Jun 9 2021 @ 22:22PM

వాణిశ్రీ, బాలకృష్ణ అనుకుని.. మాధవి, రాజేంద్రప్రసాద్‌లతో తీశాం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 10)

బాలకృష్ణ, వాణిశ్రీ జంట అనుకున్నాను. సినిమా సెకండాఫ్‌లో ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడవుతాడు. హీరోయిన్‌, అతని మధ్య సీన్లు చాలా బాగుంటాయి. ఆ పాత్రకు బాలకృష్ణను అనుకున్నాను. ఆయన నటించిన ‘అన్నదమ్ముల అనుబంధం’ విడుదలైంది. 17ఏళ్లు ఉంటాయేమో. నా పాత్రకు సరిగ్గా సరిపోతాడు. హీరోయిన్‌ పాత్రకు వాణిశ్రీ అయితే బాగుంటుందనుకున్నాను. మా నిర్మాతలకు అదే విషయం చెప్పాను. ఈ కాంబినేషన్‌ అనగానే వాళ్లిద్గరూ భయపడ్డారు. ‘‘మేం కొత్తవాళ్లం సార్‌.. వాళ్లని తీసుకురాలేం, మా వల్ల కాదు’’ అన్నారు. పోనీ కొత్త వాళ్లతో తీద్దామన్నాను. కొత్త వాళ్లయితే బిజినెస్‌ కాదు, ప్రేక్షకులు థియేటర్‌కు రారు అన్నారు. చివరకు కొత్త, పాత తారలతో సినిమా తీద్దామని డిసైడ్‌ చేశాం. అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మాధవిని హీరోయిన్‌ పాత్రకు ఎంపిక చేశారు. ఆమెను ప్రేమించే డాక్టర్‌ పాత్రకు శరత్‌బాబును ఎన్నుకొన్నాం. హీరో కొత్తవాడైతే బాగుంటుందనుకున్నాం.


అప్పుడు నా స్నేహితుడు పరంధామరెడ్డి రాజేంద్రప్రసాద్‌ గురించి చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్‌ అయ్యాడని విని పిలిపించాం. ఆ రోజుల్లో సన్నగా, పీలగా ఉండేవారు రాజేంద్రప్రసాద్‌. అందగాడు కాదు. బాగా చేశాడు. మా సినిమాతో అతనికి గుర్తింపు వచ్చింది. సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు అందంగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపికచేయాలనుకున్నాను. అయితే మా నిర్మాతలు విజయకళ అనే అమ్మాయిని తెచ్చి ఈమె సెకండ్‌ హీరోయిన్‌ అన్నారు. నా కెరీర్‌లో కాంప్రమైజ్‌ కావడమన్నది ఆ అమ్మాయితోనే మొదలైంది. ఎందుకో ఆమె నాకు నచ్చకపోవడంతో ‘‘వద్దండీ’’ అన్నాను. ‘‘లేదండీ. మనకు తెలిసిన అమ్మాయి. అబ్లిగేషన్‌’ అనేసరికి కాదనలేకపోయా. అప్పలాచార్య మాటలు రాశారు. సత్యం సంగీత దర్శకుడు. నవంబర్‌ 29, 1979... నా కెరీర్‌ కొత్త మలుపు తిరిగిన రోజు. ఎందుకంటే ఆ రోజున ‘మూడుముళ్ళ బంధం’ చిత్రం షూటింగ్‌ రాజమండ్రిలో మొదలైంది. 30 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమా తీశాం.

క్లైమాక్స్‌ మార్చాం

తొలి కాపీ వచ్చిన తర్వాత ‘మూడుముళ్ళ బంధం’ చిత్రాన్ని కొంతమంది శ్రేయోభిలాషులకు చూపించాం. ముగింపులో హీరో.. ఇద్దరు హీరోయిన్లని పెళ్ళి చేసుకున్నట్లు తీశాం. చిన్నప్పుడు తను తెలియకుండానే తాళి కట్టిన యువతిని, పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమించిన యువతిని అతను పెళ్ళి చేసుకుంటాడు. అది చూసి పెద్దలు గగ్గోలు పెట్టారు. ‘‘ఏమిటయ్యా బాబూ.. నువ్వు మరీ అడ్వాన్స్‌డ్‌ సినిమా తీశావు’’ అని కోప్పడ్డారు. ‘‘తొందరపడి కోయిల ముందే కూసింది’’ అని కూడా అన్నారు. దర్శకునిగా నాకు అది తొలి సినిమా. నిర్మాతలకూ అదే మొదటి సినిమా. అందుకే అనుభవమున్నవాళ్లు చెప్పడంతో ‘నిజమే కాబోలు’ అనుకుని ముగింపు మార్చాను. హీరోని, సెకండ్‌ హీరోయిన్‌ను కలిపి.. మెయిన్‌ హీరోయిన్‌ చనిపోయినట్లు రీ షూట్‌ చేశాం.


