మూసీ కాలుష్య రాకాసి

ABN , First Publish Date - 2022-08-09T05:36:43+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా జీవనాడి గా ఉన్న మూసీనది ప్రస్తుతం దేశంలోనే అత్యంత కాలుష్య కాసారం గా మారింది. హైదరాబాద్‌లోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విష రసాయనాలు, వ్యర్థాలు మూసీని కలుషితం చేస్తున్నాయి. దీని ప్రభావం మనుషులపైనే గాక, మూగజీవాలపైనా చూపుతోంది. పంటపొలాలకు నీటికోసం బోరువేస్తే వ్యర్థ రసాయనాలతో కలుషితమైన నీరు వస్తుండటంతో మూసీ పరివాహకంలోని చాలా గ్రామాల్లో బోరు వేయడమే మానేశారు.

మూసీ కాలుష్య రాకాసి
రసాయన వ్యర్థాలతో ప్రవహిస్తున్న మూసీ

తాగేనీరు,తినే తిండి సైతం విషతుల్యం

వ్యాధులతో ప్రజలు ఆస్పత్రులపాలు

జీవాలు, మత్స్య సంపదైనా ప్రభావం

ప్రక్షాళన కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ


‘ఒకప్పుడు మూసీ అద్భుతమైన నది. చాలా పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండేది. కొందరు దుర్మార్గులు, సమైక్య పాలకులు కంపు, మురికి నదిగా చేశారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాం. రూ.800కోట్లు కేటాయించాం. శుద్ధీకరణ పనులు మొ దలయ్యాయి.రెండేళ్లలో మళ్లీ స్వచ్ఛ జలాలతో మూసీ వరవళ్లు తొక్కనుంది. ప్రజలకు కాలుష్య బాధ తొలగనుంది.’ 2018 నవంబరు 24న భువనగిరిలో జరిగి న ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానం ఇది.


మూసీ నీటిలో పెరిగిన 800గ్రాముల చేపకు శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించగా, ప్రమాదకరమైన ఐదు రకాల భార లోహాలను దాని శరీరంలో గుర్తించారు. అందులో లెడ్‌ అత్యంత ప్రమాదకరం కాగా, ఈ చేపలను ఎంతసేపు ఉడికించినా భార లోహాల ప్రభావం తగ్గదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేగాక ఇవి శరీరంలో జీర్ణంకాకపోవడమేగాక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నాయని హెచ్చరించారు.


భూదాన్‌పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లా జీవనాడి గా ఉన్న మూసీనది ప్రస్తుతం దేశంలోనే అత్యంత కాలుష్య కాసారం గా మారింది. హైదరాబాద్‌లోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విష రసాయనాలు, వ్యర్థాలు మూసీని కలుషితం చేస్తున్నాయి. దీని ప్రభావం మనుషులపైనే గాక,  మూగజీవాలపైనా చూపుతోంది. పంటపొలాలకు నీటికోసం బోరువేస్తే వ్యర్థ రసాయనాలతో కలుషితమైన నీరు వస్తుండటంతో మూసీ పరివాహకంలోని చాలా గ్రామాల్లో బోరు వేయడమే మానేశారు. ఇక్కడి ప్రజలు ఉన్న ఎకరం, అర ఎకరం భూమి విక్రయించి బతుకుదెరువుకోసం పట్నం బాటపడుతున్నారు. మూసీ కాలుష్య కోరల నుంచి విముక్తి కోసం దశాబ్దాలుగా పరివాహక ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రతీ ఎన్నికల్లో మూసీ ప్రక్షాళన ప్రధాన ఎజెండాగా ఉంటున్నా, కార్యాచరణ లేక కాలుష్య పీడ మాత్రం ఈ ప్రాంతాన్ని వీడటం లేదు.  


మూసీ నది రాష్ట్రంలోని వికారాబాద్‌-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని అనంతగిరి కొండల నుంచి హైదరాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి, నల్లగొండ,సూర్యాపేట జిల్లాల్లో ప్రవహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, వలిగొండ, రామన్నపేట, కట్టంగూర్‌, శాలిగౌరా రం,నకిరేకల్‌, కేతేపల్లి, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, చివ్వెం ల, సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలాల మీదుగా సుమారు 180కి.మీ పైగా ప్రయాణించి వాడపల్లి సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. దీనిపై 15ఆనకట్టలు, 200కుపైగా పరివాహక గ్రామాల్లో 60కిపైగా చెరువులు ఆధారపడి ఉన్నాయి. సుమారు 1.50లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నిత్యం 650 మిలియన్‌ గ్యాలన్ల వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. దీంతో సుమారు 8లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూసీనది ప్రక్షాళన అంశం తెరపైకి రాగా, పోటీచేసిన ఇద్దరు నేతలు కేంద్రం నుంచి నిధులు తెస్తామని ప్రజలకు హామీ ఇవ్వగా, అది అడియాసగానే మిగిలింది.


