Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ.. కారణమిదే!

  • అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
  • నలుగురు నిందితులతోపాటు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ ఖాళీ ప్రదేశంలో ఈనెల 21న కాలిన గాయాలతో లభ్యమైన యువకుడి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే అనుమానంతో యువకుడిని ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టడంతో మృతిచెందగా, గుట్టు చప్పుడు కాకుండా తగుల బెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది.  వివరాలను రాచకొండ అడిషనల్‌ సీపీ జి.సుధీర్‌ బాబు, మల్కాజిగిరి జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ డి.శ్రీనివా్‌సలు వెల్లడించారు.


బాలానగర్‌ ఐడీపీఎల్‌ కాలనీలో నివసించే బాలరాజు(22) కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. ఈనెల 20న స్నేహితులు మహేష్‌, నాగరాజులతో కలిసి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. కాగా, 21వ తేదీన ఉదయం ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో పాక్షికంగా కాలిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమవడంతో ఉప్పల్‌ పోలీసులు గుర్తు తెలియని యువకుడి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృత దేహం ఒంటిపై ఉన్న పచ్చబొట్లు, ఇతర ఆనవాళ్లతో లుక్‌అవుట్‌ నోటీసు జారీచేయడంతో హతుడు బాలరాజుగా గుర్తించి కుటుంబ సభ్యులను రప్పించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో మహేష్‌, అతని సోదరులు వి.నరేష్‌ (36), వి.సుధీర్‌(28) కలిసి హత్య చేసినట్లు తేల్చారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు సహకరించిన మహేష్‌ భార్య వి.విజయ(25)తోపాటు హత్యోదంతం తర్వాత వారికి ఆశ్రయం ఇచ్చిన నాగోల్‌ బండ్లగూడ నివాసి కేతావత్‌ రవి(35)లను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


సెల్‌ఫోనే కారణం..

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం, నెమిలిగుంది తండా నుంచి వలసవచ్చిన వి.మహేష్‌(33) ఈనెల 20న తన స్నేహితులు నాగరాజు, సాయితోపాటు బాలరాజు కలిసి సనత్‌నగర్‌లోని జింకలబావి కల్లు కంపౌండ్‌లో మద్యం సేవించారు. ఈ క్రమంలో మహేష్‌ సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో బాలరాజును నిలదీశాడు. అదే ఆటోలో అతన్ని చిలుకానగర్‌లోని తన ఇంటికి తీసుకువచ్చి పిడిగుద్దులు గుద్దుతూ ఫోన్‌ గురించి ఆరా తీశారు. ఆ తర్వాత మహేష్‌ సోదరులు నరేష్‌, సుధీర్‌లు సైతం బాలరాజుపై మూకుమ్మడిగా దాడి చేయడం తో అతను మృతిచెందాడు. 


మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మహేష్‌ ఆటోలోనే ఉప్పల్‌ భగాయత్‌కు తరలించి దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు. నిందితుల్లో ప్రధాన ముద్దాయి మహే్‌షతో పాటు అతని సోదరుడు నరే‌ష్‌లు పాత నేరస్థులని, వీరిద్దరిపై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి, ఉప్పల్‌ ఏసీపీలు ఎన్‌.శ్యామ్‌ప్రసాద్‌ రావు, సిహెచ్‌.రంగస్వామి, ఐటీసెల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీధర్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ జి.నవీన్‌ కుమార్‌, ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement