తెలుగు మహిళ లక్ష్యంగా మస్క్‌ విమర్శ

ABN , First Publish Date - 2022-04-29T12:17:48+05:30 IST

దుష్ప్రచారానికి దిగితే అమెరికా అధ్యక్షుడని అయినా చూడకుండా.. డోనాల్డ్‌ ట్రంప్‌ అకౌంట్‌ను తొలగించింది ట్విటర్‌ సంస్థ! ట్విటర్‌ తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం వెనుక ఒక తెలుగు మహిళ ఉంది. ఆమె

తెలుగు మహిళ లక్ష్యంగా మస్క్‌ విమర్శ

ట్విటర్‌ లీగల్‌, పాలసీ హెడ్‌ విజయ గద్దె గత నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈలన్‌ మస్క్‌ ట్వీట్‌

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 28: దుష్ప్రచారానికి దిగితే అమెరికా అధ్యక్షుడని అయినా చూడకుండా.. డోనాల్డ్‌ ట్రంప్‌ అకౌంట్‌ను తొలగించింది ట్విటర్‌ సంస్థ! ట్విటర్‌ తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం వెనుక ఒక తెలుగు మహిళ ఉంది. ఆమె పేరు.. విజయ గద్దె(48)! తాజాగా ట్విటర్‌ను కొనుగోలు చేసిన స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఈలన్‌ మస్క్‌.. గతంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్‌ పెట్టడం సంచలనంగా మారింది! ‘‘ట్విటర్‌ కంపెనీ ఈలన్‌ మస్క్‌ పరం కాగానే.. దాని భవిష్యత్తు గురించి తలచుకుని ఆ సంస్థ లీగల్‌ పాలసీ హెడ్‌ విజయ గద్దె కన్నీటిపర్యంతం అయ్యార’’ంటూ పొలిటికో వార్తాసంస్థ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. సాగర్‌ ఎంజేటి అనే పొలిటికల్‌ పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ ఆ కథనం తాలూకూ క్లిపింగ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి, విజయగద్దె గురించి ప్రస్తావించి ప్రశంసించారు. ట్విటర్‌లో ఆమెను అత్యున్నతస్థాయి సెన్సార్‌షిప్‌ అడ్వొకేట్‌గా అభివర్ణించారు. దీనికి బదులుగా మస్క్‌.. ‘‘వాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు ఒక వార్తా సంస్థ ట్విటర్‌ ఖాతాను సస్పెండ్‌ చేయడం అసమంజసం’’ అంటూ విజయ గద్దె పేరు ప్రస్తావించకుండా ఆమెను విమర్శించారు!


ఉక్రెయిన్‌కు చెందిన ఒక ఇంధన సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు సంబంధాలున్నాయంటూ న్యూయార్క్‌ పోస్ట్‌ 2020లో ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని ట్విటర్‌ నుంచి తొలగించడంలో విజయ కీలకపాత్ర పోషించారు. మస్క్‌ తన ట్వీట్‌లో నర్మగర్భంగా ప్రస్తావించిన కథనం అదే. డెమొక్రాట్‌ అయిన బైడెన్‌కు ఎన్నికల్లో నష్టం కలగకుండా ఉండేందుకే విజయ అలా చేశారని.. ఆమె ఉదారవాది అని రిపబ్లికన్లు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జన్మించిన విజయ.. మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా చేరుకుని, టెక్సా్‌సలో పెరిగారు. న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. 2011లో ట్విటర్‌లో చేరారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విటర్‌లో రాజకీయ వాణిజ్యప్రకటనల నిషేధం నిర్ణయం వెనుక కీలకపాత్ర విజయదే. ఆమె వామపక్ష పక్షపాతి అనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో, ఈలన్‌ మస్క్‌ విజయను విమర్శిస్తూ ట్వీట్‌ పెట్టగానే.. ట్విటర్‌లో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ మొదలైంది. ఆమె భారతీయ నేపథ్యాన్ని, శరీర వర్ణాన్ని ప్రస్తావిస్తూ వేలాది మంది ట్వీట్లు చేశారు. ‘కర్రీ’ అని కొందరు.. కులాన్ని ప్రస్తావిస్తూ ఇంకొందరు.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.



ఇక.. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌పై మస్క్‌ తన జోరు పెంచారు. స్పేస్‌ ఎక్స్‌కు సంబంధించిన విశేషాలతోపాటు.. ట్విటర్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి విస్తృతంగా ట్వీట్లు చేస్తున్నారు. నన్ను విమర్శించే వారు కూడా ట్విటర్‌లో ఉండడమే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అలాగే.. కోకాకోలాలో ఒకప్పుడు కొకైన్‌ ఉండేదని, దాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతూ ప్రణయ్‌ పాతోలే అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు మస్క్‌ స్పందించారు. ‘కొకైన్‌ను తిరిగి తేవడానికి నెక్స్ట్‌ నేను కోకాకోలాను కొనబోతున్నాను’ అని సరదాగా ట్వీట్‌ చేశారు. మరోవైపు.. ట్విటర్‌ను మస్క్‌ సొంతం చేసుకున్న నేపథ్యంలో, దాని సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ పరిస్థితి ఏమిటనే దానిపై ట్విటర్‌లో చర్చలు జరుగుతున్నాయి. వాటిపై పరాగ్‌ స్పందించారు. ఎంత ‘రొద’ ఉన్నప్పటికీ తాను, తన బృందం ట్విటర్‌లో కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. మస్క్‌ ట్వీట్లను ఆయన ‘రొద’గా అభివర్ణించడం గమనార్హం.




Updated Date - 2022-04-29T12:17:48+05:30 IST