మూసీరిన చీకట్లు

ABN , First Publish Date - 2021-12-06T07:32:03+05:30 IST

ఒకనాడు అది మంచినీరు ప్రవహించే స్వచ్ఛమైన నది అంటే ప్రస్తుత తరానికి అది నమ్మశక్యం కాదు. భాగ్యనగర వైభవం.. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా జలపరవళ్లు తొక్కిన జీవనది. అలాంటి గొప్పనది ప్రస్తుతం కాలుష్య కాసారమైంది. నదిలో ప్రవహించే నదీజలాలే కాదు, భూగర్భం కూడా విషతుల్యమైంది.

మూసీరిన చీకట్లు

మహానగరం నుంచి పరిశ్రమల వ్యర్థాలు

కలుషితమవుతున్న భూగర్భజలాలు

మృత్యువాత పడుతున్న మూగజీవాలు, మత్స్య సంపద

తాగేనీరు, తినే తిండి విషతుల్యం

(భూదాన్‌పోచంపల్లి)

ఒకనాడు అది మంచినీరు ప్రవహించే స్వచ్ఛమైన నది అంటే ప్రస్తుత తరానికి అది నమ్మశక్యం కాదు. భాగ్యనగర వైభవం.. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా జలపరవళ్లు తొక్కిన జీవనది. అలాంటి గొప్పనది ప్రస్తుతం కాలుష్య కాసారమైంది. నదిలో ప్రవహించే నదీజలాలే కాదు, భూగర్భం కూడా విషతుల్యమైంది. పరివాహక ప్రాంతాల గ్రామాల్లో తాగునీరు కరువైంది. రసాయన కాలుష్యం కారణంగా సాగుచేసే పంటలు, పాడి పశువులు పాల దిగుబడి పూర్తి విషపూరితమయ్యాయి. ప్రతీ ఎన్నికలో మూసీ ప్రక్షాళనే ఎజెండాగా ముందుకు పోతున్న పార్టీలు, గెలిచిన తర్వాత మరిచిపోతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 397 పరిశ్రమలున్నాయి. వీటిలో 200కు పైగా రెడ్‌ కేటగిరి, 150 వరకు ఆరెంజ్‌ కేటగిరి, మిగతా 43 గ్రీన్‌ కేటగిరి పరిధిలో ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. మూసీ నీటిలో పెరిగిన 800 గ్రాముల చేపకు పరీక్షలు చేయగా, ప్రమాదకరమైన 5రకాల భార లోహాలను గుర్తించారు.  

హైదరాబాద్‌ రసాయన పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషపూరిత వ్యర్థాలు మూసీ నదిని కలుషితం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా జీవనాడిగా ఉన్న మూసీనది ఇప్పుడు దేశంలోనే అత్యంత కాలుష్యకారకంగా మారింది. మూసీ కాలుష్య ప్రభావం మనుషులనే కాదు, జిల్లాలోని మూగజీవాలను కూడా రోగాలపాలు చేస్తోంది. పంటపొలాలకు నీటికోసం బోరువేస్తే వ్యర్థ రసాయనాలు వస్తుండటంతో చాలా గ్రామాల్లో బోర్లు వేయడమే మానేశారు. ఉన్న ఎకరం, అర ఎకరం భూములను అమ్ముకొని, బతుకుదెరువుకోసం పట్నం బాటపడుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోనే చాలా గ్రామాలు జనంలేక వెలవెలబోతున్నాయి. ఇక జిల్లావాసులు మూసీ కాలుష్య కోరల నుంచి విముక్తికి దశాబ్ధాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మూసీ అభివృద్ధి లక్ష్యంగా మూడేళ్ల కిందట మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంఆర్‌డీసీ)ని ఏర్పాటు చేసినా, దాని ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.  

కాలుష్య ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి

రాష్ట్రంలోని వికారాబాద్‌-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో అనంతగిరి కొండల్లో నుంచి మూసీనది హైదరాబాద్‌, మేడ్చెల్‌, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రవహిస్తోంది. హైదరాబాద్‌లోని మురుగునీరు, శివారు పారిశ్రామిక వాడలు, మేడ్చెల్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిశ్రమల రసాయన వ్యర్థాలు ఈ నదిని కలుషితం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 180 కి.మీ పొడవునా ప్రవాహిస్తూ, దాదాపు లక్షన్నర ఎకరాల ఆయకట్టు మూసీనది కింద సాగవుతోంది. అయితే ఎగువన ఉన్న రాజధాని హైదరాబాద్‌ నుంచి నిత్యం నదిలో కలిసే పారిశ్రామిక కాలుష్యంతో నది దిగువన వ్యర్థాలతో నిండిపోతోంది. నిత్యం దాదాపు 650 మిలియన్‌ గ్యాలన్ల కాలుష్యవ్యర్థాలు, మురుగు నీటి పర్యావసనాన్ని అనుభవించాల్సి వస్తోంది.  

