ఈటలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా.. ఇప్పటినుంచే..

ABN , First Publish Date - 2021-06-11T05:53:25+05:30 IST

ఈటల లాగా పార్టీలో..

ఈటలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా.. ఇప్పటినుంచే..

ఓడించి తీరాలి..

ఈటలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహం 

13న సీఎం కేసీఆర్‌ సమక్షంలో సమావేశం 

హైదరాబాద్‌లో భేటీ అయిన వినోద్‌కుమార్‌, హరీష్‌, గంగుల, కొప్పుల

 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు కార్యక్రమం ఖరారైంది. దీనికి ముందే ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనుండడంతో హుజూరాబాద్‌లో ఆరునెలల్లోగా ఉప ఎన్నిక అనివార్యమని తేలిపోయింది. ఈటల లాగా పార్టీలో మరెవ్వరూ ధిక్కార స్వరం వినిపించే సాహసం చేయకుండా చూసేందుకు ఆయనను ఓడించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉంది. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పక్కనపెట్టి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలు మాదిరిగానే హుజూరాబాద్‌లో కూడా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించి ఈటలను అన్ని వైపులా ముట్టడించాలని భావిస్తున్నారు. 


మండల ఇన్‌చార్జీల నియామకం

ఇప్పటికే ఇందుకోసం మండలానికో మంత్రిని, ఒక్కో ఎమ్మెల్యేను, ఇతర ముఖ్యనాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. మరికొద్ది రోజుల్లో మండలానికి మరో ఎమ్మెల్యేను కూడా కేటాయించనున్నట్లు సమాచారం. అన్ని కులాలకు చెందిన మంత్రులను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈనెల 13న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ఈ ఇన్‌చార్జీలు, నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 


అన్ని వివరాలతో నివేదికలు

ఈలోగానే గ్రామాలవారీగా పార్టీ స్థితిగతులు, సమస్యలు, పెండింగ్‌ పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీకి విదేయులు, ఈటల మద్దతుగా నిలుస్తున్నవారి వివరాలతో నివేదికలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే ప్రారంభమైన గ్రామస్థాయి సమావేశాలను శుక్రవారం నుంచి ముమ్మరం చేసి రెండు రోజుల్లో అన్ని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. హుజూరాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలకు మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సతీష్‌బాబు, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావును ఇన్‌చార్జీలుగా నియమించారు. జమ్మికుంట మండలానికి మంత్రి కొప్పుల ఈఽశ్వర్‌, శాసనసభ్యుడు ఆర్‌ రమేశ్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణరావు, వీణవంక మండలానికి శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఇన్‌చార్జీలుగా నియమించారు. కమలాపూర్‌ మండల బాధ్యతలను మంత్రి దయాకర్‌రావు, శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి, సీనియర్‌ నాయకుడు పి రవీందర్‌రావులకు అప్పగించారు. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ నియోజకవర్గ స్థాయిలో పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వర్తిస్తారు. 


కొప్పుల నివాసంలో మంత్రుల భేటీ ...

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి గురువారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని మంత్రి కొప్పుల నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.  మంగళ, బుధవారాల్లో మాజీ మంత్రి ఈటల నియోజకవర్గంలోని కమలాపూర్‌, ఇల్లందకుంట మండలాల్లో నిర్వహించిన పర్యటన, దానికి వచ్చిన స్పందన అంశాలను వీరు సమీక్షించినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రామాలవారీగా నిర్వహిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను వేగవంతం చేసి రెండురోజుల్లోనే అన్ని గ్రామాలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని భావించినట్లు తెలుస్తున్నది. 13న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చేసే మార్గదర్శనం మేరకు వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసి హుజూరాబాద్‌ను కైవసం చేసుకోవాలని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.  


Updated Date - 2021-06-11T05:53:25+05:30 IST