Munugodu By Election: మునుగోడులో రాజకీయ సందడి.. ఊపందుకున్న వ్యాపారం..

ABN , First Publish Date - 2022-08-18T21:17:08+05:30 IST

మునుగోడు ఉపఎన్నిక (Munugodu By Election) నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది.

Munugodu By Election: మునుగోడులో రాజకీయ సందడి.. ఊపందుకున్న వ్యాపారం..

నల్గొండ (Nalgonda): మునుగోడు ఉపఎన్నిక (Munugodu By Election) నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఆరు నెలలలోపు ఎప్పుడైనా ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో వ్యాపారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మునుగోడులో మకాం వేయాల్సి రావడంతో లాడ్జీలు, రెస్టారెంట్లకు గిరాకీ పెరిగింది. నాయకులు బస చేయడం కోసం అద్దె ఇళ్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఉప ఎన్నికల నేపథ్యంలో వ్యాపారులు తమకు బిజినెస్ పెరిగిందన్న సంతోషంలో ఉన్నారు.


మంచి వసతులు ఉన్న అద్దె ఇళ్ల కోసం నేతలు అన్వేషిస్తున్నారు. కొందరు బడా నేతలు హోటళ్లవైపు చూస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని అద్దెఇళ్లు, హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మునుగోడు, చండూరులో ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 25వేలు పలుకుతున్నట్లు సమాచారం. ఇక ఉన్న లాడ్జీలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఇళ్లు, హోటళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉండే చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇళ్లు, లాడ్జీలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు రూ. 10వేలు పలికిన ఇళ్లు, షెట్టర్ అద్దెలు ఇప్పుడు రూ. 15వేలు దాటాయి. ఇక ఫంక్షన్ హాల్స్ మొత్తం బుక్ చేసుకుని అక్కడే రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడంతో వాటికీ డిమాండ్ పెరిగింది.


మునుగోడులో ఈనెల 20న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు చొప్పున ఇన్చార్జులను ఆ పార్టీ నియమించింది. దీంతో వారు అక్కడే ఉంటూ కేడర్ బలోపేతం చేస్తున్నారు. ఆ మరుసటి రోజే (21న) బీజేపీ అగ్రనేత అమిత్ షా బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ నేతల తాకిడీ ఉండనుంది. మీటింగ్ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అక్కడ మకాం వేయనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే హోటళ్లు, లాడ్జీలకు అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. బహిరంగ సభల నేపథ్యంలో రైతుల భూములకు డబ్బులు ఇస్తున్నారు. రైతులు సాగు చేసిన భూముల్లో సభ నిర్వహిస్తుండడంతో పత్తి పంట పాడయ్యే పరిస్థితి నెలకొంది. పరిహారంగా రైతులకు ఎకరానికి రూ. 60వేలు చొప్పున ఇప్పటికే 30 ఎకరాలకు టీఆర్ఎస్ పార్టీ ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి.

Updated Date - 2022-08-18T21:17:08+05:30 IST