యాదాద్రి జిల్లాలో పరువు హత్య

ABN , First Publish Date - 2022-04-18T07:51:58+05:30 IST

పరువు ప్రతిష్ఠలకు మరో నిండు ప్రాణం బలైంది..! కిరాతకకక్షకు.. ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది..! అనుక్షణం అప్రమత్తంగా ఉన్నా.. మామ పన్నిన మృత్యుపాశం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు.

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

  • యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాజీ హోంగార్డు
  • సహించ లేక కిరాతకంగా చంపించిన యువతి తండ్రి
  • నిందితుడు వీఆర్వో.. ఏడేళ్లుగా ఇద్దరూ పరిచయస్తులే..!
  • హత్యకు రూ.10 లక్షల సుపారీ.. రౌడీ షీటర్‌తో పథకం
  • డబ్బు ఇప్పించిన బీబీనగర్‌ ఠాణా హోంగార్డు యాదయ్య
  • భూములు కొంటామంటూ నమ్మించి నిమ్మతోటలో దాడి
  • మృతదేహం లకుడారం రైల్వే బ్రిడ్జి వద్ద గుంతలో పూడ్చివేత
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 17: పరువు ప్రతిష్ఠలకు మరో నిండు ప్రాణం బలైంది..! కిరాతకకక్షకు.. ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది..! అనుక్షణం అప్రమత్తంగా ఉన్నా.. మామ పన్నిన మృత్యుపాశం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు. వెరసి ఓ ప్రేమ కథ విషాదాంతమైంది..! అర్నెల్ల నుంచి సాగిన హత్యా పథకానికి చిక్కి ఓ మాజీ హోంగార్డు బలైపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమై.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో విగతజీవిగా కనిపించిన రామకృష్ణ గౌడ్‌ (35)ది పరువు హత్యగా తేలింది. తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్నందుకు, తీవ్రమైన పగ పెంచుకున్న యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన వీఆర్వో పల్లెర్ల వెంకటేశం.. రామకృష్ణను దారుణంగా హత్య చేయించినట్లు స్పష్టమైంది. భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామచంద్రు, కళమ్మ దంపతుల కుమారుడు రామకృష్ణ గౌడ్‌ 2015-19 మధ్య వలిగొండ, యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్లలో హోంగార్డుగా పనిచేశాడు. ఆ సమయంలో యాదగిరిగుట్టలో అతడు అద్దెకుంటున్న గదికి ఎదురుగా పల్లెర్ల వెంకటేశం కుటుంబం నివసించేది. ఈక్రమంలో వెంకటేశం కుమార్తె భార్గవి, రామకృష్ణ ప్రేమలో పడ్డారు.


వేర్వేరు సామాజికవర్గాలు (రామకృష్ణ గౌడ్‌.. భార్గవి ముదిరాజ్‌) కావడంతో వెంకటేశం వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కొద్దికాలం తర్వాత రామకృష్ణ భువనగిరి ఫైర్‌ స్టేషన్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లాడు. భువనగిరిలో విధులు నిర్వహిస్తుండగానే తుర్కపల్లి మండలం వేలుపల్లిలో గుప్త నిధుల కేసులో 2019 అక్టోబరులో రామకృష్ణ సస్పెండ్‌ అయ్యాడు. బెయిల్‌పై వచ్చాక స్థిరాస్తి వ్యాపారిగా మారాడు. ఇదే కేసులో పల్లెర్ల వెంకటేశం పేరూ ఉంది. ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లిలో పనిచేస్తున్నాడు.


