మహిళకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన ముస్లిం.. కోర్టు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-10-20T09:08:10+05:30 IST

మహిళకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన ముస్లిం వ్యక్తి జర్మన్ పౌరసత్వం పొందకూడదని జర్మనీలోని కోర్టు

మహిళకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన ముస్లిం.. కోర్టు ఏం చేసిందంటే..

బెర్లిన్: మహిళకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన ముస్లిం వ్యక్తి జర్మన్ పౌరసత్వం పొందకూడదని జర్మనీలోని కోర్టు గత శుక్రవారం తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లెబనాన్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి 2002లో జర్మనీకి వచ్చాడు. మెడిసిన్ చదవి జర్మనీలోనే వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు. 2012లో సహజీకరణం ద్వారా జర్మన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పౌరసత్వానికి సంబంధించి అన్ని పరీక్షలు కూడా పాసయ్యాడు. అయితే పౌరసత్వ ప్రక్రియలో భాగంగా 2015లో ఓ మహిళా అధికారిని కలిసిన సదరు ముస్లిం వ్యక్తి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మహిళా అధికారి అతడి సర్టిఫికెట్‌ను నిలిపివేసి దరఖాస్తును రద్దు చేసింది. 


దీనిపై ముస్లిం వ్యక్తి కోర్టుకు వెళ్లగా అక్కడ నిరాశే ఎదురైంది. ఇక మరో కోర్టులో అప్పీల్ చేసుకోగా తాజాగా ఈ కోర్టు కూడా అతడికి వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. అయితే తాను మతపరమైన కారణాల వల్ల మహిళా అధికారికి షేక్ హ్యాండ్ ఇవ్వనట్టు ముస్లిం వ్యక్తి కోర్టుకు తెలిపాడు. మరో స్త్రీ చేతిని తాకనని తన భార్యకు మాటిచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే జడ్జి మాత్రం షేక్ హ్యాండ్‌ను ఒక గ్రీటింగ్ కింద అభివర్ణించారు. అంతేకాకుండా షేక్ హ్యాండ్‌కు చట్టబద్దమైన అర్థం కూడా ఉందని చెప్పారు. ఒక ఒప్పందానికి ముగింపుగా షేక్ హ్యాండ్ ప్రతీక అని జడ్జి వివరించారు. లింగ బేధం ప్రాతిపదికన ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తే వారు జర్మనీ రాజ్యాంగంలోని సమానత్వాన్ని ఉల్లంఘించినట్టేనని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు పౌరసత్వం పొందకూడదని తీర్పునిచ్చారు. కాగా.. ఈ కోర్టులో కూడా నిరాశే ఎదురుకావడంతో ముస్లిం వ్యక్తి ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-10-20T09:08:10+05:30 IST