఆశపడింది. నేను కూడా ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. మంచి సినిమా తీసినా నాకు రెండో ఛాన్స్‌ రాలేదు. ఎవరో ఒకరి దగ్గర మళ్లీ చేరడంతప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో నాలుగు అడుగులు ముందుకు వేయాలంటే, ఒక అడుగు వెనక్కి వేయాలి. అది కూడా ఒక వ్యూహమే! ఎలాగూ కో–డైరెక్టర్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నాను కనుక విజయభాస్కర్‌తోనే ఆ పని ప్రారంభిస్తే బెటర్‌. అందుకే వెంటనే అతనికి ఫోన్‌ చేసి నా అంగీకారం తెలియజేశాను. అలా ‘ఇది పెళ్ళంటారా’ చిత్రం యూనిట్‌లో నేనూ ఓ సభ్యుడినయ్యాను. చిరంజీవిగారితో నాకు అప్పుడే పరిచయం. మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలిగేవాళ్లం.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...