Abn logo
Jul 10 2020 @ 23:48PM

నేను చేసిన తప్పేంటి?

మూడున్నర దశాబ్దాల సినీ సంగీత జీవితం మణిశర్మది.  తెలుగు సహా తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో మధుర గీతాలను అందించారు. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్‌ గురించి ఎన్నో విషయాలు ‘చిత్రజ్యోతి’కి ప్రత్యేకంగా వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 


‘మణిశర్మ ఈజ్‌ బ్యాక్‌’ అని కొందరు అంటున్నారు. అయితే ఆ పదం నాకెందుకో నచ్చదు. నేనెక్కడికీ వెళ్లిపోలేదు ఇక్కడే ఉన్నా. ‘నేను ఇక పని చేయను. వెళ్లిపోతున్నా’ అనేసి వెళ్లి, మళ్లీ తిరిగి వస్తే ‘మణిశర్మ మళ్లీ వచ్చాడురా’ అనవచ్చు. నేను పరిశ్రమను వదిలి వెళ్లిపోలేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. 


ఆయనకు ఏకలవ్య శిష్యుడిని

ఇళయరాజాగారి దగ్గర నేను పనిచేయలేదు కానీ ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. నేను టీనేజ్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ ఆయన సంగీతాన్ని వింటూ ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను. నేను కీ బోర్డ్‌ ప్లేయర్‌గా రెండు వేల సినిమాల దాకా చేశాను. నేను పనిచేసిన ప్రతి సంగీత దర్శకుడూ నాకు గురువే. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. సో.. నేను అంతమందితో పనిచేయడం వల్ల అవన్నీ నా మెదడులో నిక్షిప్తం అయ్యాయి. అయితే నేను సంగీత దర్శకుడిని అయ్యాక వారి ప్రభావం నా పాటల మీద పడకుండా ఎప్పుడూ జాగ్రత్త వహిస్తుంటాను. ఇది చాలా కష్టమైన పని కూడా! ఎందుకంటే నా చెయ్యి కోస్తే మొదట ఇళయరాజాగారి సంగీతం, ఆ తర్వాత బ్లడ్‌ వస్తాయి. సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్‌ వచ్చినప్పుడు నేను ఆరు నెలలు మ్యుజీషియన్‌గా పని చేయడం మానేశాను. ప్రతి రోజూ ట్యూన్స్‌ ఎలా కంపోజ్‌ చేయాలో ఆ ఆరు నెలలు ప్రాక్టీసు చేశాను. అలా నన్ను నేను తయారు చేసుకొన్నాను. 


పాటల వరకే ఆ అనుబంధం

హీరోలతో నా అనుబంధం పాటల వరకే! చిరంజీవిగారు మాత్రం అప్పుడప్పుడు ఎలా ఉన్నావని పలకరిస్తుంటారు. ఎక్కడైనా కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మిగిలిన హీరోలతో పెద్దగా అనుబంధం లేదు. కారణం ఎవరికి వారు బిజీగా ఉండడమే!  అయితే అందరికంటే ఎక్కువగా మహేశ్‌తో సన్నిహితంగా ఉండేవాణ్ణి. ప్రతి వారం తప్పకుండా కలుసుకొనేవాళ్లం. చాలా విషయాలు డిస్కస్‌ చేసేవాళ్లం. ఆయన బిజీ కావడంతో మా మధ్య గ్యాప్‌ పెరిగింది. 


అలా ఎప్పుడూ చేయను!

నేను చేసిందే, చేసేదే కరెక్ట్‌ అని నేను ఎప్పుడూ అనుకోను. అలా అనుకుంటే నా సంగీతం  అన్ని చిత్రాల్లో ఒకేలా ఉంటుంది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఒక్కో హీరోకి ఒక్కో స్టయిల్‌ ఉంటాయి. నా పాటలు ఒకసారి గమనించండి. నేను చిరంజీవిగారికి కంపోజ్‌ చేసిన పాటలు మహేశ్‌కు సూట్‌ కావు. మహేశ్‌ పాటలు బాలకృష్ణకు సరిపోవు. బాలకృష్ణగారివి పవన్‌కల్యాణ్‌కు సూట్‌ కావు. ఒక్కో హీరో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా పాటలు కంపోజ్‌ చేస్తాను. కొంతమంది సంగీత దర్శకులు కంపోజ్‌ చేసిన పాటలు వింటుంటే అన్నీ ఒకేలా ఉంటాయి. ఏ హీరో పాటో అర్ధం కాదు. హీరోల బాడీ లాంగ్వేజ్‌, స్థాయికి అనుగుణంగా పాటలు చేయాలి. అలాగే ఒక్కో దర్శకుడికి ఒక్కో టేస్ట్‌ ఉంటుంది. దానికి అనుగుణంగా నేను కూడా వ్యవహరిస్తుంటాను. దాని వల్లే నేను వెరైటీ సంగీతం ఇవ్వగలుగుతాను. అలా చేయకపోతే నాకే నష్టం. 


