విశ్వబ్రాహ్మణుల గోడు వినండి!

ABN , First Publish Date - 2020-07-03T10:30:29+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనకై మీరు నడుంబిగించిన సందర్భంలో మీకు వెన్నుదన్నుగా నిలిచిన విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ జాతీయుల కష్టాలు, కడగండ్లు మీకు ఎందుకు కనిపించడం లేదో తెలియడం లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం

విశ్వబ్రాహ్మణుల గోడు వినండి!

గౌరవ ముఖ్యమంత్రిగారూ, తెలంగాణ రాష్ట్ర సాధనకై మీరు నడుంబిగించిన సందర్భంలో మీకు వెన్నుదన్నుగా నిలిచిన విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ జాతీయుల కష్టాలు, కడగండ్లు మీకు ఎందుకు కనిపించడం లేదో తెలియడం లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి కారకుడైన శ్రీకాంతాచారి, మనందరి ‘సార్‌’ కొత్తపల్లి జయశంకర్‌ కులం వైపు మిమ్ములను చూడనివ్వకుండా అడ్డుపడుతున్నదెవరో వారికి మా జోహార్లు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే సాంప్రదాయ వృత్తులైన కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిలాశిల్పం, స్వర్ణకార వంటి వృత్తులు చేస్తున్న విశ్వబ్రాహ్మణుల జీవితాలలో వెలుగులొస్తాయనే ఆశతో ఈ జాతినుండి దాదాపు నలభైమంది యువకిశోరాలు చేసిన బలిదానాలకు నేడు అర్థం లేకుండా పోయింది. ఇతర కులాలను మీరు క్యాంపు కార్యాలయానికి పిలిచి ఆర్థికంగా ఆదుకొన్న నేపథ్యంలో, మమ్ములను కూడా పిలుస్తారేమోనని ఆరేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నాము. అటవీశాఖ అధికారులు కలప వృత్తిదారులను వృత్తిపనులు చేసుకోకుండా ఆటంకపరుస్తుంటే, పోలీసులు స్వర్ణకారులను రికవరీ కేసులతో వేధిస్తుంటే ఆదుకున్నవారే లేకపోయారు. మరో వృత్తిచేయలేక, కుటుంబాలను పోషించుకోలేక విశ్వకర్మ యువత నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. బడ్జెట్‌లో రూ. 250కోట్లు ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. విశ్వబ్రాహ్మణుల సాంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ఒక్క ప్రభుత్వ ఉత్వర్వు కూడా ఈ ఆరేళ్ళలో వెలువడలేదు. సనాతన సంప్రదాయాలను, వృత్తులను,కళలను పరిరక్షిస్తున్న విశ్వబ్రాహ్మణులను కాపాడవలసిందిగా, మీ దర్శనం ఇప్పించి మా బాధలు సానుభూతితో విని, న్యాయమైన మా సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాం. ఈ కరోనా కాలంలోనైనా మాపై మీరు కరుణచూపుతారని ఆశిస్తున్నాం.

– చొల్లేటి కృష్ణమాచారి, ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ /విశ్వకర్మ సంఘం

Updated Date - 2020-07-03T10:30:29+05:30 IST