మర్డర్స్‌

ABN , First Publish Date - 2021-01-12T06:59:32+05:30 IST

ఓ వ్యక్తిని అత్యంత

మర్డర్స్‌


మామూలు నేరం చేయాలంటేనే అందరూ భయపడతారు. అలాంటిది.. హత్య అయితే..? ఎందరికో కలలో కూడా భయపెట్టే విషయం. అయితే.. ఇటీవల నగరంలో జరిగిన హత్యలు, అవి జరిగిన తీరు, వాటి పూర్వాపరాలను పరిశీలిస్తే.. అదేదో కొందరే చేసే పనిగా మనకి ఉన్న అభిప్రాయాలు పటాపంచలైపోతాయి. ఆర్థికంగా చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. క్రూర నేరాలకు తెగబడుతున్న తీరు భయం కలిగించక మానదు.


ఆదివారం అర్ధరాత్రి...

అప్పు తీర్చమంటే చంపేశారు..


శంషాబాద్‌ : ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చాకులతో పొడిచి బండరాళ్లతో మోది నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పాశవికంగా హత్య చేశారు. పోలీసులు అత్యంగా వేగంగా దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్‌ పహాడీ బస్తీలో గరీబ్‌నవాబ్‌ అనే హోటల్‌ను షేక్‌ రషీద్‌ నడుపుతున్నాడు. ఇతను ఎంఎం పహాడీ బస్తీలో ఉండే మహ్మద్‌ ఖలీల్‌ (33) వద్ద రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం సరిగా నడవక నెల నెలా వడ్డీ చెల్లించలేదు. హోటల్‌ కూడా మూతపడింది. దీంతో అప్పు తీర్చలేదు. రషీద్‌ మరికొందరి వద్ద కూడా అప్పులు చేశాడు. వడ్డీ డబ్బుల కోసం ఖలీల్‌ వేధించసాగాడు. పరిస్థితి చక్కదిద్దుకునేందుకు మరో రూ.50 లక్షలు వడ్డీకి ఇవ్వాలని, ఆ డబ్బుతో మిగతా వారి అప్పు తీరుస్తానని ఖలీల్‌ను రషీద్‌ అడిగారు. హోటల్‌ను తన పేరున రాస్తే అడిగిన డబ్బు ఇస్తానని ఖలీల్‌ చెప్పాడు. అందుకు రషీద్‌ అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆదివారం ఉదయం కూడా హోటల్‌ వద్ద వివాదం జరిగింది. కోపం పెంచుకున్న షేక్‌ రషీద్‌ ఎలాగైనా ఖలీల్‌ను అంతం చేయాలని, తన హోటల్‌లో పనిచేసే మహహ్మద్‌ అజ్మత్‌ (28), సయ్యద్‌ ఇమ్రాన్‌ (27)తో కలిసి పథకం రూపొందించాడు. రషీద్‌ వారికి మద్యం తాగించి ఖలీల్‌ను ఎలాగైనా రప్పించాలని రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌ నెంబర్‌ 248 వద్ద ఉన్న ఓ కన్వెన్షన్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ ముగ్గురు ఆటోలో రాళ్లు, కత్తులు, కర్రలు దగ్గర పెట్టుకున్నారు. పథకంలో భాగంగా ఖలీల్‌కు ఫోన్‌ చేసి కన్వెన్షన్‌ వద్దకు వస్తే డబ్బు విషయం సెటిల్‌ చేస్తామని చెప్పారు. ఖలీల్‌ తన స్కూటీపై ఆ కన్వెన్షన్‌ వద్దకు వచ్చాడు. రాగానే డబ్బు విషయమై మాట్లాడుతుండగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ వద్ద ఉన్న కత్తులతో ఖలీల్‌పై దాడి చేసి పొడిచారు. ఖలీల్‌ స్కూటీని అక్కడే వదిలి తప్పించుకునేందుకు పరుగులు తీయగా వెంబడిస్తూ కర్రలతో కొట్టారు. ఖలీల్‌ నడిరోడ్డుపై కిందపడిపోయాడు. ఆ ముగ్గురూ రాళ్లతో తలపై విచక్షణా రహితంగా దాడి చేసి అత్యంత పాశవికంగా హత్యచేశారు. ఆ తర్వాత ఖలీల్‌కు చెందిన స్కూటీని తీసుకొని మీర్‌ ఆలం ట్యాంకు వైపు నుంచి జెల్‌పల్లిలోని తమ బంధవుల ఇంటికి పారిపోయారు. అక్కడ దుస్తులు మార్చుకున్నారు. తిరిగి రాజేంద్రనగర్‌ వైపునకు వచ్చి ఓ ప్రాంతంలో రక్తపు మరకలున్న దుస్తులు పడేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీస్‌ బృందం ఆ దుస్తుల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకొని వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. 