సెన్సార్‌ అభ్యంతరం

ఆ తర్వాత ‘మూడుముళ్ళ బంధం’ సినిమాను సెన్సార్‌కు పంపాం. థియేటర్‌లో సెన్సార్‌ సభ్యులు సినిమా చూస్తుంటే మేమంతా బయట ఎదురు చూస్తున్నాం. గంట అయింది, రెండు గంటలయింది.. మూడు గంటలు కూడా అయింది. సాధారణంగా సినిమా అయిన తర్వాత సెన్సార్‌ సభ్యులు చర్చించుకొని ఆ తర్వాత దర్శకుడికి కబురు చేస్తారు. కానీ ఎంతసేపూ గడిచినా లోపల నుంచి పిలుపు రావడం లేదు. ఆపరేటర్‌ మధ్యమధ్యలో బయటకు వచ్చి కాఫీ తాగేవాడు. అతన్ని ఆపి ‘‘బాబూ లోపల వాళ్లు సినిమా చూస్తున్నారా, నిద్ర పోతున్నారా’’ అని ఒళ్ళుమండి అడిగేశాను. ‘‘సినిమా చూశారు సార్‌.. వాళ్లందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు సార్‌’’ అని చెప్పి మళ్లీ లోపలకు వెళ్లిపోయాడు. తర్వాత ఎప్పటికో నన్ను లోపలకి పిలిస్తే వెళ్లాను. ‘‘ఏమయ్యా.. ఇలాంటి సినిమా తీయడానికి నీకు ఎంత ధైర్యం..’’ అని ప్రశ్నించాడు ఆఫీసర్‌. ‘‘ఏమైంది సార్‌’’ అన్నాను కొంచెం బెరుకుగా. ‘‘ఎనిమిదేళ్ల కుర్రాడు పద్దెనిమిదేళ్ల అమ్మాయికి తాళి కట్టడమేమిటి?’’. ‘‘అతను ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెప్పాను కదా సార్‌’’. ‘‘అది సరేనయ్యా.. కానీ శారదా యాక్ట్‌ (చిన్న పిల్లలకు పెళ్ళి చేయకూడదన్నది శారదా యాక్ట్‌) ఒప్పుకోదుగా’’. ‘‘కానీ పెళ్ళి చేసుకొనే అమ్మాయి పెద్దదే కదా సార్‌’’ అన్నాను. ‘‘అబ్బే! అదేం కుదరదయ్యా..సర్టిఫికెట్‌ ఇవ్వలేం’’ అనేశాడు ఆఫీసర్‌.


నా గుండెల్లో రాయి పడింది. ‘నానా తిప్పలుపడి సినిమా పూర్తిచేశాం. ఇప్పుడు సర్టిఫికెట్‌ ఇవ్వనంటే ఏమయిపోవాలి...’ అందుకే సెన్సార్‌ ఆఫీసర్‌ను బతిమాలాను. సినిమా విడుదల కాకపోతే అందరం దెబ్బతింటామనీ వివరంగా చెప్పాను. దాంతో ఆఫీసర్‌ కొంచెం మెత్తపడ్డాడు. సభ్యులతో మరోసారి మాట్లాడి, చివరకు సర్టిఫికెట్‌ ఇచ్చాడు. అప్పటికి సినిమా పూర్తయి పన్నెండు నెలలైంది. నిర్మాతలు అప్పటికే చేతులు ఎత్తేశారు. భారీగా పబ్లిసిటీ చేసే స్తోమత లేదు. ఏదో నామమాత్రపు పబ్లిసిటీతో డిసెంబర్‌ 6, 1980న ‘మూడుముళ్ళ బంధం’ సినిమా విడుదలైంది. సినిమా పెద్దగా ఆడలేదు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...