విస్తృతంగా పరీక్షలు చేయాలి

ABN , First Publish Date - 2020-04-01T09:24:15+05:30 IST

కానూరు సుజాతారావు.. తొలి తెలుగు ఐఏఎస్‌ అధికారిణి. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఆమె రూపొందించిన విధానాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి.

విస్తృతంగా పరీక్షలు చేయాలి

  • బాధితులకు సరైన చికిత్స అందించాలి
  • అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచాలి
  • పరీక్షల కిట్లు ఎన్ని ఎక్కువుంటే అంత మంచిది
  • లేకపోతే లాక్‌డౌన్‌ నిరుపయోగమవుతుంది
  • ఇన్ఫెక్షన్‌ పెరిగే ప్రమాదమూ ఉంటుంది
  • ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి
  • ప్రస్తుతం వైద్యులను కాపాడుకోవాలి
  • ప్రాథమిక ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల అజెండా
  • ‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు


హైదరాబాద్‌ సిటీ, మార్చి31 (ఆంధ్రజ్యోతి): కానూరు సుజాతారావు.. తొలి తెలుగు ఐఏఎస్‌ అధికారిణి. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఆమె రూపొందించిన విధానాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. ‘ప్రాథమిక ఆరోగ్య రక్షణ ప్రభుత్వాల అజెండా కావాలి’ అంటున్న సుజాతారావు కొవిడ్‌ని కట్టడి చేసేందుకు రోగనిర్ధారణ పరీక్షలను పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కరోనాను అణచివేయడంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు, పౌరసమాజం బాధ్యతపై  సుజాతారావుతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ. 

 

కరోనా నిర్మూలనకు ఎలాంటి చర్యలు అవసరం?

లాక్‌డౌన్‌ విధించడం సరైన చర్య. ఇప్పుడు మనం విస్తృతంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. బాధితులకు సరైన చికిత్స అందించడం అత్యవసరం. అలాగే అనుమానితులను ఐసొలేషన్‌లో పెట్టాలి. ఈ సమయంలో మనం ఎంత ఎక్కువగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగలిగితే అంత మంచిది.   


సరైన వైద్యసేవలను అందించాలంటే..?

మన జనాభాకి సరిపడా వైద్యులు లేరు. కొన్ని వేల నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెయ్యిమంది జనాభాకి ఒక బెడ్‌ ఉండాలి. కానీ, మన దగ్గర ప్రస్తుతం 0.7 శాతం మాత్రమే ఉన్నాయని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు, సౌకర్యాలు లేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలి. అయితే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా మన ప్రభుత్వాలు చురుగ్గా స్పందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రక్షణకు కనీసం 2.5-3 శాతం నిఽధులను కేటాయించాలి.  


కరోనా కట్టడిలో మీరిచ్చే సూచనలు?

లాక్‌డౌన్‌ను ప్రజలంతా కఠినంగా పాటించాలి. ‘ఏ వ్యక్తీ ఆకలితో బాధపడకూడదు’ అనే సంకల్పంతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. కొవిడ్‌ చికిత్సపై ఆరోగ్య సిబ్బందికి వారం రోజులైనా శిక్షణ ఇవ్వాలి.  


అందుబాటులో ఉన్న వైద్యసేవలపై?

ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు. వైద్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.   


ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు?

దక్షిణకొరియాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు పెట్టలేదు. అయినా వారు చాలా వరకు వైర్‌సను నియంత్రించగలుగుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే.  


కరోనా వ్యాక్సిన్‌పై మనదేశంలో ప్రయోగాలు జరుగుతున్నాయా?

మన దేశంలో వైద్య రంగానికి ప్రాధాన్యం లేదు. ఇతర రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా, ఒక్క వైర్‌సతో అదంతా కొట్టుకుపోతుంది. ప్రస్తుత పరిస్థితులు చూసైనా మార్పు వస్తుందనుకుంటున్నా. ఇతర దేశాల నుంచి మనదేశానికి వ్యాప్తిచెందుతున్న వైర్‌సలు ఇక్కడి మనుషుల శరీరాల్లో ఎంత వరకు ఇమ్యులేట్‌ అవుతున్నాయన్న విషయాలపై కనీస పరిశోధనలు జరగాలి.

Updated Date - 2020-04-01T09:24:15+05:30 IST