సూట్‌కేసులో శవం 

శంషాబాద్‌ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌నెంబర్‌ 222 వద్ద లభించిన సూట్‌కేసులో శవం కేసును పోలీసులు ఛేదించారు. శంషాబాద్‌లోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రకాష్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం రాజేంద్రనగర్‌ పిల్లర్‌నెంబర్‌ 222 వద్ద సూట్‌కేసులో లభించిన మృతదేహాన్ని చాంద్రాయణగుట్టలో నివాసముండే ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ ఇలియాస్‌ అలియాస్‌ రియాజ్‌ (26)గా గుర్తించారు. ఏ1, ఏ2 ఇద్దరూ మైనర్లు. వారు రియాజ్‌కు స్నేహితులు. ముగ్గురూ కలిసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. రియాజ్‌ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. స్నేహితులు ముగ్గురూ పార్క్‌చేసి ఉన్న ఆటోల్లో బ్యాటరీలను దొంగిలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఏ1, ఏ2, సోహెల్‌ అనే మరో వ్యక్తి కలిసి రియాజ్‌ ఆటోలోని బ్యాటరీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న రియాజ్‌ నిందితులను కొట్టి పోలీసులకు అప్పగించాడు. పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన నిందితులు గౌస్‌నగర్‌లో ఉండే లలిత అనే మహిళకు చెందిన వాహనంలోని బ్యాటరీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న రియాజ్‌ లలిత ఇంటికి వెళ్లి బ్యాటరీకి సంబంధించి రూ.4 వేలు ఇప్పిస్తానని చెప్పాడు. ఏ1, ఏ2 కూడా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. ఏ1 తన వంతుగా రూ.2 వేలు చెల్లించగా, ఏ2 ఇవ్వలేదు. దీంతో రియాజ్‌కు, ఏ2కు మధ్య వివాదం చెలరేగింది. ఏ2, ఏ1 మరో నిందితుడు సోహెల్‌తో కలిసి రియాజ్‌ను అంతమొందించాలని పథకం రూపొందించారు. రియాజ్‌ వారి పనికి అడ్డుపడటమే కాకుండా ఏ1 సోదరితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ నెల 8న ఏ1, ఏ2, సోహెల్‌ మద్యం తాగడానికి ఆటోలో వివిధ ప్రాంతాల్లోని వైన్స్‌ షాపులకు తిరుగుతూ రియాజ్‌కు కూడా మద్యం తాగించారు. అతడిని ఇర్పాన్‌ ఉండే పహడీ షరీఫ్‌లో షహీన్‌నగర్‌ బస్తీలో ఇంటికి తీసుకెళ్లారు. ఏ1, ఏ2, సోహెల్‌ (26), ఇర్పాన్‌ (27) ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని గొడవపడ్డారు. ఇర్ఫాన్‌ తల్లి తయ్యబా కూడా వారితో జత కలిసింది. అందరూ కలిసి రియాజ్‌ను కర్రలతో కొట్టి ఇంట్లోనే హత్య చేశారు. రక్తపు మరకలను పూర్తిగా శుభ్రం చేసి శవాన్ని వారి ఇంట్లోని పాత సూట్‌కేసులో పెట్టారు. ఆ సూట్‌కేసును ఏ1, ఏ2లు ఆటోలో తీసుకొని రాజేంద్రనగర్‌ పిల్లర్‌ నెంబర్‌ 222 వద్దకు తీసుకొచ్చి అక్కడ చెత్తకుప్పలో పడేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు ఏ1, ఏ2లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. 


ఇది భర్త పనే..

హైదర్‌నగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కేపీహెచ్‌బీలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడ్ని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతోని చెలక గ్రామానికి చెందిన కుంపటి వెంకట నారాయణ(38) అలియాస్‌ వెంకటేశ్వర్లు అలియాస్‌ శేఖర్‌ స్థానికంగా ఆయుర్వేదిక్‌ మందులు విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. కొంతకాలం క్రితం కుటుంబకలహాలతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అదే జిల్లా ఇల్లందు మండలం రాజీనగర్‌తండా పోలంపల్లి గ్రామానికి చెందిన సురబాక స్రవంతి(30)తో వెంకటనారాయణకు పరిచయం ఏర్పడింది.   స్రవంతి కూడా భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఆయుర్వేద మందులు ఇచ్చేందుకు తరచూ ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరూ దగ్గరై.. పెద్దపల్లిలో పెళ్లి చేసుకొన్నారు. 2020 జనవరిలో నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్నారు. గత డిసెంబర్‌లో కేపీహెచ్‌బీ ఎస్‌ఎస్‌కాలనీలో అద్దెకు దిగారు. వెంకటనారాయణ రోజూ తాగి వస్తుండడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ నేపథ్యంలో ఈనెల 3వతేదీన వెంకటనారాయణ ఇంట్లో తాగుతుండడంతో మరోసారి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన అతను స్రవంతిని కర్రతో బలంగా తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భయపడ్డ వెంకటనారాయణ మృతదేహాన్ని దుప్పటిలో మూటకట్టి ఇంట్లో మెట్ల కింద ఉంచాడు. తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని ఓనర్‌ రంగస్వామికి ఫోన్‌ చేసి వెళ్లిపోయాడు. ఈ నెల 5న ఇంటిని శుభ్రం చేస్తుండగా... మృతదేహం బయటపడడంతో రంగస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారం నిందితుడిని పట్టుకొని కోర్టుకు తరలించారు. కేసును ఛేధించడంలో చాకచక్యం ప్రదర్శించిన సీఐ లక్ష్మినారాయణ, ఎస్సై సక్రం సిబ్బంది బాలకృష్ణ, నరేష్‌, దామోదర్‌రెడ్డిలను ఏసీపీ అభినందించారు. 


భార్యే హంతకురాలా..?

జీడిమెట్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు ఇతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... తారక రాంనగర్‌లో నివాసముండే బోడ శంకర్‌ (38) ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మద్యం తాగడానికి వైన్‌షాప్‌కు వెళ్లాడు. 11.30 గంటల ప్రాంతంలో తీవ్రమైన గాయాలతో శంకర్‌ ఇంటికి వచ్చాడు. కొద్ది సేపటికే అతను మృతి చెందాడు. భార్య, మరికొందరు అతడిని కొట్టి ఉంటారని, అందుకే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-01-12T06:59:32+05:30 IST