వాట్సాప్‌కు చుక్కలు చూపించిన మస్క్ ట్వీట్..

ABN , First Publish Date - 2021-01-09T02:36:19+05:30 IST

ఉదయాన్నే నిద్ర లేచిన సమయం నుంచీ వాట్సాప్ మన జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు ఏవైనా ముఖ్యమైన వాట్సాప్ మెసేజెస్ వచ్చాయా? అని చూసుకోవడంతోనే మన రోజు మొదలవుతోంది.

వాట్సాప్‌కు చుక్కలు చూపించిన మస్క్ ట్వీట్..

ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే నిద్ర లేచిన సమయం నుంచీ వాట్సాప్ మన జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు ఏవైనా ముఖ్యమైన వాట్సాప్ మెసేజెస్ వచ్చాయా? అని చూసుకోవడంతోనే మన రోజు మొదలవుతోంది. ఇంతలా మన జీవితాల్లో భాగమైన వాట్సాప్.. తాజాగా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ ప్రైవసీ పాలసీలో కొత్తగా మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అలా వెలువడిందో లేదో.. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనంతటికీ ముఖ్యమైన కారణం.. ప్రస్తుత ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.


మనందరం ఉపయోగిస్తున్న వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కంపెనీ ఎప్పుడో కొనేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫేస్‌బుక్ సంస్థ, దాని అధినేత మార్క్ జుకెర్‌బర్గ్‌కు స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌ మధ్య ఎప్పటి నుంచో మనస్పర్థలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ప్రజలెవరూ ఫేస్‌బుక్ వాడకూడదని మస్క్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. ఆ తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా జుకెర్‌బర్గ్, మస్క్ మధ్య సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి. ఏఐ విషయంలో జుకెర్‌బర్గ్‌కి సంపూర్ణ అవగాహన లేదని, పూర్తిగా అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నాడని మస్క్ విమర్శలు కూడా చేశారు.




ఇలాంటి సమయంలో వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం తప్పనిసరి చేయడం వివాదాస్పదం అయింది. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే యూజర్ల ఖాతాలను తొలగిస్తామని వాట్సాప్ ప్రకటించింది కూడా. దీనిపై అసంతృప్తి చెందిన ఎలన్ మస్క్.. ‘సిగ్నల్ వాడుకోండి’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఫేస్‌బుక్ చరిత్రను విమర్శనాత్మకంగా చూపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాట్సాప్ బదులుగా సిగ్నల్ యాప్ వాడుకోవాలని నెటిజన్లకు మస్క్ సలహా ఇచ్చాడు.


ఎలన్ మస్క్ ఇలా చెప్పాడో లేదో.. నెటిజన్లు సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేసుకోవడం మొదలు పెట్టేశారు. దీంతో ఈ యాప్ నుంచి వెరిఫికేషన్ ఓటీపీలు రావడం కూడా కష్టమైపోయిందట. అంటే యాప్ సర్వర్లకు ఏ రేంజ్‌లో ట్రాఫిక్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యను గుర్తించిన సిగ్నల్ కంపెనీ.. దాన్ని వెంటనే సరిదిద్దినట్లు తెలిపింది. అయితే ఇలా యూజర్లను కోల్పోవడంతో తమ కొత్త పాలసీలపై వాట్సాప్ కంపెనీ ఓ వివరణతో ముందుకొచ్చింది. వాట్సాప్ యూజర్లందరి డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం జరగదని, కేవలం బిజినెస్ అకౌంట్ల వివరాలు మాత్రమే ఫేస్‌బుక్‌ బిజినెస్ ఖాతాలతో పంచుకుంటామని చెప్పింది. కొత్త పాలసీకి ఓకే చెప్పినా కూడా సాధారణ యూజర్ల డేటాను వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం జరగదని తేల్చిచెప్పింది. మరి వాట్సాప్ ప్రకటనతో యూజర్లు సంతృప్తి చెందుతారా? లేక ఎందుకొచ్చిందీ తంటా? అనుకొని సిగ్నల్ వైపే అడుగులేస్తారా చూడాలి.

Updated Date - 2021-01-09T02:36:19+05:30 IST