By-election: ఈనెల 22 నుంచి మునుగోడులో బీజేపీ మకాం

ABN , First Publish Date - 2022-08-16T16:16:40+05:30 IST

మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By-Election)పై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.

By-election: ఈనెల 22 నుంచి మునుగోడులో బీజేపీ మకాం

నల్లగొండ (Nalgonda): మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By-Election)పై బీజేపీ (BJP) హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈనెల 21న కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా (Amit Shah) సభ తర్వాత.. 22వ తేదీ నుంచి ఆ పార్టీ నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. బైపోల్ కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ వేయనుంది. కాగా అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) బీజేపీ కండువా కప్పుకోనున్నారు. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంతో బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తోంది. కాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్నారు.


మునుగోడు నియోజక వర్గంలో ఉపఎన్నిక సందడి మొదలైంది. మేం అంటే మేం అంటూ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడడంతో నైరాశ్యం నుంచి బయటపడేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రోజుల వ్యవధిలోనే బహిరంగ సభ నిర్వహించడంతో ఇతర పార్టీలూ ఆ బాటలో పయనిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు వేచి చూద్దామనుకున్న టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని ఏకంగా గ్రామాల్లో ఎమ్మెల్యేల మకాం వరకు వెళ్లింది. ప్రధాన పోటీదారులు జనంలోకి వెళ్లడంతో గ్రాఫ్‌ పడిపోకుండా ఉంచేందుకు, 21న తనతో పాటు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్లు ఇస్తూ తన మార్కు బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు వరుస సమావేశాలు  నిర్వహిస్తుండగా, బీఎస్పీ గోడ రాతలతో ప్రచారం ప్రారంభించింది. దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) బరిలో ఉంటుందని విశారధన్‌, ప్రజాశాంతి కేఏపాల్‌ తన పార్టీ సైతం పోటీలో ఉంటుందని ప్రకటించారు.   

Updated Date - 2022-08-16T16:16:40+05:30 IST