రోజంతా ముసురు

ABN , First Publish Date - 2021-07-22T06:10:20+05:30 IST

రోజంతా ముసురు జిల్లా ప్రజల్ని ఇంటినుంచి బయటకు రానీయకుండా చేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ చినుకులు పడుతూనే ఉన్నాయి. బక్రీ ద్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఈ ముసురుతో కాస్త ఇబ్బందిపడ్డారు. మూసీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు చెరు వులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.

రోజంతా ముసురు
వలిగొండ మండలం సంగెం గ్రామం భీమలింగం కత్వ వద్ద మూసీ ప్రవాహం

ఉదయం నుంచి ఎడతెరిపిలేని వాన

ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలకు జలకళ

పత్తిపంటలకు ప్రయోజనమంటున్న రైతులు

వర్షం తగ్గగానే ఎరువులు వేసేందుకు సిద్ధం


రోజంతా ముసురు జిల్లా ప్రజల్ని ఇంటినుంచి బయటకు రానీయకుండా చేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ చినుకులు పడుతూనే ఉన్నాయి. బక్రీ ద్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఈ ముసురుతో కాస్త ఇబ్బందిపడ్డారు. మూసీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు చెరు వులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పలు మండలాల్లో అలుగులు పోస్తుండగా, వాగులు, వంకలు ఉధృ తంగా ప్రవహిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలతో పత్తి పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని,  వర్షాలు తగ్గగానే ఎరువులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. 


యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ, జూలై 21: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. పట్టణ కేంద్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమై, రోడ్లన్నీ గుంతలమయంకావడంతో వర్షం నీరు అందులోకి చేరి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కూలీలు వర్షానికి తడవకుండా ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన చొక్కాలను వేసుకొని పనులుచేస్తున్నారు. బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలకు చేరుకోగానే, వర్షం మొదలు కావడంతో ప్రార్థనలకు కాస్త ఆటంకం కలిగింది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్‌ పట్టణంలోని ఊర చెరువు నిండి అలుగుపోస్తోంది.  ఈ వర్షాలతో పత్తి పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్లుయిందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. 


మూసీ ఎగువన వర్షాలు.. దిగువన వరదలు

కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ఎగువ ప్రాంతమైన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ ఆయకట్టులోని యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్‌ మండలాల్లోని చెరువుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ వరద తాకిడి పెరగడంతో ఆయకట్టు దిగువన ఉన్న భూదాన్‌పోచంపల్లి మండలంలోని చెరువులన్నీ నిండి ప్రవహిస్తున్నాయి. భూదాన్‌పోచంపల్లి పెద్ద చెరువు వరద ఉధృతి కారణంగా అలుగుపారుతోంది. పిలాయిపల్లి, పెద్దరావులపల్లి, జూలూరు-రుద్రవెల్లి లోలెవల్‌ బ్రిడ్జీల వద్ద మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీమనపల్లి మూసీ, చిన్నేటి బ్రిడ్జి కింద ఉధృతంగా పారుతోంది.


ఉమ్మడి జిల్లాలో..

నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అత్యధికంగా మునుగోడులో 1.2సెంటీమీటర్లు, అత్యల్పంగా త్రిపురారం మండలంలో 4.2మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శాలిగౌరారం మండలంలోని ఎన్జీ కొత్తపల్లి, రామాంజపురం, మనిమద్దె, ఉప్పలంచ గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి అలుగుపోస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ముసురు పట్టింది. రాజాపేటలో 1.9సెంటీమీటర్లు, అత్యల్పంగా చౌటుప్పల్‌లో 1.6మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 4.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  బునాదిగాని కాల్వకు వరద పోటెత్తడంతో కట్ట బలహీనంగా  ఉన్న పలుచోట్ల గండ్లుపడ్డాయి. దీంతో వరద నీరంతా దిగువనున్న వరి పొలాలను ముంచెత్తింది. సమీప గ్రామాల రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. సూర్యాపేట జిల్లాలో మూడు రోజులుగా వర్షం కురుస్తోంది. నడిగూడెం మండలంలో అత్యధికంగా 1.9సెంటీమీటర్లు, మఠంపల్లి మండలంలో అత్యల్పంగా 1మిల్లీ మీటర్‌ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 6.7గా నమోదైంది. ముసురుతో పంట పొలాలకు ఎలాంటి నష్టం లేకున్నా కూరగాయల సాగు చేసే రైతులకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో 7వేల ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆకు కూరలకు మచ్చలు వస్తున్నాయి. 



చౌటుప్పల్‌ ఊర చెరువుకు అలుగు

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని ఊర చెరువు నిండి అలుగుపోస్తోంది. 600 అడుగుల పొడవు ఉన్న అలుగు దిమ్మె నిండటంతోపాటు దానిపై అర అడుగు ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో పలువురి రైతుల పంట పొలాలు నీట మునగడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ ముప్పును నివారించడానికి చెరువు అలుగు ప్రాంతంలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని మునిసిపల్‌ సిబ్బంది బుధవారం తొలగించే ప్రయత్నం చేశారు. ఈ పనులను సమీపంలోని ఇళ్ల యజమానులు అడ్డుకుని పనులను నిలిపివేశారు. ఆ ప్రాంతంలోని ఇళ్ల యజమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. చెరువు అలుగునీరు దిగువకు వెళ్లి 12 మంది రైతులకు చెందిన 10 ఎకరాల వరిపంట నీట మునగడంతో  రైతులు అందోళన చెందుతున్నారు. ఆర్డీవో, ఎంపీపీ కార్యాలయాలకు వరద ముంపు పొంచి ఉంది. అలుగు ప్రాంతంలో ఇష్టానుసారంగా ఇళ్లను నిర్మించి ఎత్తుగా మట్టి పోయడంతో అలుగునీరు దిగువకు ప్రవహించక ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు కట్ట తెగి చౌటుప్పల్‌ పట్టణానికి వరద ముంపు వచ్చే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


పులిచింతల ప్రాజెక్టుకు జలకళ

534.10 అడుగుల వద్ద సాగర్‌ నీటిమట్టం 

చింతలపాలెం, నాగార్జునసాగర్‌, కేతేపల్లి జూలై21: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు మూసీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రాజెక్టుకు బుధవారం 5,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో టీ ఎస్‌ జెన్‌కోలోని పవర్‌హౌ్‌సలో నాలుగుయూనిట్లు ఉండగా, రెండు యూ నిట్ల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 30 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు టీఎస్‌ జెన్కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపా రు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 (45.77టీఎంసీలు) అడుగులు కాగా, 173.55 (43.35టీఎంసిలు) అడుగులకు చేరుకుంది.  నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి రాక కొనసాగుతోంది. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పతి చేస్తుండటంతో సాగర్‌కు 28,252 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 534.10 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176.2602 టీఎంసీలుగా  ఉంది. 


మూసీకి తగ్గుముఖం పట్టిన ఇన్‌ఫ్లో

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్టు గేట్లను అడుగు మేర ఎత్తి 1,300 క్యూసెక్కు ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈక్రమంలో గత రెండు రోజుల క్రితం వరకు 638.90 అడుగులుగా ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 637.90అడుగులకు పడిపోయింది. 

Updated Date - 2021-07-22T06:10:20+05:30 IST