ముసురు.. మునక

ABN , First Publish Date - 2021-11-28T05:30:00+05:30 IST

ఎడతెరపిలేని వర్షం అన్నదాతను ముంచేసింది. వర్షాలతో డెల్టా ప్రాంతంలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది.

ముసురు.. మునక
రేపల్లె: పెనుమూడి వద్ద వర్షపు నీటిలో నానుతున్న వరి పంట

రైతులను వెంటాడుతున్న వర్షం

నీటిపాలైన వేలాది ఎకరాల పంట  

కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు 

వాతావరణశాఖ హెచ్చరికలతో ఆశలు గల్లంతే

వీడని వర్షాలతో మెట్ట, వాణిజ్య పంటలకూ నష్టమే


వరుస వాయుగుండాలు.. ఒకదాని వెంట మరొకటి.. విడవకుండా కురుస్తున్న వర్షాలు.. అన్నదాతను నిలువునా ముంచేస్తున్నాయి. ముసురు పట్టిన వర్షం అన్నదాతను నిండా ముంచేసింది. చేతికందే దశలో ఉన్న పంట ఇంటికి చేర్చుకునే వీలు లేకుండా వానలు ఓ మోస్తరు నుంచి భారీగా కురుస్తూనే ఉన్నాయి. అడపాదడపా తెరిపి ఇస్తుండటంతో రైతులు పంట రక్షణ చర్యలు చేపడుతున్నారు. కొంతైనా చేతికి అందుతుంది అనుకునే అంతలోనే మళ్లీ వర్షం కురుస్తుంది. ఈ విధంగా గత రెండు వారాలుగా జిల్లాను వర్షాలు వీడటంలేదు. ఇటీవల వరకు ఎంతోకొంత అయినా పంట దక్కుతుందని ఆశలో ఉన్న అన్నదాత మళ్లీ వాయుగుండంతో శనివారం సాయంత్రం నుంచి మొదలైన వర్షంతో ఆవేదన చెందుతున్నాడు.  పంటంతా వర్షం పాలవటంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో మిగిలి ఉన్న పంటపై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.

 

వీడని నవంబరు గండం

గతేడాది నవంబరులో నివర్‌ తుఫాన్‌తో జిల్లాకు చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు వరదలతో చేతికందే దశలో ఉన్న పంటలు నీటి పాలయ్యాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అప్పులు చేసి పంటలు సాగు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో కోతలు ప్రారంభమవుతాయి. ఈ దశలో ఈ ఏడాది కూడా నవంబరులోనే అధికంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మిర్చి, పత్తి సాగు చేసిన అన్నదాతలలో తీవ్ర ఆందోళన నెలకొంది. సస్యరక్షణ చర్యలు చేపట్టలేక పోతున్నారు. వ్యవసాయానికి తెచ్చిన అప్పులు తీర్చేది ఎలా అనే మనోవేదనకు గురవుతున్నారు. 