ఎంఆర్‌డీసీ ఏర్పాటు చేసినా

మూసీ నది ప్రక్షాళనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో మూసీ రివరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎంఆర్‌డీసీ)ను ఏర్పాటు చేసింది. దీని ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ను చైర్మన్‌గా నియమించింది. రూ.930కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి 2018 మార్చి నాటికి ప్రక్షాళన పూర్తిచేయాలన్నది లక్ష్యం. అందుకు రూ.22,784 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. మరోవైపు గతంలో బీజేపీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు సైతం మూసీ ప్రక్షాళన విషయంలో హామీ ఇచ్చా రు. కాగా, మూడేళ్ల కిందట మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని నియమించింది. రూ.3000కోట్లు విడుదల చేస్తామని నాడు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.312కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా అధ్యయనం, ప్రతిపాదనలకే. 2017-18 బడ్జెట్‌లో రూ.377.35కోట్లు కేటాయించగా, రూ.32 లక్షలు, ఆ తర్వాత ఏడాది రూ.377కోట్లను కేటాయించగా, రూ.2.80 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా జీతభత్యాలు, చిన్నచిన్న పనులకే కేటాయించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.754కోట్లు కేటాయించగా, కేవలం రూ.3.12కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ప్రక్షాళన మాత్రం ఒక్క అడుగు కూడా ముందుపడలేదు.


జీవజాలంపై కాలకూట విషం

మూసీ కలుషిత నీటితో పంటలు పండకపోవడంతో రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. గతంలో కూరగాయలు ఎక్కువ సాగుచేయగా, దిగుబడులు రాకపోవడంతో రైతులు సాగును మానేశారు. భూగర్భజలాలు తాగేందుకు వీలులేక ఆర్‌వో ప్లాంట్లే దిక్కయ్యాయి. ఒక్కో గ్రామంలో రెండు వరకు ఆర్‌వో ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ మేతమేసిన పాడి పశువుల పాలు కూడా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులతోపాటు గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు వైద్య నిపుణులు నిర్ధారించారు. తాటి చెట్లు కల్లు కూడా కలుషితమవుతుండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. మూసీ పరివాహకంలోని 55 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతుంది. ఈ వృత్తిపై 3,700 మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. కలుషిత జలాల్లో చేపలు చనిపోయి మత్స్యకారులు నష్టపోతున్నారు. చేనేత వస్త్రాలపై నీటితో రంగులు అద్దితే వెలిసిపోతుండటంతో వస్త్రాలకు డిమాండ్‌ లేకుండా పోతుందని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మూసీ సమస్య పరిష్కారానికి కృషి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ 

పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి మూసీ కాలుష్యంతో ఎదురవుతున్న సమస్యలను వివరించా. ప్రక్షాళనకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమవుతాయని, వాటిని దశల వారీగా ఇవ్వాలని కోరా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నా పదవీ కాలంలో మూసీ సమస్య పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటా.



మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమిస్తా : పీవీ శ్యాంసుందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

జీవనది మూసీ నేడు జీవంలేనిది మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని ఆర్భాటపు ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. ఈ సమస్యపై మరోసారి ఉద్యమిస్తాం. ఇప్పటికైనా మూసీ ప్రక్షాళన వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 



కలుషిత జలాలతో కష్టాలు : గట్టు జంగారెడ్డి, పెద్దగూడెం రైతు 

మూసీ జలాలతో భూగర్భజలాలు కలుషితం కావడంతోపాటు చేపలు, వృక్ష, జంతు జాలం కనిపించకుండా పోతోంది. మత్స్యకారుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. మూసీ నీటితో సాగయ్యే పంటలు సైతం హానికరంగా మారుతున్నాయి. తాటి కల్లు కూడా కలుషితమవుతోంది. మనుషులకు, పశువులకు చర్మవ్యాధులు వస్తున్నాయి. మూత్రపిండాలు, క్యాన్సర్‌లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వరి సేద్యం భారంగా మారింది. కలుషిత జలాలతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం.


Updated Date - 2022-08-09T05:36:43+05:30 IST