హత్యలు, అత్యాచారాలు, లూటీలు!

ABN , First Publish Date - 2022-04-04T09:07:28+05:30 IST

కుప్పలుగా పౌరుల శవాలు..! సామూహిక ఖననాలు..! చేతులను వెనక్కి విరిచి కట్టి..

హత్యలు, అత్యాచారాలు, లూటీలు!

ఉక్రెయిన్‌లో వెలుగులోకి రష్యా అరాచకాలు

కీవ్‌, ఏప్రిల్‌ 3: కుప్పలుగా పౌరుల శవాలు..! సామూహిక ఖననాలు..! చేతులను వెనక్కి విరిచి కట్టి.. అతి దగ్గరి నుంచి(పాయింట్‌ బ్లాంక్‌) తుపాకీతో కాల్చి చంపిన దాఖలాలు..! ఇవీ ఉక్రెయిన్‌లోని కీవ్‌ రీజియన్‌ నుంచి రష్యా సేనలు వైదొలిగాక.. సహాయక చర్యలకు దిగిన ఆర్మీ, ఎమర్జెన్సీ బృందాలకు కనిపించిన దృశ్యా లు..! కొన్ని చోట్ల.. శవాల కింద ల్యాండ్‌మైన్స్‌ పెట్టారని, మృతదేహాలను తొలగించగానే అవి పేలుతున్నాయని, దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలెదురవుతున్నాయని ఉక్రెయిన్‌ వర్గాలు వాపోతున్నాయి. ఇక రష్యా సైన్యం అడుగుపెట్టిన చోటల్లా ఆహార పదార్థాలు, నగదు లూటీలు రిపోర్టయ్యాయని, మహిళలు, యువతులపై అత్యాచారాలు జరిపారని పేర్కొన్నాయి. ఈ అరాచకాలను ఐరోపా దేశాలు, అమెరికా ఖండించాయి.

ఐసీసీకి ఉక్రెయిన్‌ ఫిర్యాదు

కీవ్‌ రీజియన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. ఆదివారం ఆయన బ్రిటన్‌లోని టైమ్స్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్ర్భాంతికర విషయాలను వెల్లడించారు. ‘‘కీవ్‌ శివార్లలోని చాలా గ్రామాలను ఇంకా సందర్శించి, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. శని, ఆదివారాల్లో బుచా, ఇర్పిన్‌, హోస్టోమెల్‌ నగరాల్లో సందర్శించిన బృందాలు.. అక్కడి పరిస్థితిని వివరించాయి. చాలా బాధాకరం. బుచాలో 300 మంది పౌరుల మృతదేహాలను సామూహికంగా ఖననం చేశాం. మరికొన్ని చోట్ల 120 మృతదేహాలు లభించాయి. పరిస్థితిని మాటల్లో చెప్పలేం’’ అని ఆయన బాధాతప్త హృదయంతో అన్నారు.

అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం(ఐసీసీ)కి ఈ మేరకు ఓ లేఖ రాశామని వెల్లడించారు. ఐసీసీ వెంటనే తమ ప్రతినిధులను పంపాలని కోరారు. అంతర్జాతీయ స్వచ్ఛంద, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు కూడా వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను సందర్శించి, రష్యా అరాచకాలను గుర్తించాలని, ఆలస్యం జరిగితే ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ కూడా తమ ప్రతినిధులు పంపిన ఫొటోలు, వీడియో ఫుటేజీ దారుణ పరిస్థితులకు అద్దం కడుతున్నాయని పేర్కొంది. బుచా నగరంలో పౌరుల మరణాలు చాలా ఉన్నాయని.. రష్యా సేనలు చాలా మంది పౌరుల చేతులను వెనక్కి కట్టేసి, అతి సమీపం నుంచి తలకు గురిపెట్టి కాల్చిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించింది.

కీవ్‌ శివారు నగరాలు, గ్రామాల్లో రష్యా సేనలు మారణహోమాన్ని సృష్టించాయని, ఇది భారీ విపత్తు అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. శవాల కింద మందుపాతరలు పెట్టడం దారుణమన్నారు. లూటీలు, అత్యాచారాలు, హింస, దారుణ హత్యలతో నరమేధానికి పాల్పడ్డ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. కాగా.. మారియుపోల్‌లో పౌరుల మరణాల సంఖ్య 5 వేలకు పైగా ఉందని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి.

4.30 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో ఇంకా లక్షమంది పౌరులు చిక్కుకుపోయారని, రెడ్‌క్రాస్‌ సహాయక చర్యలకు రష్యా సేనల దాడులు అడ్డంకిగా మారాయని పేర్కొన్నాయి. మారియుపోల్‌ చుట్టూ రష్యా సేనలు మోహరించాయని వివరించాయి. రష్యా సైనికుల అరాచకాలను ఆధారాలతో సహా బయటపెట్టడంతో.. ఐరోపా సమాఖ్య(ఈయూ) తీవ్రంగా స్పందించింది. ఈ దారుణాల పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా అరాచకాలపై ఆధారాలను గుర్తించడంలో సహకరిస్తామని పేర్కొంది. అటు ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ దేశాలు ఈ దారుణాల పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై అత్యవసర సమావేశానికి ఐరోపా భద్రత, సహకార సంస్థ ఈయూ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.


బుచాలో ఓ మృతదేహం వద్ద మందుపాతర కోసం తనిఖీ చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం 



యుద్ధాన్ని ఆపాలి: రామ్‌నాథ్‌ కోవింద్‌

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలని భారత్‌ ముందు నుంచి కోరుతోందని.. ఈ డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తుర్క్‌మెనిస్థాన్‌ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన ఆ దేశ రాజధాని నగరం అష్గబట్‌లోని ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చర్చలతోనే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి పరిష్కారముంటుందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌కు భారత్‌ మనవతా సహాయాన్ని అందజేస్తోందని, దీన్ని కొనసాగిస్తామని వివరించారు. కాగా.. రష్యా-అమెరికా మధ్య సంబంధాలను మెరుపరిచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్యలను అమెరికా కాంగ్రెస్‌ ప్రశంసించింది.


4,079 కేసుల నమోదు


రష్యా యుద్ధ నేరాలపై 4,079 క్రిమినల్‌ కేసులను నమోదు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. వీటిల్లో 3,949 కేసులు యుద్ధ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినవేనని వివరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరును ప్రస్తావించకుండా.. ఆ దేశానికి చెందిన 205 మంది ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, సైనికాధికారులను ఈ కేసుల్లో బాధ్యులుగా పేర్కొన్నామని వెల్లడించింది.

Updated Date - 2022-04-04T09:07:28+05:30 IST