మూసీలోకి మురుగు

ABN , First Publish Date - 2021-03-02T07:00:12+05:30 IST

మురికికూపంగా మారిన మూసీనదిలో దుర్గంధాన్ని తొలగించాలని

మూసీలోకి మురుగు

ఎస్టీపీలు ఏనాటికి వచ్చేను?

51 శాతం మురుగు నేరుగా మూసీలోకే..

62 ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు

నగరంలోని 17 ఎస్టీపీలకు టెండర్ల ఖరారు

హైదరాబాద్‌ సిటీ, మార్చి1 (ఆంధ్రజ్యోతి): మురికికూపంగా మారిన మూసీనదిలో దుర్గంధాన్ని తొలగించాలని ఎన్జీటీ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రభుత్వ శాఖల్లో కదలిక లేదు. నగరంలోని సివరేజీ మొత్తం నేరుగా మూసీనదిలో కలుస్తుండడంతో కాలుష్యకాసారంగా మారింది. జలచరాలు బతికేందుకు కూడా వీలుగా లేదు. మూసీనదిలో కలిసే మురుగునీటిని వందశాతం శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదలాల్సి ఉండగా, అందుకు భిన్నంగా కేవలం 49 శాతం మాత్రమే శుద్ధి అవుతోంది. 51 శాతం మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీనదిలో కలుస్తోంది. మూసీ శుద్ధికి మరిన్ని ఎస్టీపీల నిర్మాణానికి వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రతిపాదన లు జరిగినా, అందులో కేవలం 17 ఎస్టీపీల నిర్మాణానికి మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మూసీనది వెంట నిర్మించాల్సిన ఎస్టీపీలపై అడుగు కూడా ముందుకు పడలేదు.

మూసీనదిలో కలిసే మురుగునీరును వంద శాతం శుద్ధి చేసిన తర్వాతే వదలాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నిర్ణీత గడువు పెట్టుకోవాలని ప్రభుత్వానికి ఎన్జీటీ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులు సూచించాయి. 2044 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ 2,585 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుందని, అప్పటి జనాభాకు అనుగుణంగా 62 ఎస్టీపీలు అవసరమని వాటర్‌బోర్డు అధికారులు అంచనా వేశారు. ఓ కన్సల్టెన్సీ సంస్థతో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపొందించారు. అయితే, 62 ఎస్టీపీలలో 57 ఎస్టీపీల నిర్మాణానికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో 258 ఎకరాలు అవసరమని భావించారు. ఈ పనులను మూడు దశలో చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో 17 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం  అనుమతులిచ్చింది. మిగతా పనులకు అనుమతులు రావాల్సి ఉంది. 

మొదటి దశలో 17 ఎస్టీపీలకు మోక్షం

 ప్రభుత్వ అనుమతి లభించిన ప్రతిపాదనల ప్రకా రం.. నగరంలోని కూకట్‌పల్లి నాలా, పరిసర ప్రాంతాల్లో 17 ఎస్టీపీలను 376 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు అనువుగా నిర్మించాలని భావించారు. రూ.1081.75 కోట్లతో హైబ్రిడ్‌ యాన్యూటీ పద్ధతిలో ఈ ఎస్టీపీలకు వాటర్‌బోర్డు టెండర్లను ఆహ్వానించగా, పలు సంస్థలు పోటీపడ్డాయి. రెండు సంస్థలు మాత్రమే టెండర్‌కు అర్హత సాధించాయి. నిర్మాణ పనులు దక్కించుకునే సంస్థ ఎస్టీపీ నిర్మాణానికి అవసరమైన 60 శాతాన్ని వ్య యం చేయాలి. మిగిలిన 40 శాతం వాటర్‌బోర్డు చెల్లిస్తుంది.  నిర్మాణం పూర్తయిన తర్వాత వాటర్‌బోర్డు పదేళ్లపాటు 60 శాతాన్ని వాయిదాల చొప్పున వడ్డీతో కలిపి నిర్మాణ సంస్థకు చెల్లిస్తుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్టీపీల నిర్మాణ పనులను దక్కించుకున్నట్లు తెలిసింది.

మూసీ వెంట కలగని మోక్షం

మూసీనదిలో సుమారు 27 కాలువల ద్వారా మురుగునీరు వచ్చి చేరుతోంది. అంబర్‌పేట, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో పలు కాలువలపై ఆరు వరకు మాత్రమే ఎస్టీపీలు ఉన్నాయి. ఈ ఎస్టీపీల సామర్థ్యానికి మించి మురుగునీరు వస్తే, అది నేరుగా మూసీలో కలుస్తోంది. ఎస్టీపీలు లేని కాలువల ద్వారా వ్యర్థాలన్నీ మూసీలో కలుస్తున్నాయి. మూసీనది ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో మూసీ వెంట ఎస్టీపీల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, అధికారులు కూకట్‌పల్లి నాలా పరిసర ప్రాంతాల్లోనే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గంగా నమామీ  పేరుతో గంగానదిని ప్రక్షాళన చేస్తుండగా, కేంద్రం నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రెండో దశకు ప్రాధాన్యతనిస్తోందా అనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2021-03-02T07:00:12+05:30 IST