ముసురు

ABN , First Publish Date - 2022-10-07T06:11:00+05:30 IST

అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం కూడా కొనసాగాయి.

ముసురు
కృష్ణాదేవిపేట వద్ద పొంగి ప్రవహిస్తున్న బొడ్డేరు గెడ్డ



పొంగుతున్న నదులు, కొండగెడ్డలు, వాగులు

లోతట్టు ప్రాంతాలు జలమయం

చోడవరం, అక్టోబరు 6: అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. విడతల వారీగా వర్షం పడుతుండడంతో వాతావరణం ముసురు పట్టినట్టయింది. వర్షాలకు రహదారులు చిత్తడిగా మారాయి.  


పొంగిన చెరువులు, గెడ్డలు


నాతవరం: మండలంలో రెండు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కొండ గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండవ రిజర్వాయర్‌లో ప్రమాద స్థాయికి నీటి నిల్వలు చేరుకుంటున్నాయి. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం తాండవలో 377.4 అడుగుల నీటినిల్వలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు తాండవలోకి ఇన్‌ఫ్లో ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అలాగే కుడి, ఎడమ కాలువలకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  


పొంగుతున్న బొడ్డేరు గెడ్డలు


కృష్ణాదేవిపేట: రెండు రోజులుగా ఎడతెడిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏఎల్‌పురం, చోద్యం, పాతకృష్ణాదేవిపేట, నాగాపురం, కొంగశింగి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ మేరకు కృష్ణాదేవిపేట వద్ద బొడ్డేరు గెడ్డలు, చెరువులు, వలసంపేట గాదిగుమ్మి జలపాతం వర్షం నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా ఏఎల్‌పురం కుమ్మరికాలనీ, బీసీ కాలనీలో సరైన డ్రైనేజీ లేక మట్టిరోడ్డుపై నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులు, వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో వర్షపు నీరు ఇళ్లల్లో రోడ్డుపై పారుతున్నది. పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


మాకవరపాలెంలో..


మాకవరపాలెం: మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు, మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మదుములు పూర్తిగా కప్పివేయడంతో వర్షపు నీరంతా రోడ్లపై పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొండలఅగ్రహారం వద్ద రోడ్డు పెద్ద గోతులు కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు.  


నర్సీపట్నంలో...


నర్సీపట్నం అర్బన్‌: నర్సీపట్నం మునిసిపాలిటీతోపాటు, మండలంలో గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మునిసిపాలిటీ పరిధిలో బలిఘట్టం, బొడ్డేపల్లి, నర్సీపట్నం, మండల పరిధిలోని చెట్టుపల్లి, ఓఎల్‌. పురం, కేఎల్‌. పురం, గబ్బాడ, నీంపేట, ధర్మసాగరం, అమలాపురం, వేములపూడి, దుగ్గాడ, ఎరకన్నపాలెం, మొండికండి తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. మట్టిరోడ్లు బురదగా మారాయి. ముఖ్యంగా నర్సీపట్నంలో మెయిన్‌ రోడ్డుపై నీరు ప్రవహించింది.  

Updated Date - 2022-10-07T06:11:00+05:30 IST