మధురలో మసీదును హిందువులకు ముస్లింలు అప్పగించాలి : యూపీ మంత్రి

ABN , First Publish Date - 2021-12-07T23:11:24+05:30 IST

మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయానికి సమీపంలో

మధురలో మసీదును హిందువులకు ముస్లింలు అప్పగించాలి : యూపీ మంత్రి

బాలియా (ఉత్తర ప్రదేశ్) : మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయానికి సమీపంలో ఉన్న మసీదును ముస్లింలు హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా కోరారు. మధుర, వారణాసిల్లోని తెల్లని నిర్మాణాలు (వైట్ స్ట్రక్చర్స్) హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నాయన్నారు. న్యాయస్థానం సహాయంతో వీటిని తొలగించే సమయం వస్తుందని చెప్పారు. సోమవారం పొద్దుపోయాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చెప్పిన మాటలను శుక్లా గుర్తు చేశారు. భారత దేశంలోని ముస్లింలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ పూర్వీకులని విశ్వసించాలని, బాబర్, అక్బర్, ఔరంగజేబు దాడులు చేసినవారని గుర్తించాలని లోహియా చెప్పారన్నారు. బాబర్, అక్బర్, ఔరంగజేబు నిర్మించిన భవనాలను తమవిగా భావించకూడదని చెప్పినట్లు తెలిపారు. 


మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి సముదాయంలో ఉన్న వైట్ స్ట్రక్చర్‌ను హిందువులకు అప్పగించడానికి ముస్లింలు ముందుకు రావాలన్నారు. ఈ పని పూర్తి చేసే సమయం వస్తుందని చెప్పారు. ప్రస్తుతం అయోధ్యలో దివ్యమైన రామాలయం నిర్మితమవుతోందన్నారు. 1992 డిసెంబరు 6న కర సేవకులు రామ్ లల్లాపై కళంకాన్ని తొలగించారని తెలిపారు. 


మాజీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వీ ఇటీవల సనాతన ధర్మంలోకి మారడం గురించి విలేకర్లు ప్రస్తావించినపుడు శుక్లా స్పందిస్తూ, రిజ్వీని అభినందించారు. ప్రస్తుత భారతీయు ముస్లింలు సుమారు 250 సంవత్సరాల క్రితం హిందూ మతం నుంచి మారినవారేనని చెప్పారు. రిజ్వీ ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు. ముస్లింలంతా తిరిగి హిందూ మతంలోకి రావడాన్ని తాము ఇష్టపడతామని తెలిపారు. 


Updated Date - 2021-12-07T23:11:24+05:30 IST