Aug 13 2021 @ 12:18PM

NTR30: ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

‘ఆర్‌ఆర్ఆర్‌’ చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. యంగ్‌ టైగర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్‌ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌న‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. 

ఇది వ‌ర‌కు అనిరుద్ తెలుగులో ‘అజ్ఞాత‌వాసి, జెర్సీ, నాని గ్యాంగ్‌లీడ‌ర్’ చిత్రాల‌కు సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కల్యాణ్‌ రామ్‌, కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. వచ్చే సంవత్సరం (2022) ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా  ఇది వ‌ర‌కే మేక‌ర్స్ తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.