మంచి నటిగా నిరూపించుకోవాలి!

ABN , First Publish Date - 2021-03-21T05:55:16+05:30 IST

‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు మధు. అల్లరి పిల్లగా కనిపిస్తాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. హాస్యం, భావోద్వేగాల కలబోతగా నా పాత్ర ఉంటుంది’

మంచి నటిగా నిరూపించుకోవాలి!

‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు మధు. అల్లరి పిల్లగా కనిపిస్తాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. హాస్యం, భావోద్వేగాల కలబోతగా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు కథానాయిక మిషా నారంగ్‌.  ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రం తెల్లవారితే గురువారం’. శ్రీసింహ కోడూరి హీరో. మణికాంత్‌ జెల్లీ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంగా చిత్ర విశేషాలను మిషా నారంగ్‌ పంచుకున్నారు. ‘‘మాది హర్యాణాలోని కురుక్షేత్ర. నేను ముంబైలో పెరిగాను. కెమిస్ట్రీలో మాస్టర్స్‌ చేశాను. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. ఆడిషన్స్‌కు వెళ్లి ‘మిస్సింగ్‌’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. 


ఆ చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కథ బాగా నచ్చటంతో ఈ సినిమాలో భాగమయ్యాను. నటనకు ఆస్కారమున్న పాత్ర నాది. దర్శకుడు మణికాంత్‌ కథ చెప్పగానే నా పాత్రతో ప్రేమలో పడిపోయాను. ప్రతి సన్నివేశాన్ని వివరంగా చెప్పటంతో నటించటం సులువయింది. భాష తెలియకపోతే శ్రీ సింహ నాకు సెట్లో సాయం చేశారు. కథ విన్నప్పుడు నేను ఊహించుకున్న విధంగా సినిమా తెరపైకి వచ్చింది. ‘తెల్లవారితే...’ చిత్రం ఒక వెడ్డింగ్‌ డ్రామా. సస్పెన్స్‌తో పాటు ఫుల్‌ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది తెలుగులో నేను అంగీకరించిన రెండో చిత్రం అయినా మొదట విడుదలవుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. భవిష్యత్తులో అన్ని రకాల పాత్రలు పోషించి నటిగా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’’ అని ఆమె చెప్పారు.

Updated Date - 2021-03-21T05:55:16+05:30 IST