చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-08T07:05:21+05:30 IST

చికిత్స పొందుతూ యువకుడి మృతి

చికిత్స పొందుతూ యువకుడి మృతి

- ఆర్‌ఎంపీ క్లినిక్‌ ముందు కుటుంబసభ్యుల ఆందోళన

వర్ధన్నపేట, ఏప్రిల్‌ 7 : ఓ ఆర్‌ఎంపీ చేసిన వచ్చీరాని వైద్యం.. యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబసభ్యులు క్లినిక్‌ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వర్ధన్నపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్న వివరాలు ఇలా వున్నాయి. ఐనవోలు మండలంలోని కక్కిరాలపల్లికి చెందిన కంజర్ల విజయ్‌ (23).. అనారోగ్య సమస్యతో గతనెల 6వ తేదీన వర్ధన్నపేటలో ప్రియాంక క్లినిక్‌ను నడుపుతున్న ఆర్‌ఎంపీ బి.కుమార్‌ని సంప్రదించాడు. దీంతో సదరు ఆర్‌ఎంపీ ఆపరేషన్‌ అవసరమని చెప్పడమే కాకుండా, అర్హతలు లేకున్నా మరుసటి రోజున ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపించాడు. అయితే ఆ తర్వాత రక్తస్రావం బాగా జరుగుతుండటంతో విజయ్‌ ఆర్‌ఎంపీని సంప్రదించగా, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విజయ్‌ని కుటుంబసభ్యులు ఈనెల 5న హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వారు సీరియ్‌సగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయ్‌ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు మృతి చెందాడు. దీంతో విజయ్‌ మృతికి ఆర్‌ఎంపీ చేసిన వైద్యమే కారణమంటూ ప్రియాంక క్లినిక్‌ ముందు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ వంశీకృష్ణ ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు లేకపోవడంతో ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. మృతుడి తండ్రి కొంరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, విజయ్‌ హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

Updated Date - 2021-04-08T07:05:21+05:30 IST