Chamarajpet Idgah : బీబీఎంపీ వైఖరి పెద్ద పజిల్ : ముస్లిం నేతలు

ABN , First Publish Date - 2022-06-08T23:07:15+05:30 IST

కర్ణాటకలోని చామరాజు పేట ఈద్గా మైదానంపై వివాదంలో బెంగళూరు

Chamarajpet Idgah : బీబీఎంపీ వైఖరి పెద్ద పజిల్ : ముస్లిం నేతలు

బెంగళూరు : కర్ణాటకలోని చామరాజు పేట ఈద్గా మైదానంపై వివాదంలో బెంగళూరు నగర పాలక సంస్థ (BBMP) వైఖరి స్పష్టంగా లేదని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మైదానం యాజమాన్యంపై వివాదం 1950వ దశకంనాటిదని, ఈ భూమి స్వాధీనాన్ని ధ్రువీకరించాలని కోరుతూ ముస్లింల తరపున రుక్న్-ఉల్-ముల్క్ ఎస్ అబ్దుల్ వాజిద్ దావా వేశారని చెప్తున్నారు. ఈ దావాను బెంగళూరు సెకండ్ మున్సిఫ్ డిస్మిస్ చేశారని,  దీనిపై అపీలును విచారించిన సివిల్ జడ్జి దావాకు డిక్రీ ఇచ్చారని అంటున్నారు.


సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ (సీఎంఏ) ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరు సివిల్ జడ్జి తీర్పును నగర పాలక సంస్థ 1959 మార్చి 20న హైకోర్టులో సవాల్ చేసింది. కానీ నగర పాలక సంస్థకు ఉపశమనం లభించలేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోగా, బీబీఎంపీకి ఖర్చులు విధిస్తూ 1964 జనవరి 27న అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 


ఈద్గా మైదానం చామరాజు పేట ఎక్స్‌టెన్షన్‌లో సర్వే నెంబరు 40లో ఉంది. దీని విస్తీర్ణం 10 ఎకరాల 5 సెంట్లు. దీనిలో ముస్లిం శ్మశాన వాటిక కూడా ఉంది. ఈ శ్మశాన వాటికను వేరొక చోటుకు తరలించడంతో ఈద్గాకు 2 ఎకరాల 10 సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ భూమిలో అదనపు భవనాన్ని నిర్మించడానికి బీబీఎంపీ ప్రయత్నించడంతో వాజిద్ దావా వేసినట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. తాము అనేక సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉంటున్నామని ముస్లింలు కోర్టుకు తెలిపారు. ప్లాట్‌ఫారం మీద మాత్రమే ప్రార్థనలు జరుగుతాయన్న బీబీఎంపీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కార్పొరేషన్ దాఖలు చేసిన అపీలును హైకోర్టు తోసిపుచ్చడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 


2019 ఫిబ్రవరిలో బీబీఎంపీ చామరాజు పేట డివిజన్ 941 చదరపు అడుగుల విస్తీర్ణంగల భూమికి ఖాతా సర్టిఫికేట్‌ను ముస్లింలకు అనుకూలంగా జారీ చేసింది. వ్యక్తిని లేదా సంస్థను పార్టీగా చేర్చకుండా ఈ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర వక్ఫ్ బోర్డు చాలా సంవత్సరాల నుంచి ఈద్గాను నోటిఫై చేస్తోంది. సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ నిర్వహించే గెజిటెడ్ వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటోంది. 1964లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలు దాఖలు కావడం కానీ, దానిని రద్దు చేయడం కానీ జరగలేదని బోర్డు సీఈఓ ఖాన్ పర్వేజ్ చెప్పారు. ఈ వాస్తవాలన్నిటినీ పరిశీలించినపుడు బీబీఎంపీ వైఖరి స్పష్టంగా, కచ్చితంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనిపై అధికారులు మాట్లాడటానికి ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. సీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ జహీరుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ, తాము బీబీఎంపీ అధికారులను కలిసి, దస్తావేజులను సమర్పిస్తామని చెప్పారు. 


Updated Date - 2022-06-08T23:07:15+05:30 IST