ఏడాదిన్నర కిందట ఆర్య సమాజ్‌లో పెళ్లి 

వీఆర్వోగా కలిసివచ్చిన పరిచయాలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో వెంకటేశం బాగా ఆర్జించాడు. మరోవైపు తమ ప్రేమ విషయాన్ని భార్గవి, రామకృష్ణగౌడ్‌ ఇద్దరూ అతడికి చెప్పగా ఒప్పుకోలేదు. విడదీసేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో రామకృష్ణ, భార్గవి 2020 ఆగస్టు 16న హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.     వెంకటేశం మరింత కక్ష పెంచుకుని.. బిడ్డను ఇంటికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలను మొండిగా సాగించాడు. రామకృష్ణ దంపతులు రహస్యంగా పలుచోట్ల నివాసం ఉంటూ వచ్చారు. అయినా వెంటాడుతూ వచ్చిన వెంకటేశం.. మిర్యాలగూడ, హైదరాబాద్‌ ఉప్పల్‌ నుంచి భార్గవిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో తండ్రిపై ఆమె గతంలో యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు సయోధ్య ప్రయత్నాలు చేసి వెంకటేశంను హెచ్చరించారు. కాగా, ఏడాది నుంచి రామకృష్ణ దంపతులు భువనగిరి తాతానగర్‌లో ఓ ఇంట్లో ఉంటున్నారు. 6 నెలల క్రితం వీరికి కుమార్తె జన్మించింది.


రూ.10 లక్షల సుపారీ..

 తన వెంటే తిరిగి తనను మోసం చేశాడనే అక్కసుతో వెంకటేశ్‌.. రామకృష్ణపై పగ పెంచుకున్నాడు. మోత్కూరుకు చెందిన స్నేహితుడు, బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ హోం గార్డు యాదయ్యను సంప్రదించాడు. ఇద్దరూ సిద్దిపేటలో స్థిరపడిన మోత్కూరుకు చెందిన రౌడీ షీటర్‌ లతీ్‌ఫను కలిశారు. హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.3 లక్షలు ఇచ్చారు. రామకృష్ణ హత్యకు లతీఫ్‌ తన రెండో భార్య గోలి దివ్య, సిద్దిపేటకే చెందిన అఫ్సర్‌, మహేష్‌, కరీంనగర్‌ జిల్లా వేములవాడకు చెందిన ధనలక్ష్మి, భానుప్రకాశ్‌, దేవేందర్‌తో ముఠా కట్టాడు. ప్రణాళికలో భాగంగా ఆరు నెలలుగా భూములు కొంటామంటూ రామకృష్ణను లతీఫ్‌ ముఠా సంప్రదిస్తోంది. మరోవైపు నెలలు గడుస్తున్నా పని కాలేదంటూ లతీ్‌ఫపై వెంకటేశం ఒత్తిడి పెంచాడు. ప్లాన్‌ను అమల్లో పెట్టేందుకు రామకృష్ణను భూముల కోసం లతీఫ్‌ పలుసార్లు సంప్రదించాడు. దీంతో రామకృష్ణ తన వ్యాపార భాగస్వామి అయిన భువనగిరి మండలం జమ్మాపురం సర్పంచ్‌ భర్త అమృతరావుతో కలిసి లతీఫ్‌, అతడి సహచరులతో శుక్రవారం వాహనాల్లో బయల్దేరారు. వలిగొండ సమీపంలో భూములు నచ్చకపోవడంతో మోత్కూరు, గుండాల ప్రాంతాలకు వెళ్లారు.


నిమ్మతోటలో మారణాయుధాలతో దాడి చేసి

 లతీఫ్‌ ముఠా.. రామకృష్ణ, అమృతరావును మోత్కూరు- గుండాల ప్రాంతంలోని ఓ నిమ్మతోటలోకి తీసుకెళ్లింది. కొందరు అమృత్‌రావును గట్టిగా పట్టుకోగా మరికొందరు మారణాయుధాలతో రామకృష్ణపై దాడి చేయడంతో  మృతి చెందాడు. అమృత్‌రావును బెదిరించి వదిలిపెట్టారు. రామకృష్ణ మృతదేహాన్ని లతీఫ్‌ ముఠా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులో రైల్వే బ్రిడ్జి పక్కన గుంతలో పాతిపెట్టింది. భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అమృత్‌రావును ప్రశ్నించడంతో హత్యోదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలం నుంచి ఆదివారం ఉదయం భువనగిరి పోలీసులు రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించారు. ఏ1గా వెంకటేశం, ఏ2గా హోం గార్డు యాదయ్య, ఏ3గా రౌడీ షీటర్‌ లతీ్‌ఫతో పాటు 11 మందిపై హత్య కేసు నమోదు చేశారు. ఏ2, ఏ3తో పాటు దివ్య, అఫ్సర్‌, మహే్‌ష(సిద్దిపేట)ను అరెస్ట్‌ చేశారు. అమృత్‌రావును కేసులో ప్రత్యక్ష సాక్షిగా చేర్చారు. వెంకటేశంతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారని భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణ, రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు. 




