వృద్ధ దంపతులది హత్యే!

ABN , First Publish Date - 2022-08-11T05:50:24+05:30 IST

ఆ ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు.

వృద్ధ దంపతులది హత్యే!

 అనుమానాస్పద మృతి కాదని నిర్ధారణ

  సొంత అల్లుడే నిందితుడు

విజయవాడ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : ఆ ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. పెద్ద కుమార్తె మాత్రమే వారి బాగోగులు చూస్తోంది. ఇది చిన్నకుమార్తె భర్తలో అసహనాన్ని రేపింది. ఆస్తి అమ్మేస్తే మొత్తం వాళ్లకే వెళ్లిపోతుందన్న అనుమానంతో అత్తమామలను చంపేశాడు. కొద్దిరోజుల క్రితం వాంబేకాలనీలో జరిగిన వృద్ధ దంపతులది అనుమానాస్పద మృతి కాదని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించారు. వారిని ఊపిరాడకుండా చేసి చంపేశారని తేల్చారు. దీని ఆధారంగా దర్యాప్త చేపట్టిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. వాంబేకాలనీ ఏ బ్లాక్‌లో సిందుపల్లి పైడమ్మ (65), సిరిగిడి కొండయ్య (60) ఈనెల ఐదో తేదీన ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై విగతజీవులుగా పడి ఉన్నారు. కొండయ్యతో కొంతకాలంగా పైడమ్మ సహజీవనం చేస్తోంది. ఇద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి హరమ్మ, రాజులమ్మ ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు నారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. చిన్న కుమార్తెకు షేకర్‌ రంజాన్‌తో వివాహమైంది. ఇద్దరూ అదే బ్లాక్‌లో నివసిస్తున్నారు. కొండయ్య, పైడమ్మ బాగోగులను పెద్దకుమార్తె హరమ్మ చూసుకుంటోంది. ఈ తరుణంలో తాము ఉంటున్న ఫ్లాట్‌ను విక్రయించేసి వచ్చిన డబ్బులను పెద్దకుమార్తె హరమ్మకు ఇచ్చేస్తానని పలుమార్లు పైడమ్మ చెప్పింది. ఈ విషయం రెండో అల్లుడు రంజాన్‌కు గుబులు పుట్టించింది. అంతా పెద్దకుమార్తెకు ఇచ్చేస్తే తాము అన్యాయం అయిపోతామని భావించాడు. దీనిపై ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తిలో తనకు ఎలాంటి భాగం రాదని భావించిన రంజాన్‌ అత్తమామలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగో తేదీ రాత్రి పైడమ్మ వద్దకు వెళ్లాడు. ఆస్తి గురించి ఆమెను ప్రశ్నించాడు. ఆమె పాత మాటే చెప్పింది. దీంతో అసహనానికి లోనైన రంజాన్‌ పైడమ్మను బలంగా తోసేయడంతో కింద పడింది. తలకు బలమైన గాయమైంది. తర్వాత తలగడ పెట్టి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చంపేశాడు. అప్పటి వరకు బాత్‌రూంలో ఉన్న మామ కొండయ్య వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించాడు. అతడ్ని కిందకు తోసేసి అత్త మాదిరిగానే చంపేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాల పక్కన మద్యం, స్పిరిట్‌ సీసాలను పడేశాడు. ఈ కేసులో రంజాన్‌ను నున్న రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.


Updated Date - 2022-08-11T05:50:24+05:30 IST