Abn logo
Sep 21 2021 @ 00:12AM

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

నిందితుల వివరాలు తెలుపుతున్న రూరల్‌ డిఎస్పీ

పథకం ప్రకారమే ఘాతుకం

రూరల్‌ డీఎస్పీ హరనాఽథ్‌రెడ్డి

నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 20: బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన మోడెం చంద్రశేఖర్‌రెడ్డి(54) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై హరనాథ్‌రెడ్డి సోమవారం ఆయన కార్యాలయంలో విలేకర్లకు వివరించారు. చంద్రశేఖర్‌రెడ్డి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించకపోవడంతో 15వ తేదీ ఆయన భార్య వసుధ బుచ్చిరెడ్డిపాళెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ కోటేశ్వరావు దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కోవూరుకు చెందిన డబ్బుగుంట సురేష్‌ అనే పాత నేరస్తుడు చంద్రశేఖర్‌రెడ్డి పొలాన్ని కౌలుకు చేస్తున్నాడని, వారి మధ్య కౌలు నగదు విషయమై విభేదాలు ఉన్నాయని తెలుసుకున్నారు. సురేష్‌ కౌలు నగదు రూ.2లక్షల వరకు చెల్లించాల్సి ఉండటంతో అతను పండించిన పంటను తానే విక్రయిస్తానని  చంద్రశేఖర్‌రెడ్డి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్‌ అతని స్నేహితులు అయ్యప్పస్వామి, శరత్‌, ఆదిశేఖర్‌, వెంకటేష్‌తో కలిసి చంద్రశేఖర్‌ రెడ్డి హత్యకు పథకం రచించాడు. రేబాల సమీపంలోని ఆర్‌కే లేఅవుట్‌లో మద్యం సేవించేందుకు చంద్రశేఖర్‌ రెడ్డిని పిలిచారు. మద్యంలో గడ్డి మందు కలిపి తాగించి అనంతరం ప్లాస్టిక్‌ వైర్‌ను మెడకు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పెన్నానదిలో పూడ్చివేశారు. ఈ కేసులో ఏ4 డ్రైవర్‌ వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారంతో అదృశ్యం కేసును హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని జనార్దన్‌రెడ్డి కాలనీ వద్ద ఇసుక నుంచి వెలికి తీశారు. అనంతరం మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రధాన సూత్రధారి సురేష్‌ను పాటూరులో పట్టుకున్నారు. అయ్యప్పస్వామి, శరత్‌ను కోవూరు మెయిన్‌ బజారులో, తోట ఆదిశేఖర్‌, యనమల వెంకటేష్‌ను సాలుచింతల వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మృతుడి వద్ద నుంచి దోచుకున్న రెండు ఉంగరాలు, రూ.1800 నగదు, మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరావు, బుచ్చి, సంగం ఎస్‌ఐలు కే ప్రసాద్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, ఏఎస్సై డీ హరేంద్రబాబు, సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులకు సిఫార్సు చేస్తున్నామన్నారు.