ప్రధానమంత్రి సహాయనిధికి డబ్బులు పంపిస్తున్నారా..? ఈ నకిలీ ఐడీలతో జాగ్రత్త..!

ABN , First Publish Date - 2020-04-07T16:34:40+05:30 IST

లాక్‌డౌన్‌ను కూడా సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మందు బాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మద్యం విక్రయాలలో పేరున్న బగ్గా వైన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మద్యం అమ్ముతామంటూ

ప్రధానమంత్రి సహాయనిధికి డబ్బులు పంపిస్తున్నారా..? ఈ నకిలీ ఐడీలతో జాగ్రత్త..!

ఆన్‌లైన్‌లో మద్యం విక్రయం పేరుతో మోసం

రూ. 51 వేలు కోల్పోయిన హైదరాబాద్ నగరవాసి

మా సంస్థ పేరు దుర్వినియోగం చేస్తున్నారు : బగ్గావైన్స్‌ ఫిర్యాదు

ల్యాప్‌టాప్‌ల విక్రయం పేరుతో మరో మోసం

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు

ప్రధాని సహాయనిధి పేరుతో నకిలీ యూపీఐలు

కేవైసీ, కార్ట్‌ అప్‌డేట్‌ పేరుతో ఖాతాలు ఖాళీ

ఈఎంఐల పేరుతో వల వేసేందుకు పథకం


హిమాయత్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను కూడా సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మందు బాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మద్యం విక్రయాలలో పేరున్న బగ్గా వైన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మద్యం అమ్ముతామంటూ వల విసిరి కొందరితో నగదు బదిలీ చేయించుకున్నారు. గౌలిపురాకు చెందిన ఓ యువకుడు మద్యం కోసం సైబర్‌ నేరగాళ్లు సూచించిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రూ.51 వేలు చెల్లించి మోసపోయాడు. ఈ ఘటనపై బాధితుడితో పాటు తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ బగ్గా వైన్స్‌ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మోసానికి నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎలక్ర్టానిక్‌ వస్తువుల ధరలు తగ్గాయని, అతి తక్కువకే బల్క్‌గా తాము ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తున్నామంటూ ప్రకటన ఇచ్చారు. దానికి ఆకర్షితులైన నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రూ. 1.25 లక్షలను బదిలీ చేశారు. ఆ తర్వాత ప్రకటన మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించారు.


మరికొన్ని ఘటనలు

ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్‌ ఫండ్‌ (పీఎం సీఏఆర్‌ ఈఎస్‌ఫండ్‌) సరైన యూపీఐ "pmcares@sbi'’... కానీ... కొందరు ఈ నిధికి వచ్చే డబ్బులు కాజేసేందుకు నకిలీ యూపీఐడీలను సృష్టించారు. వివిధ బ్యాంకుల పేర్లు జత చేయడం ద్వారా ‘pmcares@pnb’, ‘pmcares@hdfcbank’,  pmcares@yesbank', "pmcares@upi', " pmcares@sbi', "pmcares@icici' వంటి నకిలీ ఐడీలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసి విరాళాలు కోరుతున్నారు. వీరిపై సైబర్‌క్రైం పోలీసులు గత శుక్రవారం కేసులు నమోదు చేశారు.


కేవైసీ అప్‌డేట్‌ పేరుతో..

మూసారాంబాగ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసి మొబైల్‌ వాలెట్‌ పనిచేయాలంటే కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ, వివరాలు సేకరించిన సైబర్‌ దొంగలు అతడి ఖాతా నుంచి రూ. 51 వేలు మాయం చేశారు. ఈ ఘటన శనివారం జరిగింది. 


డెబిట్‌కార్డు అప్‌డేట్‌ పేరుతో... డెబిట్‌ కార్డు అప్‌డేట్‌ చేయించుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ నివాసి నుంచి కార్డు వివరాలు సేకరించిన నేరగాళ్లు అతడి అకౌంట్‌ నుంచి రూ. 80 వేలు వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

Updated Date - 2020-04-07T16:34:40+05:30 IST