కుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం

ABN , First Publish Date - 2022-01-22T04:24:31+05:30 IST

బీజేపీలో జిల్లా అధ్యక్షుడి రాజీనామా ముసలం రేపుతోంది. రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జెబీ పౌడెల్‌ రెండురోజుల క్రితం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించటం ఆ పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.

కుంరం భీం జిల్లా బీజేపీలో ముసలం

- పార్టీ జిల్లా అధ్యక్షుడి రాజీనామా వెనుక హైడ్రామా

- పోటీపడి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు 

- పదవీ కోసం ముమ్మరంగా పైరవీలు 

- రేసులో ముగ్గురి పేర్లు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

బీజేపీలో జిల్లా అధ్యక్షుడి రాజీనామా ముసలం రేపుతోంది. రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జెబీ పౌడెల్‌ రెండురోజుల క్రితం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించటం ఆ పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. పౌడెల్‌ హఠాత్తుగా ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితి ఏమిటన్నదానిపై ఓ వైపు జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతుండగా మరోవైపు కొత్తగా జిల్లా అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారన్నదిపై బీజేపీ వర్గాల్లో జోరుగా ఊహా గానాలు మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజన తర్వాత 2016లో బీజేపీ జేబీ పౌడెల్‌కు జిల్లా సారధ్య బాధ్యతలను అప్పగించింది. అయితే అప్పట్లోనే ఆయనకు పదవి ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా స్థానికేతరుడు అన్న ప్రచారాన్ని లెవనేత్తి పార్టీ అధిష్టానానికి అసంతృప్తిని వెలిబుచ్చారు. అయినప్పటికీ అప్పటి నాయకత్వం వర్గవిభేధాలను దృష్టిలో పెట్టుకొని మధ్యేమార్గంగా పౌడెల్‌కే పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రెండోదఫా కూడా ఆయననే కొనసాగిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు బండిసంజయ్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ దఫా ఈ పదవిని ఆశించిన ముగ్గురు, నలుగురు బీజేపీ నేతలు జిల్లా అధ్యక్షుడిపై అసంతృప్తితో రగిలి పోతూ సమయం చిక్కినప్పుడల్లా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీంతో విసిగి వేసారి పోయి రాజీనామా చేసినట్టు ఓ వర్గం చెబుతుండగా ఇటీవల కాలంలో పౌడెల్‌ వ్యవహార శైలి, పని తీరు పార్టీ అభివృద్ధికి ఆటంకంగా మారిందని, అంతేకాకుండా వ్యక్తిగతంగా నేతలతో సత్ససంబంధాలు కొనసాగటంతో కాగజ్‌ నగర్‌కు చెందిన ఓ నేత నేరుగా అధిష్టానానికి జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టాన వర్గానికి చెందిన దూతలు రహ స్యంగా సమాచారాన్ని సేకరించినట్టు బయటకు పొక్కడంతో కినుక వహించిన పౌడేల్‌ రాజీనామా చేశారని అంచనా వేస్తున్నారు. రాజీనామా సందర్భంగా తన వ్యక్తిగత, వయోభార వంటి కార ణాలతో రాజీనామా చేసినట్టు చెప్పుకున్నప్పటికీ అంతర్లీనంగా పార్టీ నేతలు సహకరించడం లేదన్న అసంతృప్తితోనే రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. 

రేసులో ముగ్గురు

జిల్లా అధ్యక్ష పదవికి జేబీ పౌడేల్‌ రాజీనామా చేయడంతో పార్టీ అధిష్టానం కొత్త నేతను నియమించేందుకు కసరత్తు ప్రారంభించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని పదిహేను మండలాల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిం చినట్టు తెలుస్తోంది. పార్టీవర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమా చారం ప్రకారం జిల్లా అధ్యక్ష పదవికి ముగురి పేర్లు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ సత్యనారాయణ, డాక్టర్‌శ్రీనివాస్‌, ఆసిఫాబాద్‌కు చెందిన బొనగిరి సతీష్‌ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. మరో వైపు జిల్లా అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలంటూ మరికొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రెబ్బెనకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా జిల్లా అధ్యక్ష పదవీ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమని అధిష్టానానికి సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరిన పాల్వాయి హరీష్‌బాబు బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ కొంత కాలంగా ఆయన పార్టీని వీడుతారని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం ఆయనతో మాట్లాడి స్పష్టత తీసు కున్నాక పార్టీలోనే కొనసాగే పక్షంలో ఆయన పేరును కూడా జిల్లా అధ్యక్ష పదవికి పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - 2022-01-22T04:24:31+05:30 IST