Abn logo
Aug 4 2021 @ 02:35AM

ప్రేమిస్తే చంపేశాడు..

నిందితుడు దీపక్‌

నిరుపేద బాలిక హత్య

చున్నీతో ఉరేసి హత్యచేసిన ప్రియుడు

ప్రేమ.. పెళ్లి పై నిలదీసినందుకు

ఐదురోజుల్లో రెండో ఘటన 

ఉలిక్కిపడ్డ నగరవాసులు


అల్వాల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని ఆమె చున్నీనే గొంతుకు బిగించి దారుణంగా చంపేశాడో ప్రియుడు. ఈ ఘటన అల్వాల్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఐదురోజుల క్రితం మాదాపూర్‌లో ఓ ప్రియురాలిని హతమార్చిన ప్రియుడి ఘటన మరవకముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసానికి బలైన యువతి.. కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చింది. మొన్న మాదాపూర్‌, నిన్న అల్వాల్‌లో ఒకే రకమైన ప్రేమ హత్యలు జరగడంతో నగరవాసులు, తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ వివరాలు వెల్లడించారు.


పరీక్షా కేంద్రంలో పరిచయం ప్రేమగా మారి.. 

అల్వాల్‌లోని ఓ కాలనీకి చెందిన నిరుపేద దంపతులకు కుమార్తె (17), కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరు నిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి వచ్చిన డబ్బులతో కుమార్తెను డిగ్రీ చదివిస్తున్నారు. ఇంటర్‌ చదువుతున్నప్పుడు అల్వాల్‌లోని ఓ ఎగ్జామ్‌ సెంటర్‌లో దీపక్‌ (20)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆది కాస్తా ప్రేమ గా మారడంతో గత ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన దీపక్‌ ఆ బాలికను లైంగికంగా లోబర్చుకున్నాడు. ఇటీవల బాలికతో తెగతెంపులు చేసుకో వాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేశాడు.


పెళ్లి చేసుకోవాలన్నందుకు.. 

ప్రేమించిన వ్యక్తి తనను దూరంగా పెట్టడంతో కంగుతిన్న బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఫోన్‌నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో దీపక్‌ స్నేహితులకు ఫోన్‌ చేసి వీళ్లద్వారా అతనితో మాట్లాడేది. ఇలా అయితే లాభం లేదనుకున్న బాలిక ఎలాగైనా తన ప్రేమ, పెళ్లి గురించి దీపక్‌ను నిలదీయాలని నిర్ణయించుకుంది. సోమవారం సాయంత్రం అతనికి ఫోన్‌ చేసి బీహెచ్‌ఈఎల్‌ క్వార్టర్స్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద కలుద్దామని చెప్పింది. దీంతో దీపక్‌ అక్కడకి చేరుకున్నాడు. వారిద్దరు కలిసి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. తనను ఎందుకు దూరం పెడుతున్నావని దీపక్‌ను నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. ఈ విషయమై వారిద్దరికి వాగ్వాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ ఆ బాలిక పట్టుబట్టి ప్రియుడితో ఘర్షణకు దిగింది. దాంతో కోపంతో ఊగిపోయిన దీపక్‌ ఆమె చున్నీతోనే ఆమె గొంతుకు ఉరి బిగించి దారుణంగా హత్య చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి వరకు కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. తెలిసిన వాళ్ల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ఉదయం రైల్వే క్వార్టర్స్‌ సమీపంలోని చెట్ల పొదల మధ్య యువతి చనిపోయి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం రావడంతో.. అల్వాల్‌ పోలీసులు క్లూస్‌ టీమ్‌సహా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే హత్య చేసినట్లు నిందితుడు దీపక్‌ విచారణలో వెల్లడించాడని పోలీసులు పేర్కొన్నారు.