పాట అనుకున్నట్లుగా వచ్చేవరకూ వదలను

నేను అనుకున్నట్లుగా పాట రాకపోతే ఆ గాయకుడిని పక్కకు తప్పించి, వేరే గాయకుడితో పాడించిన సందర్భాలు లేనేలేవు. పాట నాకు కావాల్సిన విధంగా వచ్చే వరకూ ఎన్ని రోజులైనా  వదిలిపెట్టను. అలా పాటల కోసం ఎక్కువ రోజులు కష్టపడింది ‘మృగరాజు’ చిత్రం కోసం. తక్కువ రోజుల్లో సునాయాసంగా చేసింది ‘ఖుషీ’ లోని పాటలు. ‘ఖుషి’ సినిమా తీసే సమయానికి నేను చాలా బిజీగా ఉన్నాను. మార్నింగ్‌ సెవన్‌ టు నైన్‌... ఇలా మూడు రోజులు మాత్రమే ఆ సినిమాకు ఇచ్చా. అందులోని పాటలు ఎంత హిట్‌      అయ్యాయో చెప్పనక్కర్లేదు. కానీ ఎక్కువ రోజులు పనిచేసిన ‘మృగరాజు’ చిత్రంలోని పాటలు మాత్రం చాలా మందికి రీచ్‌ కాలేదు. కొన్ని సార్లు అలాగే జరుగుతుంటుంది.


ఆ విషయంలో చాలా బాధపడ్డా

చాలా కష్టపడి చేసిన పాటలు జనానికి చేరువ కాలేకపోతే పడే బాధ వర్ణనాతీతం. గుణశేఖర్‌, జగపతిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘మనోహరం’ చిత్రంలో పాటలన్నీ బాగుంటాయి. కానీ సినిమా ఆడలేదు. అలాగే అశ్వినీదత్‌గారు నిర్మించిన ‘రావోయి చందమామ’, ‘బాలు’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’ సినిమాల కోసం అద్భుతమైన పాటలు ఇచ్చాను. కానీ అవి ప్రజలకు చేరలేదు. మొదట్లో చాలా బాధపడేవాణ్ణి. తర్వాత అలవాటయిపోయింది.  ‘సినిమా సక్సెస్‌ కాలేదా ... ఓకే మరో సినిమా కోసం ఇంకా మం చి పాటలు ఇద్దాం’ అనుకోవడం అలవాటు చేసుకొన్నా. 


హీరోలను అలా అడుగుతుంటా

అన్ని సినిమాలూ నేనే చేయాలి అనుకొనే మనస్తత్వం కాదు నాది. అయితే నలుగురితో పాటు నేనూ ఉండాలనుకొంటాను. అందుకే హీరోలను ఎప్పుడైనా కలసినప్పుడు ‘నా శిష్యులకు ఒక సినిమా ఇవ్వండి, మరొకరికి ఇంకో సినిమా ఇవ్వండి. నాకూ ఒక సినిమా ఇవ్వండి. అప్పుడే మీకు  వైవిధ్యమైన పాటలు వచ్చే అవకాశం ఉంటుంది’ అని సరదాగా అంటుంటా. నేను ఇంతకుముందు చేసిన పెద్ద సినిమాలు  ‘శక్తి’, ‘తీన్మార్‌’, ‘ఖలేజా’. ఈ మూడు సినిమాల విషయంలో నేను చేసిన పొరపాటు ఏమన్నా ఉందా? ఆ సినిమాలు ఆడలేదు కానీ నా పాటలు పాపులర్‌ అయ్యాయి కదా! కానీ ఆ సినిమాల నుంచి ‘ఆచార్య’ వరకూ నాకు పెద్ద సినిమా ఒక్కటీ రాలేదు. సంగీతపరంగా నేను చేసిన తప్పు ఏమన్నా ఉందా? సక్సెస్సే ఇక్కడ కొలమానం. ఎంత నేర్చుకున్నా, అనుభవం ఎంతున్నా అదృష్టం కలసిరావాలి. మరో విషయం ఏమిటంటే ఇప్పటి సంగీత దర్శకులు రేపటి గురించి ఆలోచించడం లేదు. నాలుగు కాలాల పాటు మన పాటలు ఉండాలి అనుకోవాలి. మనకెన్నో అద్భుతమైన రాగాలు ఉన్నాయి. సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ పాటలను స్వరపరిస్తే సంగీతం ఎక్కువ కాలం నిలబడుతుంది. 


నేను దొంగతనం చేయడంలేదుగా!

