ముసురు భయం

ABN , First Publish Date - 2021-11-29T06:10:05+05:30 IST

అన్నదాతను ముసురు భయపెడుతోంది. అల్ప పీడనాల ప్రభావంతో పది రోజులపాటు వానలు కురిశాయి.

ముసురు భయం
గొట్లూరులో శనగ పంటలో నిలిచిన వర్షపు నీరు

  1. వెంట వెంటనే తుపాన్లు 
  2. జిల్లా అంతటా మళ్లీ వాన
  3. పంటను కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు


అన్నదాతను ముసురు భయపెడుతోంది. అల్ప పీడనాల ప్రభావంతో పది రోజులపాటు వానలు కురిశాయి. కూరగాయలు, వరి, పప్పు శనగ తదితర పంటలన్నీ దెబ్బతిన్నాయి. రెండు రోజులు కాస్త తెరిపి ఇచ్చిందో లేదో.. మళ్లీ వానలు మొదలయ్యాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. దీంతో పంటలు, దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. 


రుద్రవరం: మండలంలోని కోటకొండ, ఎల్లావత్తుల, రుద్రవరం, చిన్నకంబలూరు, చిత్రేణిపల్లె, నరసాపురం తదితర గ్రామాల్లో ఆదివారం వర్షాలు కురిశాయి. దీంతో ఆరబోసిన వరి ధాన్యం తడిసి పోకుండా రైతులు ప్లాస్టిక్‌ పట్టలు కప్పుకోవడంలో నిమగ్నమయ్యారు. 


చాగలమర్రి: మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాయుగుండం ప్రభావంతో 10 రోజుల పాటు వర్షం కురిసి రైతులను ముంచింది. రెండు రోజులు తిరగక ముందే మరోమారు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చాగలమర్రి మండలంలో ఆదివారం 10.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. 2 వేల ఎకరాల్లో మినుము పంట, 2,500 ఎకరాల్లో శనగ పంట, 2 వేల ఎకరాల్లో వరి పంట, 800 ఎకరాల్లో కేపీ ఉల్లిపంట, 600 ఎకరాల్లో మొక్కజొన్న, 700 ఎకరాల్లో మిర్చి, పత్తి, ఉద్యాన పంటలు దెబ్బతినింది. 19 గ్రామ పంచాయతీల్లో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతినడంలో రూ.లక్షలు నష్టం వాటిల్లింది. ఎం.తండా, కేపీ తండా, ముత్యాలపాడు, శెట్టివీడు, చిన్నవంగలి తదితర గ్రామాల్లో వరి పంట నేలవాలింది. ధాన్యం రంగుమారింది. వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. మినుము పంట దిగుబడి తగ్గిపోయింది. ప్రభుత్వం పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. 


ఆళ్లగడ్డ: వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో కేసీ, తెలుగుగంగ, బోరు బావుల కింద 25 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. గత వారంలో కురిసిన వర్షాలకు పంట నేల వాలింది. తంటాలు పడి సరిచేసుకున్న వెంటనే మరో తుపాన్‌ వచ్చింది. దీంతో పంట చేతికి అందుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది కోత కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని లారీలలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


17 మండలాల్లో వర్షం


కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని 17 మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. అత్యధికంగా కొలిమిగుండ్లలో 12.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. గడివేములలో 4.6 మి.మీ., బండి ఆత్మకూరులో 6.4, అవుకులో 4.2  మి.మీ., వెలుగోడులో 3.2, జూపాడుబంగ్లాలో 2.6, ఉయ్యాలవాడ, సంజామలలో 3 మి.మీ., మిగిలిన మండలాల్లో ఒకటి నుంచి 2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పక్వానికి వచ్చిన మొక్కజొన్న, వరి పంటల కోతకు ఈ వర్షాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మరో మూడురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి, టమోటా, మిరప, ఉల్లి పంటలకు తెగుళ్లు సోకుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-29T06:10:05+05:30 IST