కులాంతర వివాహం.. చివరకు విషాదాంతమైంది. అన్ని ప్రేమ కథల్లో మాదిరే.. వీరి ప్రేమను కూడా పెద్దలు అంగీకరించకున్నా.. అంగీకరించినట్లు నటించారు. అప్పటికే ప్రేమ వివాహం చేసుకున్న ఆజంటను సాదరంగా స్వాగతించారు. మనసులోని కుట్ర కోనాన్ని మాత్రం దాచిపెట్టారు. తమ అహం దెబ్బతినిందన్న విషయాన్ని వాళ్లకు తెలీకుండా జాగ్రత్త పడ్డారు. మీకు మళ్లీ ఘనంగా వివాహం చేస్తామంటూ నమ్మించారు. చివరికి వారి ప్రేమను విషాదాంతంగా ముగించారు. తమిళనాడులో ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన .. స్థానికులకు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన 25 ఏళ్ల మురుగేశన్ ఇంజనీరింగ్ చదివాడు. అతు అదే ప్రాంతానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు 22 ఏళ్లు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. అయినా వారు పట్టించుకోకుండా కడలూరు రిజిస్ట్రార్ ఆఫీసులో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు వారిని పలిపించి.. మళ్లీ పెళ్లి చేస్తామంటూ ఇద్దరినీ మురుగేశన్ బాబాయ్ సహకారంతో .. అమ్మాయి తరఫు బంధువులు వాళ్లను వాహనంలో తీసుకెళ్లారు. ఇంటికని చెప్పి శ్మశానానికి తీసుకెళ్లారు. విషయం ప్రేమికులకు అర్థమై.. తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయినా కుదరలేదు. ప్రేమికులిద్దరి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని లోపలికి ప్రవేశపెట్టారు. తర్వాత కొద్దిసేపటికే ఇద్దరూ చనిపోయారు. తర్వాత వారి మృతదేహాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. ఈ క్రమంలో మురుగేశన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తరఫు బంధువులు అగ్ర కులస్తులు కావడంతో కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
కానీ అప్పటికే ఈ విషయం స్థానిక మీడియాలో మార్మోగిపోవడంతో పోలీసులు వేరే దారి లేక కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. వీరిలో అమ్మాయి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండేళ్ల యావజ్జీవ శిక్షలు విధించగా.. 15 మంది నిందితుల్లో మురుగేశన్ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌ను నిర్దోషులుగా విడిచిపెట్టారు.