- రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సమీక్ష
బెంగళూరు: అటల్‌పెన్షన్ పథకాన్ని అత్యంత విజయవంతంగా అమలు చేస్తున్నామని ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఏ మురళీకృష్ణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజనె (ఏపీవై) తీరుతెన్నులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో సోమవారం సమీక్షించారు. బెంగళూరులో ఏర్పాటైన సమావేశానికి కర్ణాటక పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలె్‌పమెంట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంతగోపాలదాస్ అధ్యక్షత వహించారు. ఎస్ల్బీసీ తరపున కెనరాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పీసీ దామోదరన్ తొలుత స్వాగతం పలికారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్‌గా ఉన్న కెనరాబ్యాంకు జనరల్ మేనేజర్ ఏ మురళీకృష్ణ తొలుత ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన గణాంక వివరాలను సభముందు ఉంచారు. కర్ణాటకలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,77,471 మంది ఈ పథకం ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇదే అవధిలో 6,33,220 మందికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించగా 44 శాతం మేరకు లక్ష్యాలను అందుకున్నామన్నారు. 18-40 ఏళ్ల లోపువారందరికీ ఈ పథకం ప్రయోజనాలు దక్కేలా మరింత చొరవ తీసుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. కాగా కర్ణాటక అంతటా 2021 నవంబరు నాటికి అటల్ పెన్షన్ పథకాన్ని 20,97,697 మందికి వర్తింపచేశామని వివరించారు. ఈ పెన్షన్ పథకం మధ్యతరగతి ప్రజలకు వరప్రసాదంగా ఉంటోందన్నారు. నాబార్డు జనరల్ మేనేజర్ సీవీ రెడ్డి, ఎన్యూఎల్ఎం డిప్యూటీ డైరెక్టర్ సప్తశ్రీ పథకం విశిష్టతలను ఉద్దేశించి ప్రసంగించారు.