మూసీపై కొత్త వంతెనలకు డీపీఆర్‌లు!

ABN , First Publish Date - 2022-08-20T06:17:12+05:30 IST

మూసీ నదిపై కొత్త వంతెనల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.

మూసీపై కొత్త వంతెనలకు డీపీఆర్‌లు!

ఏజెన్సీల ఎంపికకు జీహెచ్‌ఎంసీ కసరత్తు

టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటన

15 ప్రాంతాల్లో హై లెవల్‌ బ్రిడ్జిలు

రూ.545 కోట్ల పనులకు ఇప్పటికే సర్కారు ఓకే


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిపై కొత్త వంతెనల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌ నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చినందున, వంతెనల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు రూపొందిస్తున్నారు. డీపీఆర్‌ కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా సోమవారం ఏజెన్సీ ఎంపికపై స్పష్టత రానుంది. హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఇప్పటికే రెండు వంతెనల బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించింది. 2020లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌, ఇబ్రహీంబాగ్‌ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జిలపై భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో కూడా ఆ బ్రిడ్జిల వద్ద అదే దుస్థితి. మూసారాంబాగ్‌ వంతెనపై మూడు, నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఏకంగా రెండు రోజులు వాహనాలను అనుమతించలేదు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇవే ఇబ్బందులు తలెత్తుతుండడంతో మూసీపై 13 ప్రాంతాల్లో హై లెవల్‌ బ్రిడ్జిలు (ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఎక్కువ ఎత్తులో), ఓ పాదచారుల వంతెన, మరో చోట అనుసంధాన రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వ విభాగా లు ప్రతిపాదించాయి. ఇందుకు రూ.545 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి ప్రతిపాదనలు పంపగా.. సర్కారు పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. 


డీపీఆర్‌లు కీలకం..

హిమాయత్‌సాగర్‌ నుంచి తూర్పు వైపు (ఘట్‌కేసర్‌) ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నగరం మీదుగా 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తోంది. ఈ పరిధిలో వంతెనలు, మిస్సింగ్‌ లింక్‌ రోడ్ల నిర్మాణాలను ప్రతిపాదించారు. కోర్‌ ఏరియాలో ఉన్న మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌, ఇబ్రహీంబాగ్‌, అత్తాపూర్‌ వద్ద ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా నిర్మించే వంతెన పనులను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. వీటికి సంబంధించి డీపీఆర్‌ల రూపకల్పనకు కసరత్తు మొదలైంది. నివేదికలో వంతెనల పొడవు..? ఎన్ని లేన్‌లు..? ఎన్ని ఆస్తులు సేకరించాలి? క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు..? తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ఓ అధికారి తెలిపారు. ఆ తర్వాతే నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ ప్రకటించనున్నట్లు చెప్పారు. మూసారాంబాగ్‌ వద్ద నాలుగు లేన్లుగా వంతెన నిర్మించాలా..? ఆరు లేన్లుగానా..? అన్నదీ డీపీఆర్‌ ఆధారంగానే తేలనుంది. మిగతా మూడు ప్రాంతాల్లో నాలుగు లేన్లుగా వంతెనలు నిర్మించాలని భావిస్తున్నా.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా లేన్ల సంఖ్య పెంచాలా..? అన్న దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. 


మూడుప్రాంతాల్లో హెచ్‌ఆర్‌డీసీఎల్‌..

మూసీపై వంతెనలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌.. మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించనుంది. సన్‌సిటీ, కిస్మత్‌పురా వద్ద వంతెనల డీపీఆర్‌ల రూపకల్పన బాధ్యతలు స్టూప్‌ కన్సల్టెన్సీకి అప్పగించారు. మరో వంతెన పనులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. అఫ్జల్‌గంజ్‌లో మూసీపై పాదచారుల వంతెన నిర్మాణ బాధ్యతలు కులీ కుతుబ్‌షా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీకి అప్పగించారు. ఆరు ప్రాంతాల్లో హై లెవల్‌ బ్రిడ్జిలు, అనుసంధాన రహదారి నిర్మాణం హెచ్‌ఎండీఏ చేపట్టనుంది.

Updated Date - 2022-08-20T06:17:12+05:30 IST