వజ్రోత్సవాలకు ముస్తాబు

ABN , First Publish Date - 2022-08-15T04:55:51+05:30 IST

స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ముస్తాబైంది. సోమవారం నిర్వహించే కార్యక్రమాల కోసం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

వజ్రోత్సవాలకు ముస్తాబు
మహబూబ్‌నగర్‌ పరేడ్‌ మైదానంలో కవాతు ప్రాక్టీస్‌ చేస్తున్న సాయుధ బలగాలు

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండావిష్కరణ చేయనున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఊరూరా అంబరాన్నంటనున్న సంబురం

పోలీస్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమర యోధుల వస్త్రధారణ పోటీలు

ముఖ్య కూడళ్లలో పోలీస్‌ జాగిలాలతో తనిఖీలు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర 75వ వజ్రోత్సవాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ముస్తాబైంది. సోమవారం నిర్వహించే కార్యక్రమాల కోసం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా వారం నుంచి వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్‌ రన్‌, ర్యాలీలు, ఇంటింటికి జెండాల కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిం చారు. ఆదివారం పరేడ్‌ మైదానంలో సాయుధ బలగాల కవాతు ప్రాక్టీస్‌ జరిగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు మైదానంలో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించ నున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులంతా వేడుకల్లో పాల్గొనున్నారు. అనంతరం జిల్లా ప్రగతి, సంక్షేమ పనులపై మంత్రి సందేశం ఇస్తారు. ఈ ఏడాది వేడుకలను గొప్పగా నిర్వహించాలని ముందునుంచే నిర్ణయించడంతో ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతిని శకటాల రూపంలో ప్రదర్శించనున్నారు. అన్ని శాఖలు స్టాళ్ళను ఏర్పాటు చేసి శాఖల పని తీరును చాటిచెప్పనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుకుతెచ్చు కునేలా వారి వస్త్రధారణతో సోమ వారం ఉదయం పోలీసు కార్యాల యంలో పోటీలు నిర్వహించనున్నారు. నాలుగు కేటగిరీలో నిర్వహించే ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహమ తులను ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి అవార్డులు ఇవ్వనున్నారు.


వారం రోజులు  సంబురాలు

ఈనెల 22 వరకు వజ్రోత్సవ వేడుకలు జరగనున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. పోలీస్‌ జాగిలాలతో పట్టణం లోని ప్రధాన కూడళ్ళలో, జడ్చర్లలో తనిఖీలు చేపట్టారు.


అంబరాన్నంటిన బాణసంచా

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి జడ్పీ మైదానంలో బాణసంచా కాల్చారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి బాణసంచాను తిలకించారు. స్థానికులు అధిక సంఖ్యలో వచ్చారు. వినువీధుల్లో మురుమిట్లు గొలిపే తారాజువ్వల కాంతులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు తేజస్‌నందలాల్‌ పవార్‌, సీతారామారావు, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, చెరుకుపల్లి రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T04:55:51+05:30 IST