కళ్లు అలసిపోకుండా...

ABN , First Publish Date - 2020-03-04T05:54:38+05:30 IST

పరీక్షల వేళ... ఎక్కువ గంటలు చదవడం అన్నది ఏ విద్యార్థికైనా తప్పదు. అస్తమానం పుస్తకంలోనే తలదూర్చడం వల్ల కళ్లు అలసిపోతాయి. నిజానికి దగ్గరి వస్తువుల్ని, దూరపు వస్తువుల్ని మార్చి...

కళ్లు అలసిపోకుండా...

పరీక్షల వేళ... ఎక్కువ గంటలు చదవడం అన్నది ఏ విద్యార్థికైనా తప్పదు. అస్తమానం పుస్తకంలోనే తలదూర్చడం వల్ల కళ్లు అలసిపోతాయి. నిజానికి దగ్గరి వస్తువుల్ని, దూరపు వస్తువుల్ని మార్చి మార్చి చూడటం అనేది సహజంగా జరగాలి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. కళ్ల అలసటను అరికట్టాలంటే పాటించాల్సిన నియమాలివి... 


చదవడానికి కూర్చునే చోటు ఎలా ఉండాలంటే... వెలుతురు ధారాళంగా పడాలి. దాంతోపాటే  మధ్యలో దూర ప్రదేశాలను చూడటానికి వీలుగా ఉండాలి. అందుకోసం కారిడార్‌లోనో లేదా కిటికీ పక్కనో కూర్చోవాలి. ఒకవేళ ఉన్న గదిలో అలాంటి వెసులుబాటు లేకపోతే, ఎదురుగా పెద్ద అద్దమైనా అమర్చుకోవాలి. అద్దంలోంచి చూడటం ద్వారా కూడా కంటి ఒత్తిడి  కొంత తగ్గుతుంది. 


ఇంట్లో గదులు చిన్నగా ఉంటే... చదవడం మొదలెట్టిన ప్రతి 40 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి గది వెలుపల 5 నిమిషాల పాటు అటూఇటూ తిరగాలి.  


పరీక్షల దృష్టితో చూస్తే, ఎంత చదివాం అనేదాని కన్నా, ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాం అన్నదే ముఖ్యం! రాత్రి అయ్యే సరికి సహజంగానే కళ్లు అలసిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఎంత చదివినా, విషయాన్ని గ్రహించడంగానీ, జ్ఞాపకం పెట్టుకోవడంగానీ తక్కువగానే ఉంటుంది. అందువల్ల రాత్రివేళ కన్నా,  పొద్దున్నే చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ రాత్రివేళ చదవడం  తప్పనిసరైతే, మసక వెలుగు కాకుండా, సరిపడా వెలుగు ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. 

ఎక్కువ గంటలు చదువుతున్నప్పుడు సహజంగానే కంటి రెప్పలు కొట్టుకోవడం తగ్గిపోతుంది. దానివల్ల కళ్లు పొడిబారడం గానీ, మసకబారడం గానీ జరుగుతుంది. కొందరికైతే కళ్లు మండుతాయి కూడా. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్య మధ్య తరచూ కళ్లను టపటపలాడించాలి. దీనివల్ల కళ్లు తేమగా ఉండి, చదవడంలో ఇబ్బంది అనిపించదు.

Updated Date - 2020-03-04T05:54:38+05:30 IST