Muttiah Muralitharan: శ్రీలంక క్రికెట్ గడ్డు దశలో ఉంది!

ABN , First Publish Date - 2021-07-23T01:47:36+05:30 IST

టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ జట్టు

Muttiah Muralitharan: శ్రీలంక క్రికెట్ గడ్డు దశలో ఉంది!

కొలంబో: టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తీవ్ర విమర్శలు చేశాడు. చూస్తుంటే శ్రీలంక జట్టు గెలుపును మర్చిపోయినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జట్టులో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్న మురళీధరన్.. శ్రీలంక క్రికెట్ గడ్డు దశలో ఉందన్నాడు. ఎలా గెలవాలో ఆ జట్టుకు తెలియదని, కొన్నేళ్లుగా ఆ జట్టు గెలుపు దారులను మర్చిపోయిందని అన్నాడు. 


మూడు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టిన హసరంగను చివరి ఓవర్ల కోసం ఉంచి కెప్టెన్ దాసున్ శనక తప్పు చేశాడని మురళీధరన్ విమర్శించాడు. మొదటి 10-15 ఓవర్లలో మూడు వికెట్లు కనుక తీయగలిగితే భారత జట్టు కష్టాల్లో పడుతుందని తాను ముందే చెప్పానని, అలాగే జరిగినప్పటికీ ఆ తర్వాత దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ కలిసి జట్టును ఆదుకున్నారని అన్నాడు. భారత జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు వికెట్ల కోసం ప్రయత్నించకుండా హసరంగను చివరి ఓవర్ల కోసం ఉంచడం ఘోర తప్పిదమన్నాడు. 


క్రీజులో పాతుకుపోయిన భువనేశ్వర్ కుమార్, చాహర్‌లలో ఏ ఒక్కరి వికెట్ తీసినా లంకకు విజయం దక్కేదని అన్నాడు. టెయిలెండర్లు ఆడుతున్న సమయంలో ఓవర్‌కు 8, 9 పరుగులు చేయడమంటే చాలా కష్టమని, కానీ లంక తప్పు చేసి విజయాన్ని జారవిడుచుకుందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో లంక జట్టు అనుభవలేమి కనిపిస్తోందని, ఆ జట్టు గెలవడం మర్చిపోయిందని ఎద్దేవా చేశాడు.


Updated Date - 2021-07-23T01:47:36+05:30 IST