రామకృష్ణ హత్యోదంతంపై భిన్న కథనాలు

నిమ్మ తోటలో దాడి.. సంచిలో వేసుకుని హైదరాబాద్‌కు కసితీరా కొట్టి..

హత్యను కళ్లారా చూసిన మామ వెంకటేశ్‌

రామకృష్ణ హత్యోదంతంపై స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. లతీఫ్‌ తన భార్య, ఇద్దరు మహిళలు సహా గ్యాంగ్‌తో ఈ నెల 15న ఉదయం 9.30కు రామకృష్ణగౌడ్‌ ఇంటికి వచ్చాడు. రామకృష్ణ బైక్‌ను భువనగిరిలోనే ఉంచి, లతీఫ్‌ వాహనంలో వెళ్లాడు. గుండాల శివారులోని ఓ నిమ్మ తోటను చూపుతుండగా నిందితులు రామకృష్ణను కొట్టడం మొదలుపెట్టారు. రామకృష్ణ, అమృత్‌రావు   ఇద్దరినీ  గోనె సంచుల్లో మూటకట్టుకొని కారులో వేసుకొని బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక అమృతరావును వదిలేశారు. రామకృష్ణను లతీఫ్‌ ముఠా హైదరాబాద్‌లోని ఓ ప్రదేశంలో కాల్చిన సీకులతో వాతలు పెట్టి, వేళ్లు కత్తిరించి, ప్యాంట్‌లో వాతలు పెట్టి రాత్రంతా చిత్రహింసలకు గురిచేసింది. కాళ్లు, చేతులు విరగొట్టింది. మొత్తం 13 మంది రామకృష్ణను తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. విషయాన్ని వెంకటేశంకు చెప్పగా.. తను వచ్చేదాకా చంపొద్దని కోరాడు. రామకృష్ణను చిత్రహింసలు పెడుతుండగా అతడు అక్కడే ఉన్నాడు. తను కూడా కసితీరా కొట్టాడు. కళ్లముందు రామకృష్ణను హతమార్చడం చూసి వెంకటేశం ఆనందించినట్లు సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్నందుకు  ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని వెంకటేశం.. భార్గవి నుంచి గతంలో సంతకాలు తీసుకున్నాడు.




ముప్పు రీత్యా.. ఎవరినీ నమ్మని రామకృష్ణ

మామ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఆలోచనతో రామకృష్ణ ఎవర్నీ నమ్మేవాడు కాదు. తన బైక్‌పైనే ఎంతదూరమైనా వెళ్లేవాడు. లొకేషన్‌ను, ఎవరితో వెళ్తున్నాడో వారి ఫోన్‌ నెంబర్లను భార్గవి సెల్‌ఫోన్‌లో సేవ్‌ చేసేవాడు. లతీఫ్‌ వెంట వెళ్లేముందు కూడా ఇదే పనిచేశాడు. కాగా, నిందితుల్లో ఒకరైన బీబీనగర్‌కు చెందిన హోంగార్డు గతంలో అతడితో కలిసి పనిచేశాడు. రామకృష్ణను నమ్మించేందుకు అతడినే ఈ హత్యలో వెంకటేశ్‌ భాగం చేసినట్లు సమాచారం. తన భర్త ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిన వెంటనే 100కు డయల్‌ చేసినట్లు భార్గవి తెలిపింది. పోలీసులు స్పందించలేదని, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సమాధానం ఇచ్చారని ఆరోపించింది. సరైన సమయంలో చర్య తీసుకుని ఉంటే రామకృష్ణ బతికి ఉండేవాడని రోదిస్తూ తెలిపింది.

Updated Date - 2022-04-18T07:51:58+05:30 IST