Gandhi and Shastri Jayanthi Tributes : గాంధీ, శాస్త్రిలకు ముర్ము, మోదీ నివాళులు

ABN , First Publish Date - 2022-10-02T16:56:11+05:30 IST

మహాత్మా గాంధీ (Mahatma Gandhi), మాజీ ప్రధాన

Gandhi and Shastri Jayanthi Tributes : గాంధీ, శాస్త్రిలకు ముర్ము, మోదీ నివాళులు

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ (Mahatma Gandhi), మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri)లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నివాళులర్పించారు. రాష్ట్రపతి, ప్రధాని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ అంత్యక్రియలు జరిగిన చోటులో ఏర్పాటు చేసిన జ్యోతికి నమస్కరించారు. 


గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా వారికి ముర్ము, మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే తదితరులు నివాళులర్పించారు. 


మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) 1869 అక్టోబరు 2న జన్మించారు. ఆయన వృత్తి రీత్యా న్యాయవాది. బ్రిటిష్ పాలన నుంచి భారత దేశానికి విముక్తి కల్పించిన స్వాతంత్ర్యోద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. 1948 జనవరి 30న ఆయనపై నాథూరాం గాడ్సే కాల్పులు జరిపి, హత్య చేశారు. 




మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు 2న జన్మించారు. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా ఆయనకు విజయ్‌ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. 


ప్రధాని మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీలోని ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గ్యాలరీలోని కొన్ని అంశాలను పోస్ట్ చేశారు. శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా సాధించిన విజయాలకు ఈ గ్యాలరీ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఈ సంగ్రహాలయాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు. 


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు. ‘జై జవాన్, జై కిసాన్’ అని శాస్త్రి గారు నినదించారని, జాతి నిర్మాణ ప్రక్రియకు ఈ నినాదం మార్గదర్శనం చేస్తుందని, నిరంతరం ప్రేరణనిస్తుందని తెలిపారు. 


శాస్త్రీజీకి నివాళులర్పించిన అనంతరం శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బిర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ, శాస్త్రి గారు హరిత విప్లవం కోసం కృషి చేశారని, దీనివల్ల దేశం ఆహార కొరత నుంచి బయటపడిందని చెప్పారు. 




Updated Date - 2022-10-02T16:56:11+05:30 IST