నేను కొన్ని సినిమాలకు నేపథ్య సంగీతం అందిస్తున్నాను.  నిజమే కానీ అదేమీ తప్పు కాదు. నేను దొంగతనం చేయడం లేదుగా! నా ఇంటికి వచ్చి ఈ సినిమా చేసి పెట్టాలి అని అడిగే నిర్మాతలను ఎలా కాదంటాను? నేను ఫుల్‌ బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇలా కొన్ని సినిమాలకు నేపథ్య సంగీతం అందించాను. నా వృత్తిని నేను గౌరవిస్తాను. వేరే వాళ్లు చేసే సినిమాలు నాకు ఇవ్వమని అడిగితే అది తప్పు. అయినా ఇప్పటి ట్రెండ్‌ కూడా మారిందిగా! ఐదుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్న సినిమాలు ఉన్నాయి. ఒక్కో పాట ఒక్కొక్కరు. నేపథ్య సంగీతం ఇంకొకరు. 


అలా బాధ పడిన రోజులు ఉన్నాయి

మంచి పాటలు చేసినప్పుడు ప్రభుత్వపరంగా గుర్తింపు రాకపోతే బాధ పడిన రోజులు ఉన్నాయి. అవార్డులు అనేవి హిట్‌ సినిమాకు ఇస్తారా లేక క్వాలిటీ మ్యూజిక్‌ ఉన్న సినిమాకు ఇస్తారా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కానీ విషయం. ‘ఖుషి’, ‘మురారి’, ‘అర్జున్‌’ ఇలా మంచి పాటలు చేసిన సినిమాలకు అవార్డులు రాలేదు. ‘అర్జున్‌’ సినిమాలో మధుర మీనాక్షి గుడికి సంబంధించిన ఎంతో రిసెర్చి చేసి పాటలు కంపోజ్‌ చేశాను. హిట్‌ సినిమా అనుకుంటే ‘పోకిరి’కి ఇవ్వాలి కదా! ఇంత మంచి పాటలు చేసినా ప్రభుత్వ పరంగా గుర్తింపు రాలేదే అని మనసు చివుక్కుమనేది. తర్వాత అలవాటయిపోయింది.


ఆచార్య’ సినిమాలో నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దర్శకుడు కొరటాల శివగారి శైలి విభిన్నంగా ఉంటుందని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు సంబంధించి మూడు పాటలు ఇప్పటికే రికార్డ్‌ అయ్యాయి. మిగతా పాటల కంపోజింగ్‌ కూడా అయింది. వాటిని రికార్డ్‌ చేసే లోగా కరోనా వచ్చి పని ఆసేసింది. పదేళ్ల తర్వాత చిరంజీవిగారి సినిమాకు వర్క్‌ చేస్తున్నా. సన్నివేశపరంగా కొన్ని పాటలు ఉంటూనే ఒక ఐటెం సాంగ్‌, సినిమాలో ఇద్దరు హీరోల మీద ఒక పాట, ఒక డ్యూయెట్‌ సాంగ్‌ ఉంటాయి. మెలోడీ సాంగ్‌, ఎమోషనల్‌ సాంగ్‌, మాంచి డాన్స్‌ నంబర్‌.. ఇలా పాటలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఆ సినిమాకు రీరికార్డింగ్‌ ప్రధానం అని చెప్పాలి.


నేను పొద్దునే ఆరు గంటలకు ఛాటింగ్స్‌ వింటా. తర్వాత వర్కవుట్‌ చేసేటప్పుడు మరో రకం సంగీతం వింటా. స్నానం చేస్తున్నప్పుడు ఎఫ్‌. ఎం. రేడియోలో వచ్చే పాటలు వింటా. ఆ తర్వాత స్టూడియోకు వెళతా. మధ్యాహ్నం ప్రతిరోజూ ఒక సినిమా చూస్తా. సాయంత్రం డ్రింక్‌ చేస్తున్నప్పుడు జాజ్‌ మ్యూజిక్‌ వింటా. పడుకొనేముందు మహమ్మద్‌ రఫీ పాటలు వినేసి పడుకుంటా. రోజూ ఇన్ని రకాల సంగీతాలు వింటుంటా.


ట్రావెలింగ్‌ అంటే నాకు ఇష్టం. ఇప్పటివరకూ ప్రపంచ పటంలోని 80 శాతం దేశాలను కవర్‌ చేశాను. కీ బోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేసేటప్పుడు బాలు గారు విదేశాల్లో నిర్వహించే సంగీత కచేరీలకు తప్పకుండా వెళ్లేవాడిని. అప్పుడే చాలా దేశాలు తిరిగేశాను. నేను సంగీత దర్శకుడినయ్యాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో దేశాలు చూసేశాను. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడివారి ఆచార వ్యవహరాలు, కల్చర్‌ను పరిశీలించడం నాకు ఆసక్తి. అలాగే సంగీత ధోరణులను కూడా అవగాహన చేసుకుంటా.

Advertisement
Advertisement
Advertisement