జీవజాలంపై కాలకూట విషం

నిబంధనలు పాటించకుండా అనేక పరిశ్రమలు దొంగచాటుగా కాలకూట విషాన్ని జీవజాలంపై చిమ్ముతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అనేక రోగాల బారినపడుతున్నారు. కలుషిత నీటితో పంటలు పండకపోవడంతో రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారు. గతంలో ఇక్కడ ఎక్కువగా కూరగాయలు సాగు చేసేవారు, ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో సాగు చేయడం మానేశారు. జిల్లాలోని బీబీనగర్‌, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు కాలకూట విషపు జలప్రవాహాల ప్రభావానికి గురవుతున్నాయి. ఇక్కడ మేతమేసిన పాడి పశువుల పాలు కూడా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులతోపాటు గర్భకోశ వ్యాధులకు గురవుతున్నారని వైద్యులు నిర్ధారిస్తున్నారు. మనుషులే కాదు మూసీ కాలుష్య ప్రభావానికి మూగజీవాలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. తాటి చెట్లు కూడా కలుషితమవుతోంది. 

మూసీ ప్రక్షాళనకు ప్రజాఉద్యమాలు 

మూసీనది కాలుష్య ప్రభావం కారణంగా ప్రజల ఇబ్బందులు తొలగించాలనే డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. మూసీనది ప్రక్షాళనపై పాదయాత్రలు, ఆందోళనలు కొనసాగాయి. దశాబ్ధాల క్రితమే యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆతర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎ్‌సతోపాటు, ‘నమో-మూసీ’ పేరుతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పాదయాత్రలు, సదస్సులు నిర్వహించారు.  

కాలుష్య మూసీతో కష్టాలు ఎన్నో..!

మూసీ కాలుష్యంతో పరివాహక ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. నదీ పరివాహకంలోని 55 చెరువుల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. ఈ వృత్తిపై దాదాపు 3,700 మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. కలుషిత జలాల్లో చేపలు చనిపోయి నష్టాలపాలవుతున్నారు. మూసీ నీటిలో పెరిగిన 800 గ్రాముల చేపకు పరీక్షలు చేయగా, ప్రమాదకరమైన 5రకాల భార లోహాలను గుర్తించారు.  భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, మండలాల్లో రెండు వేలకు పైగా చేనేత కార్మికులు ఉన్నారు. ఈ నీటితో రంగులు అద్దితే మూణ్ణాళ్లకే వెలిసిపోతుండటంతో వస్త్రాలకు డిమాండ్‌ తగ్గుతోంది. 

సమస్య పరిష్కారానికి కృషి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, భువనగిరి

పార్లమెంటు తొలి సమావేశాల్లోనే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి మూసీ కాలుష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించా. మూసీ ప్రక్షాళనకు దాదాపు రూ.2వేల కోట్లు అవసరమవుతాయని, అవి దశలవారీగా ఇవ్వాలని కోరా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూసీ సమస్యను పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటా.

మూసీ ప్రక్షాళనకు ఉద్యమం : పీవీ శ్యాంసుందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

ఒకప్పుడు జీవనదిగా పేరొందిన మూసీనది నేడు జీవంలేని నదిగా మారింది. మూసీ ప్రక్షాళనకు మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇప్పటికైనా మూసీ ప్రక్షాళన చర్యలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. 

కలుషిత జలాలతో ఇబ్బందులు : గట్టు జంగారెడ్డి, పెద్దగూడెం రైతు

మూసీ జలాలతో చేపలు, వృక్ష, జంతు జాతులు ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. మూసీ ఆయకట్టులోని 55 చెరువులపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల జీవితాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కలుషిత మూసీ నీరు కారణంగా తాటిచెట్లు దెబ్బతింటున్నాయి. దీంతో కల్లుకూడా కలుషితమవుతోంది. పశువులు చర్మవ్యాధులకు గురవుతున్నాయి. మూసీ కాలుష్య నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టాలి.

Updated Date - 2021-12-06T07:32:03+05:30 IST