Abn logo
Sep 21 2021 @ 01:25AM

దహనం చేయాలి.. ఖననమే చేయాలి!

మతం మారిన వ్యక్తి మృతదేహంపై తల్లి, కుమార్తె


ఇండోర్‌, సెప్టెంబరు 20: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సలీమ్‌ ఖాన్‌(48) హైందవ కుటుంబంలో జన్మించాడు. తన విశ్వాసాల మేరకు ఇస్లాంలోకి మారాడు. తన కుమార్తెకు ఇస్లాం ప్రకారమే పేరు పెట్టి, అలాగే పెంచాడు. తాజాగా సలీం కన్నుమూశాడు. అతడి మృతి పట్ల కుటుంబ సభ్యుల ఆవేదన అలా ఉంచితే.. అతడికి అంతిమ సంస్కారాలను నిర్వహించే విషయంలో మాత్రం పెద్ద చిక్కొచ్చిపడింది. హిందువుగా ఉన్న ఆయన తల్లి, తన కుమారుడిని దహనం చేయాలని డిమాండ్‌ చేసింది.


కానీ సలీమ్‌ కుమార్తె రాణి షేక్‌ మాత్రం అతడిని ఇస్లాం నమ్మకాల ప్రకారం ఖననం చేయాలని పట్టుబట్టింది. చివరకు అధికారులు వారిద్దరినీ ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించారు. హైందవ ఆచారాల ప్రకారం సలీమ్‌ మృతదేహానికి ముందు సంస్కారాలు నిర్వహించి, అనంతరం ఇస్లాం నమ్మికను అనుసరించి అతడి మృతదేహాన్ని ఖననం చేయనున్నట్లు వారు తెలిపారు.