నిబద్ధతతో ఆచరించాలి!

ABN , First Publish Date - 2021-06-25T05:30:00+05:30 IST

దైవ మందిరాలను సందర్శించేవాళ్ళూ, దైవ వాక్యాలను క్రమం తప్పకుండా వినేవాళ్ళూ ఎందరో కనిపిస్తూ

నిబద్ధతతో ఆచరించాలి!

దైవ మందిరాలను సందర్శించేవాళ్ళూ, దైవ వాక్యాలను క్రమం తప్పకుండా వినేవాళ్ళూ ఎందరో కనిపిస్తూ ఉంటారు. అయితే వినడానికీ, ఆచరించడానికీ ఎంతో తేడా ఉంది.


దైవ సందేశాలను ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తూ... తమనుతాము ఉత్తమమైన దైవజనులుగా భావిస్తే... ఆత్మవంచన చేసుకున్నట్టే. ‘‘తప్పుడు ఆలోచనలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కేవలం దైవ వాక్యాన్ని వినేవాళ్ళుగా మాత్రమే మిగిలిపోకండి. దాన్ని ఆచరించేవాళ్ళుగా మారండి’’ అంటాడు యాకోబు. వాక్యాన్ని విన్నప్పటికీ దాన్ని పాటించని మనిషి... ‘‘అద్దంలో ముఖం చూసుకొనే వాడిలా ఉంటాడు. అద్దంలో చూసుకున్న తరువాత బయటకు వెళ్ళిన వెంటనే తన ముఖం ఎలా ఉంటుందనే విషయం అతనికి గుర్తుండదు’’ అంటూ ఉదాహరణ కూడా చెప్పాడు. మానవాళికి స్వేచ్ఛను అందించే పరిపూర్ణమైన శాసనం దేవుడి వాక్కు. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనసా వాచా నిబద్ధతతో ఆచరించాలి. అలా చేసే వ్యక్తి దైవ సందేశాన్ని ఊరికే విని మరచిపోడు. దాన్ని గుర్తు పెట్టుకుంటాడు. దానికి బద్ధుడై ఉంటాడు. ఆచరణలో పెడతాడు. అతను చేసే పనులన్నీ అతనికి ఆనందాన్ని కలిగిస్తాయి. అతన్ని రక్షించగలిగేది దేవుని వాక్యమేనని చెబుతాడు యాకోబు.


 ‘‘మనలోని మలినాలను కడిగేసుకోవాలి. మనలో ఉన్న చెడు తాలూకు గుర్తులన్నిటినీ చెరిపేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వినమ్రంగా స్వీకరించాలి. దాన్ని హృదయంలో నాటుకోవాలి’’ అంటూ ఆయన చెప్పిన మాటలు విశ్వాసులందరికీ మార్గదర్శకాలు.


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST