వాచ్‌మన్‌ హత్య కేసులో ఇంటర్‌ విద్యార్థి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-23T06:25:12+05:30 IST

రాజోలు మండలం తాటిపాకలోని శ్రీవేద జూనియర్‌ కళాశాలలో చొరబడి రాత్రి కాపలాదారుగా ఉన్న కొల్లాబత్తుల సుబ్బారావు(55)ను అతి కిరాతకంగా హత్య చేసి రూ.7,600 నగదు అపహరించుకుపోయిన ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం బి.పోలవరం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మల్లుల కార్తీక్‌(19)ని ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు.

వాచ్‌మన్‌ హత్య కేసులో ఇంటర్‌ విద్యార్థి అరెస్టు

అమలాపురం టౌన్‌, మే 22: రాజోలు మండలం తాటిపాకలోని శ్రీవేద జూనియర్‌ కళాశాలలో చొరబడి రాత్రి కాపలాదారుగా ఉన్న కొల్లాబత్తుల సుబ్బారావు(55)ను అతి కిరాతకంగా హత్య చేసి రూ.7,600 నగదు అపహరించుకుపోయిన ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం బి.పోలవరం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మల్లుల కార్తీక్‌(19)ని ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు.  మద్యంతో పాటు ఇతర వ్యసనాలకు బానిసై  సులభంగా డబ్బు సంపాదించడానికి ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడడమే కాకుండా అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకు  కూడా వెనుకాడడని పోలీసులు చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి వివరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న మల్లుల కార్తీక్‌ పాఠశాల స్థాయి నుంచి నేర ప్రవృత్తిలోనే ఉన్నాడని ఎస్పీ వివరించారు. రాజోలు పరిసర ప్రాంతాల్లోనే బాల్యమంతా గడి చింది. దాంతో రాజోలులోని ప్రైవేటు పాఠశాలలో చదు వుతున్న సమయంలోనే కార్తీక్‌ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న పాలకొల్లులోని భాష్యం స్కూలులో నైట్‌ వాచ్‌మెన్‌పై దాడిచేసి అత్యంత క్రూరంగా కొట్టి కళాశాల తాళాలు పగులకొట్టి నగదు అపహరించుకుపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నైట్‌ వాచ్‌మెన్‌ ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి తాటిపాకలోని శ్రీవేద జూనియర్‌ కళాశాలలో చొరబడ్డ కార్తీక్‌ నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల సుబ్బారావు తలపై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేశాడు. కళాశాలలోకి ప్రవేశించి రూ.7,600 నగదు అపహరించాడు. ఈ ఘటనలో సుబ్బారావు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుని అల్లుడు పిచ్చిక శివనాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఎన్‌.శేఖర్‌బాబు దర్యాప్తు చేపట్టారు.
శ్రీవేద జూనియర్‌ కళాశాలలో అర్ధరాత్రి చొరబడ్డ కార్తీక్‌ సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తాటిపాక సెంటర్‌ తదితర ప్రాంతాల్లో తాను వచ్చిన మోటారు సైకిల్‌తో వెళ్లిన విజువల్స్‌ సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పాలకొల్లులో చదువు కుంటున్న కార్తీక్‌ రాజోలులోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఏళ్ల తరబడి ఉం టున్నాడు. వసతి గృహంలోని ఓ విద్యార్థికి సం బంధించిన షర్టు ధరించి హత్యకు పాల్పడడంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ షర్టు ఎవరిదో పోలీసులు గుర్తించారు. దాంతో రెండు రోజుల వ్యవధిలోనే కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యకు వినియోగించిన రాడ్‌ను, మోటారు సైకిల్‌ను, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
 తక్కువ సమయంలో హత్య కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ లతామాధురి ప్రత్యేకంగా అభినందించారు. రాజోలు సీఐ ఎం.శేఖర్‌బాబు, సఖినేటిపల్లి ఎస్‌ఐ ఫణిమోహన్‌, మలికిపురం అడిషనల్‌ ఎస్‌ఐ కె.ప్రసాద్‌, క్రైమ్‌ సిబ్బంది అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, కె.గణేష్‌బాబు, కృష్ణసాయి, అర్జున్‌, శ్రీను, బి.సుబ్బారావు, జె.అప్పలరాజులకు క్యాష్‌ రివార్డులతో పాటు ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు.

Updated Date - 2022-05-23T06:25:12+05:30 IST