రేపల్లె, కొల్లిపర, నవంబరు 28: ఎడతెరపిలేని వర్షం అన్నదాతను ముంచేసింది. వర్షాలతో డెల్టా ప్రాంతంలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. రోజుల తరబడి నీటిలో పంట నానుతుంది. చేతికొచ్చే సమయంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చటంతో పంటంతా నీటిపాలైందంటూ రైతన్న కన్నీటిపర్యంతమవుతున్నాడు. శనివారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలతో వరి పైరు నేలవాలింది. చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది పాటి పంటను అయినా కాపాడుకునేందుకు అన్నదాతలు శ్రమకోర్చి పంట భూములలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొన్ని లోతట్టు ప్రాంతాలో నేటికి పంట భూములలో నీరు నిలిచే ఉంది. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస వాయుగుండాలు రైతులలో గుబులు రేపుతున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షం కురిస్తే కంకులు మొలకలెత్తి ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితిలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.  రేపల్లె నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. కాలువ దరి పొలాల్లో ముందుగా సాగు చేశారు. దీంతో ఇక్కడ వేలాది ఎకరాల పంట కోతకు వచ్చింది. చివరి భూముల్లో కొంతమేర ఆలస్యంగా వేసిన పంట దుబ్బులు చేసి కంకులు చేసే సమయంలో వర్షాల కారణంగా దుబ్బులు నీటిలో నానుతూ నేలవాలిపోయాయి. కట్టులు కట్టినా పంట ఎంత దిగుబడి వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఎకరాకు ఇప్పటికే రూ.22 వేల నుంచి రూ.28 వేల వరకు ఖర్చు చేశామని నీట మునిగిన పొలంలోని పంట కట్లుకట్టాలంటే ఎకరాకు రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందంటూ రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నదే తప్ప ఎక్కడా చర్యలు లేవన్నారు. రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో ఇప్పటికే వేలాది ఎకరాలు నీటిలో నానుతున్నాయి. ప్రభుత్వం దృష్టిసారించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షంతో కొల్లూరు, అమృతలూరు, కాకుమాను, కొల్లిపర తదితర మండలాల్లో  80 నుంచి 90 శాతం వరి నేలవాలింది. కొల్లిపర మండలంలో మున్నంగి, వల్లభాపురం, కొల్లిపర, తూములూరు, చివలూరు, అత్తోట, చక్రాయపాలెం, హనుమాన్‌పాలెం  తదితర గ్రామాల్లో 6 వేల 300 హెక్టార్లలో రైతులు వరి పంట వేయగా 5 వేల హెక్టార్లలో నేలవాలింది. నేలవాలిన వరి పంటలో కొన్ని చోట్ల ఇప్పటికే మొలకలు వచ్చాయి. పైరు నేల వాలడంతో కంకులు పూర్తిగా నీటిలోనే నానుతున్నాయి.  పొన్నూరు మండల పరిధిలో 13 వేల హెక్టార్లలో రైతులు వరిని సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు 5 వేల ఎకరాలలో పైగా వరి పంట దెబ్బతింది. వేలాది ఎకరాలలో పంట నేల వాలగా అధిక భాగం నీటిలో నానిన కంకులు మొలకెత్తాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా మెట్టపైర్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే అరటి, పసుపు, కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతింటాయని రైతులు తెలిపారు. వర్షం తెరిపి ఇచ్చినట్లుగా ఉండటంతో ఆదివారం కొల్లూరులో కోతలు కోశారు. అంతలోనే వర్షం పడటంతో వర పనలు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.  అమృతలూరు మండలంలోని 18 గ్రామాల్లో సుమారుగా 7800 హెక్టార్లలో వరిసాగు చేపట్టగా పూర్తిగా నష్టపోయినట్లేనని రైతులు తెలిపారు.   


డ్రెయిన్లలో పారుదల కాని నీరు

వర్షానికి తోడు తీర ప్రాంతంలోని పెనుమూడి, అరవపల్లి, గుడ్డికాయలంక, నగరం మెయిన్‌ డ్రెయిన్లలో నీరు పారుదల కావడంలేదు. డ్రెయిన్లలో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోవటంతో వర్షపు నీరు పారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పొలాల్లోని వర్షపునీరు పారుదల అవ్వకపోవటంతో పాటు డ్రెయిన్ల నుంచి కూడా నీరు ఎగదన్నుతున్నది. ఒకవైపు వర్షపు నీరు.. మరోవైపు డ్రెయిన్ల నీరు పొలాల్లో నీరు తిష్టవేస్తుంది. దీంతో పంటంతా మునిగినష్టం రోజురోజుకు అధికమవుతుంది. డ్రెయిన్లలో గుర్రపుడెక్క తొలగించి ఉంటే నీరు పారుదల సక్రమంగా జరిగి కొంత వరకైనా పొలాలు ముంపు ప్రమాదం నుంచి బయటపడేవని రైతులు అంటున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని అందువల్లే ప్రస్తుతం నిండా మునిగిపోయామని రైతులు వాపోతున్నారు.    



 ====================================================================

Updated Date - 2021-11-28T05:30:00+05:30 IST